
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం మారుతోంది. ఒకవైపు నైరుతి రుతుపవనాలు నిష్క్రమించగా.. మరోవైపు ఈశాన్య రుతుపవనాల ఎంట్రీ ఇచ్చాయి.. దీంతోపాటు బంగాళాఖాతంలో ఏర్పడిన మార్పులతో వచ్చే 4 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే 4 రోజుల పాటు ఉరుములతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. విజయనగరం, మన్యం, అల్లూరి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన చెదురుమదురు వర్షాలు కురుస్తాయని తెలిపింది.

శ్రీకాకుళం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం దాదాపు అన్ని ప్రాంతాల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

తెలంగాణకు వాతావరణ సూచన: తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో పాటు ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది.

రాబోయే మూడు నాలుగు రోజుల పాటు కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఉరుములు, గంటకు 30–40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. అంతేకాకుండా, చెట్ల క్రింద, భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని హెచ్చరించింది..