Mahatma Mohandas Karamchand Gandhi: మోహన్‌దాస్ కరమ్‌చంద్ గాంధీ. ఆయన గురించి ఏం చెప్పగలం? ఏం చెబితే పరిపూర్ణమవుతుంది? అందరికీ ఆదర్శప్రాయుడు, అందరికీ మార్గ దర్శకుడు, అందరికీ ఆరాధ్య నాయకుడు అయిన ఆ మహనీయుడి గురించి కొత్తగా చెప్పేదేముంటుంది? ఆయన మహాత్ముడు, జాతిపిత, సత్య శోధకుడు, సాత్విత చింతకుడు. ఇవి సరిపోతాయా? సత్యాగ్రహమే సాధనమ్ముగా స్వరాజ్యాన్ని సాధించి పెట్టిన ఆ యోధుడికి, అహింసకు మించిన ఆయుధం లేదని త్రికరణశుద్ధిగా విశ్వసించిన ఆ మహా మనీషికి, కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టివేస్తుందని నమ్మిన మహర్షికి, ఆత్మాభిమానం, గౌరవాలు వేరెవరో పరిరక్షించరు. మనకు మనమే వాటిని కాపాడుకోవాలని చెప్పిన తాత్వికుడికి ఎలా నివాళి అర్పించగలం? ఇవాళ ఆయనను కాల్చి చంపిన రోజే కావచ్చు. అప్పట్నుంచి ఇప్పటి వరకు నిత్యం ఆ మహనీయుడిని చంపుతూనే ఉన్నారు కదా!
గడ్డిపరకతో విప్లవాలు, ఉప్పుతో ఉద్యమాలు తీసుకురావచ్చంటే నమ్మడం కష్టమే! కానీ ప్రజల నాడి తెలిసిన మహాత్ములకు, సామాన్యుల మర్మం తెలిసిన మహనీయులకు ఇదేం కష్టమైన పని కాదు. ఉప్పుపై తెల్లదొరలు పన్నులు వేసినప్పుడు గాంధీ దానినే ఓ ఉద్యమ నిర్మాణానికి ఊతంగా మలుచుకున్నారు.. ఇది ప్రపంచం యావత్ దృష్టిని ఆకర్షించిన అహింసాయుత ఆందోళన!
కొల్లాయి కట్టిన కర్మయోగి-హింసకు అహింస నేర్పిన పరమహంస- గాంధీ స్ఫూర్తి పొందని దేశాలు లేవు. బక్క చిక్కిన మనోబలుడు. బోసినవ్వుల దార్శనికుడు గురించి ఎవరు ఏమన్నారో తెలుసుకుంటే ఆయనేమిటో తెలుస్తుంది.
అసలు రక్తమాంసాలున్న ఇలాంటి మనిషి భూమ్మీద నడిచాడంటే భవిష్యత్తరాలు నమ్మకపోవచ్చు. భావితరాలకు గాంధీ ఓ రోల్‌మోడల్. మహాత్ముడి అభిప్రాయాలు సమకాలీన రాజకీయ నాయకుల్ని జాగృత పరుస్తాయని నమ్ముతున్నా.
-విశ్వ విఖ్యాత శాస్ర్తవేత్త అల్బర్ట్ ఐన్‌స్టీన్…
జీసస్ నాకు సందేశమిచ్చాడు. గాంధీ దాన్ని ఆచరణలో చూపాడు.
-మార్టిన్ లూధర్ కింగ్
పూర్వీకులు, ప్రస్తుతమున్న వారు వీరిలో ఎవరితోనైనా సరే నేను విందారగించాల్సి వస్తే.. అది గాంధీతోనే కావొచ్చు. ఎందుకంటే ఆయనే నా నిజమైన హీరో.
-అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా
కోపగించుకోవడం, ఇతరుల్ని కించపరచడం లాంటివి చేయొద్దని బుద్ధుడు తన శిష్యులకు చెప్పారు. అహింసాయుత పద్ధతుల్ని గాంధీజీ విశ్వసించారు. బలంతో సాధించేదాని కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన ఫలితాల్ని ఆయన సాధించారు.
-ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధాన కార్యదర్శి యు థాంట్
భారతదేశంలోని లక్షల మంది అనాథల ఆశాదీపంగా మహాత్మాగాంధీ నిలిచారు. ఆయన రక్తమాంసాలు భారతీయుడి ఆత్మ అయి నిలిచాయి. సత్యం మరో సత్యాన్ని జాగృతం చేసింది.
-విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్
గాంధీజీకి మరణం లేదు. గాంధీజీ ఆలోచనలు, మాటలు, చర్యలు ప్రపంచంలోని కొన్ని కోట్ల మంది స్వేచ్ఛను పొందేలా ప్రభావితం చేశాయి.
– జాంబియా మొదటి అధ్యక్షుడు కెన్నెత్ కౌండా
నేను, నా అనుచరులం విప్లవయోధులమే కావొచ్చు. కానీ మేం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో మహాత్మాగాంధీని ఆరాధించేవాళ్లం.
– వియత్నాం కమ్యూనిస్టు నేత హోచిమిన్
గాంధీపై అభిప్రాయం చెప్పమంటారా? హిమాలయాల గురించి అభిప్రాయం చెప్పండి అన్నట్లుంది.
– నోబెల్ బహుమతి గ్రహీత జార్జి బెర్నార్డ్ షా
గాంధీజీ అహింస గురించి మాట్లాడటమే కాదు, దాని ద్వారా న్యాయం, స్వేచ్ఛను ఎలా సాధించవచ్చో ఆచరించి చూపించారు.
– మెక్సికన్ అమెరికన్ కార్మికోద్యమ నేత, పౌర హక్కుల నాయకుడు సెసర్ చావెజ్.
స్వాంతంత్ర్యం వచ్చిన తొలి నాళ్ల ముచ్చటిది.
వేడుకలకు ఆయన దూరంగా వున్నాడు.. కల్‌కత్తాలో జరిగిన మతకల్లోలాన్ని చల్లార్చే బాధ్యత తీసుకున్నాడు.. ప్రజలకు ఓదార్పునివ్వడానికి అక్కడే వున్నాడు.. ప్రజలు ఊచకోతకు గురైన నవకాళీ వీధుల్లో ఆయన ఒంటరిగా నడిచి వెళుతుంటే …ఆయన సిద్ధాంతాలను జీవితాంతం వ్యతిరేకించిన ఎంఎన్‌రాయ్ ఆశ్చర్యపోయాడు.. గాంధీ మనో నిబ్బరానికి ముచ్చట పడిపోయాడు.. ఇప్పుడా పరిస్థితి వుందా? సాయుధ బలగాలు.. సెక్యూరిటీ గార్డులు.. కాన్వాయ్‌లు.. మందీ మార్చాలం లేకుండా ప్రజల మధ్యకొచ్చే నేతలెవరైనా వున్నారా? ప్రజలకు చేరువయ్యే నాయకులున్నారా? అంతెందుకు పరమత సహనాన్ని గాంధీజీ పాటించేవారంటే ఇప్పటి నాయకులు నవ్వుకోరూ!
చివరగా ఓ చిన్నమాట
బాపూ…నిన్ను ఆడిపోసుకుంటున్నవారికి కూడా నీ చల్లని దీవెనను ఇవ్వు… నీ బాటను నడిచే బలం వారికివ్వు..
రఘుపతి రాఘవ రాజారాం…పతిత పావన సీతారాం…ఈశ్వర అల్లా తేరే నాం…సబకో సన్మతి దే భగవాన్..
Read Also….. తెలంగాణ ఆధ్యాత్మిక సిగలో మరో అద్భుతం ఆవిష్కృతం.. సమతామూర్తి శ్రీరామానుజాచార్య నిలువెత్తు రూపం