ఎక్కడ పెద్దకళ్ళేపల్లి. ఎక్కడ తెలుగుసినీ పాటకు పల్లకీ. రాలిపోయే పువ్వు మీద రాగాలు పలికించి, మాతృదేవతను పదాలతో అర్చించి.. తెలుగుప్రేక్షకుడి హృదయాన్ని కరుణరసంలో ముంచెత్తి తెలుగుపాటకు జాతీయగౌరవం దక్కించిన ఘనాపాటి. అంతా తెలుగుపాట చేసుకున్న అదృష్టం కాక మరేమిటి? పిల్లనగోవికి ఒళ్లంతా గాయాలే అనిపించి, నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మా… ఆ కట్టుబడికి తరించేను పట్టుపురుగు జన్మ అంటూ సరికొత్తగా భావాన్ని పలికించి . ఉచ్ఛ్వాస- నిశ్వాసములు వాయులీనాలని ప్రేక్షకులను ఓలలాడించి.. ఇలా చెబుతూ పోతే ఎన్నో ఎన్నెన్నో. ఇదంతా తెలుగు సినిమాకు పట్టిన తేనెపాటలపట్టు అని సగర్వంగా చెప్పుకోవచ్చు. అసలు ఆయన వచ్చాకే తెలుగుపాట కళలు దిద్దుకుంది. వొగలు వొలికించింది. ఇంటిపేరు వేటూరి. ఒంటి పేరు సుందరరామమూర్తి(Veturi Sundararama Murthy), ఊరిపేరు పెదకళ్ళేపల్లి, పుట్టింది 1936, జనవరి 29. చదివింది మద్రాస్, విజయవాడ. తిరుపతి వెంకట కవులు, దైతాగోపాలం, మల్లాదిగార్ల దగ్గర శిష్యరికం.. ఆంధ్రప్రభలో ఉప సంపాదకత్వం.. కే. విశ్వనాధ్ తీసిన ఓ సీతకథ తో సినీరంగ ప్రవేశం. ఆ తరువాత… చెప్పేదేముందీ ఎనిమిది నందులు. ఒక జాతీయ గౌరవం దక్కించుకున్న పాటలకు పదాలద్దిన ఘనత. ఇదీ వేటూరికి చెందిన సంక్షిప్త సమాచారం. ఇవాళ ఆ మహానుభావుడి జయంతి. ఆయనను గుర్తు చేసుకోవడానికి జయంతో వర్ధంతో అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిత్య స్మరణీయుడు కాబట్టి. పాటగా ప్రతీ రోజు మనల్ని పలకరిస్తూనే వున్నారు కాబట్టి.
వేటూరి సుందరరామమూర్తి తెలుగు సినిమా కోకిలమ్మకి పాటల పందిరి వేశారు. తెలుగు పాటలమ్మకి పట్టు చీరలు తొడిగించారు. పాటను పరవళ్లు తొక్కించారు. ఉరకలెత్తించారు. భాష భావుకతలను రెండు కళ్లుగా చేసుకున్నారు. ఆయన సవ్యసాచి. ఆయన పాళికి రెండు వైపులా పదునే! మసాలాలు దట్టించి మాస్‌ను పట్టుకోగలిగారు. సంస్కృత సమాసాలు పట్టించి క్లాస్‌ను ఆకట్టుకోగలిగారు. తెలుగు సినీ సరస్వతికి పాటల మాలలు అల్లిన సృజనశీలి. సినీ సంగీత లక్ష్మికి సుగంధాలను అద్దిన పదశిల్పి. అసలు తెలుగు సినిమా పాటను కోటి రూపాయల స్థాయికి తీసుకెళ్లింది ఆయనే! ఆయనది ప్రత్యేకమైన శైలి. ఎవరికి అందని బంగారు పాళి. ఒక్కోసారి ఆయన పాటలు వింటుంటే మల్లాది రామకృష్ణ శాస్తి రాశారేమోనని అనిపిస్తుంది. మరోసారి సముద్రాల కలం కాదుగా అన్న సందేహం వస్తుంది.. ఇంకోసారి పింగళి పాటలా తోస్తుంది. కృష్ణశాస్త్రి పద పల్లవాలు, శ్రీశ్రీ మెరుపులు .. ఆత్రేయ విరుపులు కూడా కాకతాళియంగానే మనసులో మెదులుతాయి. పాటను సర్వాలంకార భూషితంగా తీర్చిదిద్దడంలో వేటూరి ఘనాపాటి. సరస సరాగాల సుమవాణిగా వినిపించడంలో ఆయనకు ఆయనేసాటి. మాటలనే పాటలుగా లయాత్మక విన్యాసాలుగా సున్నితంగా మలచిన మేటి! తేనెకన్నా తీయని తెలుగు నుడికారాలను మనకందించిన తేటి! కాలంతో పాటే పాట నడకను మార్చడంలో ఆయనకెవ్వరూ లేరు పోటి.
ఏడో దశకంలో పిల్ల తెమ్మరలా ప్రవేశించి, చిరుగాలిలా చెలరేగి, ప్రభంజనమై వీచారు వేటూరి సుందరరామమూర్తి. ఆయన పాళి చేయని విన్యాసం లేదు. రాయని భావ సౌందర్యం లేదు. సినిమా పాటకు కొత్త వగరునీ, పొగరునీ, పరిమళాన్నీ తెచ్చింది వేటూరే! తన బాణీతో పాటకి వోణీలు వేయించీ తీయించిన గడుగ్గేయ చక్రవర్తి కూడా ఆయనే! తెలుగు సినిమా ఓ అందమైన పూలతోట అయితే.. ఆ పూదోటలో పెరిగిన పాటల చెట్టకు రంగు రంగుల పూలిచ్చారు. కొమ్మకొమ్మకో కోటిరాగాలనిచ్చారు. తెలుగు వారి హృదయాల్లో మల్లెలు పూయించారు.. వెన్నెల కాయించారు. పాటలమ్మ కంఠంలోని హారానికి పదాల వజ్రాలను అందంగా.. అలంకారంగా పొదిగిన ఆ పదశిల్పి నిజంగానే కారణజన్ముడు.. ఆయన వంటి కవి వెయ్యేళ్లకు కానీ పుట్టడు. ఈ సహాస్రాబ్దిలో పుడతారన్న నమ్మకం లేదు. ఆయన కలం సోకిన సినీ సంగీత నాదాలు ఝమ్మంటూ మోగుతూనే వుంటాయి…తెలుగువారి తనువులు ఆ మంగళనాదంతో ఊగుతూనే వుంటాయి.