
రెండో విడతలో సుమారు 3.29 లక్షల మంది విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో రూ.13 వేల చొప్పున నగదు జమ చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులు, ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల తల్లులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో వివిధ కారణాలతో ఆర్థిక సాయం అందని అర్హులైన వారికి కూడా ఈ విడతలో ప్రయోజనం కల్పించనున్నట్లు సమాచారం.

'thalliki Vandanam' Second Phase Release Date

వచ్చే వారంలోనే నిధులు జమ అయ్యే అవకాశం ఉందని.. లేదంటే ఒకటి రెండు వారాల్లో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.ఇక నిధుల జమ సమయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా లబ్ధిదారులు తమ వివరాలను ముందుగానే సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

తల్లి బ్యాంకు ఖాతాకు ఆధార్ అనుసంధానం జరిగిందా, ఈ-కేవైసీ పూర్తయిందా అనే విషయాలను నిర్ధారించుకోవాలని చెబుతున్నారు. విద్యార్థి, తల్లి ఆధార్ వివరాలతో పాటు బ్యాంకు ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వంటి వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో కూడా పరిశీలించుకోవాలని సూచించారు. లేదంటో అర్హులైన విద్యార్థులకు కూడా నిధులు అందకపోవచ్చని తెలిపారు.

ఆర్థిక శాఖ ఆమోదం పూర్తవడంతో ‘తల్లికి వందనం’ రెండో విడత నిధుల విడుదలకు ప్రక్రియ ముందుకు కదిలింది. ఇక సీఎంవో తుది అనుమతి కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు. సీఎంవో నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తల్లికి వందనం లబ్ధిదారుల తల్లుల ఖాతాల్లో రూ.13వేలు , విద్యార్థులు చదువుతున్న స్కూళ్ల ఖాతాల్లో రూ.2వేలు జమకానున్నాయి.