Heat Wave: బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!

|

Mar 29, 2024 | 7:01 PM

ఈసారి వేసవి ఫిబ్రవరిలోనే ఎంట్రీ ఇచ్చిందా అనిపిస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్‌ నుంచే దేశంలోని పలు రాష్ట్రాల్లోఎ ఎండ తీవ్రత పెరిగింది. అడపాదడపా కొన్నిచోట్ల వానలు పడినా వేడి ఏమాత్రం తగ్గలేదు. మార్చినెల ముగుస్తోంది.. ఈ నెలలో కూడా సూర్యుడు రోజు రోజుకీ తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు.

Heat Wave: బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
Summer Effect
Follow us on

ఈసారి వేసవి ఫిబ్రవరిలోనే ఎంట్రీ ఇచ్చిందా అనిపిస్తోంది. ఫిబ్రవరి ఎండింగ్‌ నుంచే దేశంలోని పలు రాష్ట్రాల్లోఎ ఎండ తీవ్రత పెరిగింది. అడపాదడపా కొన్నిచోట్ల వానలు పడినా వేడి ఏమాత్రం తగ్గలేదు. మార్చినెల ముగుస్తోంది.. ఈ నెలలో కూడా సూర్యుడు రోజు రోజుకీ తన ప్రతాపాన్ని పెంచుతున్నాడు. ఇక రానున్న రెండు నెలలూ భగభగలే అంటున్నారు వాతావరణశాఖ అధికారులు. ఈ క్రమంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. అవసరమైతే తప్ప ఇంటినుంచి బయటకు వెళ్లరాదని సూచించారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. సాధారణంతో పోలిస్తే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణతోపాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో వేడి సెగలు రేగుతున్నాయి. గత రెండు నెలలకు సంబంధించి ఈ రాష్ట్రాల్లో అత్యంత లోటు వర్షపాతం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తీవ్ర వర్షాభావం,అధిక వేడి ఉండే ఎల్‌నినో పరిస్థితులు జూన్‌ వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని.. వచ్చే రెండు నెలలు ఎండలు మరింత తీవ్రతరం కావచ్చని వాతావరణ నిపుణులు చెప్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేశాయి.

అత్యవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయట తిరగకూడదని, ఆరు బయట అధిక శారీరక శ్రమతో కూడిన పనులు చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. వీలైనంత మేర నీటిని తాగుతూ ఉండాలని, శరీరం చల్లగా ఉండేలా చూసుకోవాలని వివరిస్తున్నారు. జిమ్‌లు, బయటా వ్యాయామాలు చేసేవారు కూడా జాగ్రత్తగా ఉండాలని.. డీహైడ్రేషన్, ఇతర పరిస్థితుల వల్ల ఆరోగ్యం ఒక్కసారిగా దెబ్బతినవచ్చని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వాతావరణంలో తేమశాతం పెరగడంతో ఉక్కపోత కూడా తీవ్రంగా ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్‌ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నట్టు వెల్లడించారు. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన ఉష్ణోగ్రతల అంచనాలను ఏప్రిల్‌ 1న విడుదల చేస్తామని తెలిపారు. బయటికి వెళ్లేటప్పుడు తెలుపు, లేత రంగుల పలుచటి కాటన్‌ వ్రస్తాలు ధరించాలని సూచించారు. తలపై టోపీ పెట్టుకోవాలి. నీళ్లు, నిమ్మరసం, కొబ్బరినీళ్లు, మజ్జిగ, ఓఆర్‌ఎస్‌ వంటివి తాగుతూ ఉండాలి. ఎండ వేడిలో అధికంగా పనిచేయకూడదు. ఇబ్బందిగా అనిపిస్తే చల్లని ప్రదేశంలో సేదతీరాలి. అధిక వేడి వల్ల ఆహారం త్వరగా పాడైపోతుంది. అలాంటివి తింటే డయేరియాకు గురయ్యే ప్రమాదం ఉంటుందని, పిల్లలు, గర్భిణులు, వృద్ధులు మధ్యాహ్నం పూట బయటికి వెళ్లొద్దని సూచించారు.