ప్రఖ్యాత మలయాళ రచయిత, పద్మ భూషణ్ ఎంటీ వాసుదేవన్ నాయర్ (91) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన శ్వాసకోశ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. డిసెంబరు 15న కోళికోడ్‌లోని బేబీ మెమోరియల్ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యారు. చికిత్సా ఫలితం లేకుండా బుధవారం రాత్రి ఆయన ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. తన రచనలతో కేరళతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మలయాళీయుల హృదయాల్లో ప్రత్యేక చోటు సాధించారు. ఆయన జూలై 1933లో పాలక్కాడ్ సమీపంలోని కూడల్లూరులో టి నారాయణన్ నాయర్, అమ్మలువమ్మ దంపతులకు జన్మించారు.
వాసుదేవన్ నాయర్ తన బాల్యం నుంచే మలయాళ సాహిత్యంపై ఆసక్తి చూపించారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత వివిధ పాఠశాలల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆయన రాసిన నవలలు, బాలల సాహిత్యం, చిన్న కథలు, పర్యాటక రచనలు, వ్యాసాలు మంచి రచయితగా ఆయనకు కేరళలో గుర్తింపు తెచ్చిపెట్టాయి. మలయాళ సినీ రంగంలోనూ ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆరు సినిమాలకు ఎంటీ దర్శకత్వంవహించారు.
1996లో జ్ఞానపీఠ్‌తో, 2005లో పద్మభూషణ్‌తో ఆయనను దేశం సత్కరించింది. కేరళ రాష్ట్రానికి చెందిన పలు అవార్డులు, పురస్కారాలను అందుకున్నారు. 2013లో కేంద్ర సాహిత్య అకాడమీ ఫెలోషిప్‌ను అందుకున్నారు. అతను 1998లో కేరళ సాహిత్య అకాడమీ అధ్యక్షుడిగా, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యనిర్వాహక సభ్యుడు, ఇండియన్ పనోరమ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారు.
వాసుదేవన్ నాయర్ కన్నుమూతతో కేరళలో విషాదఛాయలు అలుముకున్నాయి.