ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..!

ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు ట్రాయ్ శుభవార్త అందించింది. ఇకపై టెలికాం కంపెనీలు 28 రోజుల బదులు 30 రోజుల వ్యాలిడిటీ గల రీఛార్జ్ ప్లాన్‌లను అందించాలి. డేటా అవసరం లేని వారికి కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే అందించే ప్రత్యేక ప్లాన్‌లను కూడా అందుబాటులోకి తేవాలని ఆదేశించింది. దీంతో వినియోగదారులు అనవసరంగా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సిన అవసరం తొలగి, తమ అవసరాలకు తగ్గ ప్లాన్‌లను ఎంచుకునే వెసులుబాటు లభిస్తుంది.

ప్రీపెయిడ్ మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..!
Prepaid Recharge Plans
Image Credit source: AI Image

Updated on: Sep 27, 2026 | 3:44 PM

న్యూఢిల్లీ: దేశంలోని ప్రీపెయిడ్ మొబైల్ వినియోగదారులకు సంబంధించిన ఓ కీలక అంశంపై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) నిర్ణయం తీసుకుంది. 28 రోజుల వ్యాలిడిటీతో ఉండే రీఛార్జ్ ప్లాన్లకు ప్రత్యామ్నాయంగా 30 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలవ్యవధి కలిగిన వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకురావాలని టెలికాం సంస్థలకు ఆదేశించింది. TRAI ఈ మేరకు టెలికాం వినియోగదారుల రక్షణ (13వ సవరణ) నిబంధనలు, 2026ను సెప్టెంబర్ 22న జారీ చేసింది.

ఈ అంశాన్ని రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా మార్చి 11న పార్లమెంటులో ప్రస్తావించారు. నెలకు 30 రోజుల చొప్పున కాకుండా 28 రోజుల వ్యాలిడిటీతో ఉండే ప్లాన్ల వల్ల వినియోగదారులు ఏడాదికి 12 నెలలకుగాను 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రీపెయిడ్ వినియోగదారులకు మరింత అనుకూలమైన వ్యాలిడిటీ ఆప్షన్లు కల్పించాలని కోరారు.

అలాగే మొబైల్ డేటా అవసరం లేని వినియోగదారుల కోసం ప్రత్యేకంగా వాయిస్, SMS Only ప్లాన్లు అందుబాటులో ఉండాలని ఆయన కోరారు. ముఖ్యంగా ఫోన్‌ను ప్రధానంగా కాల్స్, ఎస్ఎంఎస్‌ల కోసం ఉపయోగించే వినియోగదారులు డేటా కోసం అదనపు మొత్తాన్ని చెల్లించాల్సిన అవసరం లేకుండా తమ అవసరానికి తగ్గ ప్లాన్ ఎంచుకునే అవకాశం ఉండాలని వాదించారు.

TRAI తాజా నిబంధనల ప్రకారం టెలికాం కంపెనీలు కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు అందించే ప్రత్యేక టారిఫ్ వోచర్లను అందించాలి. వీటిలో 30 రోజులు లేదా అంతకంటే తక్కువ వ్యాలిడిటీ ఉన్న ఆప్షన్లు, ప్రతి నెల ఒకే తేదీన పునరుద్ధరించుకునే ప్లాన్‌తో పాటు కనీసం ఒక దీర్ఘకాలిక ప్లాన్ కూడా ఉండాలి. TRAI ఇప్పటికే కాల్స్, ఎస్ఎంఎస్‌ల కోసం ప్రత్యేక ఫ్లాన్స్‌కు సంబంధించి ప్రత్యేక సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచింది. డేటా అవసరం లేని వినియోగదారులు ఇంటర్నెట్ డేటా లేకుండా కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ సేవల కోసం ఈ తరహా ప్రీపెయిడ్ ప్లాన్లను ఎంచుకోవచ్చు.

ఈ నిర్ణయాన్ని రాఘవ్ చద్దా స్వాగతించారు. పార్లమెంటులో ప్రజల సమస్యను ప్రస్తావించడం, దానిపై ప్రభుత్వం–నియంత్రణ సంస్థ స్పందించడం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్మాణాత్మక రాజకీయాలకు ఉదాహరణగా ఆయన అభివర్ణించారు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఇదే విధంగా కలిసి పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా, డేటా అవసరం లేని వినియోగదారులకు మరిన్ని ఎంపికలు లభించడంతో పాటు.. చిన్న వ్యాలిడిటీతో వాయిస్, ఎస్ఎంఎస్ సేవలు కోరుకునే వారికి రీఛార్జ్ ప్లాన్ల విషయంలో మరింత వెసులుబాటు కలగనుంది. అయితే ప్రతి టెలికాం సంస్థ అందించే ప్లాన్ల ధరలు, ప్రయోజనాలు వేర్వేరుగా ఉండొచ్చు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us