
భారతదేశంలోని ప్రముఖ శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయాలలో ఒకటి శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి దేవస్థానం. ఇక్కడి ఏక సాలిగ్రామ శిలపై స్వయంభూగా వెలసిన స్వామివారి మూలవిరాట్టును దేవతల రాజు అయిన దేవేంద్రుడు ప్రతిష్టించి పూజ చేసి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందారని ప్రతీతి.ఉషా, ఛాయ ,పద్మిని అమ్మవార్లు, తన సపరివారం అoతటితో ఇక్కడ స్వామివారు మనకు దర్శనం ఇస్తారు. ఇక్కడి స్వామివారిని ఆరోగ్య ప్రదాతగా, ప్రత్యక్ష దైవంగా భక్తులు కొలుస్తారు.

ఎంతో మహిమాన్వితమైన అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ప్రతియేట మార్చి, అక్టోబర్ నెలలలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతం అవుతూ ఉంటుంది. సూర్య గమనం ఆదరంగా ప్రతి ఏటా దక్షిణాయంలో అక్టోబర్ 1, 2 తేదీలు, ఉత్తరాయణంలో మార్చి 9,10 తేదీల్లో ఆలయ గర్భగుడిలోని మూల విరాట్‌ను సూర్యకిరణాలు నేరుగా తాకడం అరసవల్లి ఆలయంలోని ప్రత్యేకం. ఈ అద్భుత దృశ్యాన్ని చూసేందుకు ప్రతి సారి ఎక్కడెక్కడి నుండో భక్తులు ఆలయానికి భారీగా తరలి వస్తూ ఉంటారు. అయితే ఈసారి అక్టోబర్ 1న జరగబోయే ప్రక్రియను చూసేoదుకు గురువారం ఉదయం శ్రీకాకుళం MLA గొoడు శంకర్ సహా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు భారీగా తరలి రాగా వారిని ఈసారి సూర్య కిరణాలు కొంత నిరాశకు గురిచేశాయి.

గురువారం ఉదయం సూర్యోదయ సమయంలో ఆకాశం పారదర్శకంగా లేకపోవటంతో కిరణాలు స్వామి వారిని తాకలేదు. కిరణాలు స్వామివారి పై పడకపోవడంతో భక్తులు కొంతమేర నిరాశకు గురయ్యారు. అయితే గురువారం స్వామివారిపై సూర్య కిరణాలు పడనప్పటికీ భక్తులు నిరాశ పడాల్సిన పని లేదని శుక్రవారం కిరణాలు తాకే అవకాశాలు ఉన్నాయని MLA గొoడు శంకర్ తెలిపారు.

అక్టోబర్ లో సూర్య కిరణాలు గర్భగుడిలోని స్వామివారి మూల విరాట్టు పై పడినప్పటికీ ఇటీవల తరచూ వాతావరణం అనుకూలించక ఆదిత్యుడికి కిరణాలు స్పశించటo అరుదుగా జరుగుతుంది. అరసవల్లి దేవస్థానం లో సూర్యకిరణాలు గాలి గోపురాన్ని దాటుకుంటూ అనివెట్టి మండపం, ధ్వజస్తంబం మీదుగా, ఆలయ పంచద్వారాలను దాటుకుంటూ, గర్భగుడిలోని స్వామి వారి మూలవిరాట్‌ను తాకటo చూసేవారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

ఇది ఆలయ నిర్మాణంలోని ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం అని కొందరు అంటే ఇది నిజంగా స్వామి వారి మహిమ అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ కమనీయ దృశ్యాన్ని చూడడానికి ఆయా సందర్భాలలో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలి వస్తారు. ఆలయ అధికారులు ఈ ప్రత్యేక రోజులలో సూర్య కిరణాలకు, స్వామివారికి మధ్య ఎవరు అడ్డు రాకుండా ఉండేందుకు బారికేడ్లు పెట్టి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తూ ఉంటారు.