
తుపానుకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సోషల్ మీడియాలో వచ్చే అనవసర పుకార్లను నమ్మవద్దని.. భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించింది. అత్యవసర సమాచారం కోసం మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు ఫుల్ ఛార్జింగ్‌లో ఉంచుకోవాలని.. ప్రభుత్వం పంపే హెచ్చరిక ఎస్ఎంఎస్ (SMS)లను గమనించాలని తెలిపింది. అధికారిక సమాచారం కోసం రేడియో, టీవీ వార్తలను ఫాలో అవ్వాలని.. విలువైన పత్రాలు, విద్యా సర్టిఫికెట్లను తడిసిపోకుండా వాటర్‌ప్రూఫ్ కవర్లలో భద్రపరుచుకోవాలని తెలిపింది.

మందులు, టార్చ్ లైట్ వంటి నిత్యావసరాలతో కూడిన ఎమర్జెన్సీ కిట్’ను ముందే సిద్ధం చేసుకోవాలని.. ఇంటి పైకప్పులు, రేకుల షెడ్లను భద్రపరుచుకుని, అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని తెలిపింది. కనీసం ఒక వారానికి సరిపడా ఆహార పదార్థాలు, సురక్షిత తాగునీటిని నిల్వ ఉంచుకోవాలని.. లోతట్టు ప్రాంతాలు, వరద లేదా ఉప్పెన ముప్పు ఉన్న ప్రాంతాల ప్రజలు అధికారులు సూచించిన వెంటనే సురక్షిత ఆశ్రయాలకు తరలివెళ్లాలని సూచించింది.

తుపాను సమయంలో ఇంట్లో ఉన్నప్పుడు వెంటనే విద్యుత్ మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడంతో పాటు గ్యాస్ కనెక్షన్లను తొలగించాలని.. ఇంటి తలుపులు, కిటికీలను గట్టిగా మూసి ఉంచాలని తెలిపింది. ఇల్లు సురక్షితం కాకపోతే ముందే సురక్షిత ప్రాంతానికి చేరుకోవాలని.. భవనం దెబ్బతినే సూచనలు కనిపిస్తే దృఢమైన టేబుల్ లేదా బెంచ్ కింద రక్షణ పొందాలని తెలిపింది. బయట ఉన్నవారు పాత భవనాలు, చెట్లు, కరెంట్ స్తంభాల కింద ఎట్టిపరిస్థితుల్లోనూ నిలబడకూడదని.. ఈదురుగాలి వేగం కాస్త తగ్గినా తుపాను ముగిసిందని భావించి బయటకు రాకూడదని తెలిపింది అధికారులు 'ఆల్ క్లియర్' ప్రకటించే వరకు వేచి ఉండాలని కోరింది.

తుపాను ముగిసిన తర్వాత అంటువ్యాధులు సోకకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన లేదా క్లోరినేటెడ్ నీటిని మాత్రమే తాగాలని.. అధికారిక సమాచారం వచ్చే వరకు షెల్టర్ వదిలి ఇళ్లకు వెళ్లరాదని తెలిపింది. నేలపై తెగిపడిన విద్యుత్ తీగలు, విరిగిపడిన స్తంభాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తడిసిన లేదా దెబ్బతిన్న ఎలక్ట్రానిక్ వస్తువులను ప్రొఫెషనల్ ఎలక్ట్రీషియన్ తనిఖీ చేసిన తర్వాతే వినియోగించాలని కోరింది.

మత్స్యకారులకు ఆదేశాలు: సముద్రం అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వేటకు వెళ్లరాదని అధికారులు ఆదేశించారు. పడవలు, తెప్పలను ఒడ్డున సురక్షిత ప్రాంతాల్లో బలమైన తాళ్లతో కట్టి ఉంచాలని, సమాచార మార్పిడి కోసం మొబైల్ ఫోన్లు, అదనపు బ్యాటరీలు కలిగిన రేడియోలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు.