నీ అడుగులు.. ప్రపంచ శాంతికి మార్గాలు

| Edited By: Pardhasaradhi Peri

Oct 02, 2019 | 10:19 AM

గాంధీజీ.. 200 ఏళ్ల ఆంగ్లేయుల పాలన నుంచి భారతావనికి స్వేచ్ఛావాయువులు అందించిన మహాపురుషుడు. ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మార్గదర్శి బాపుజీ. సత్యాగ్రహ్రాన్ని ఆయుధంగా మలిచి.. పోరాటం చేసిన మహాత్ముడు గాంధీజీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ.. మహాత్ముడిగా మారిన తీరు.. ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అంతేకాదు.. హింసతో సాధించేది ఏం లేదంటూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్య్రం సాధిస్తానని చెప్పి.. ఆ మాటలను నిజం చేసిన తీరు ప్రపంచానికే ఆదర్శం. అలాంటి మహానీయుడి జన్మదినం నేడు. ఈ […]

నీ అడుగులు..  ప్రపంచ శాంతికి మార్గాలు
Follow us on

గాంధీజీ.. 200 ఏళ్ల ఆంగ్లేయుల పాలన నుంచి భారతావనికి స్వేచ్ఛావాయువులు అందించిన మహాపురుషుడు. ప్రపంచానికి అహింసా మార్గాన్ని ప్రబోధించిన మార్గదర్శి బాపుజీ. సత్యాగ్రహ్రాన్ని ఆయుధంగా మలిచి.. పోరాటం చేసిన మహాత్ముడు గాంధీజీ. ఓ సామాన్యుడిలా జీవితాన్ని ప్రారంభించిన గాంధీ.. మహాత్ముడిగా మారిన తీరు.. ఆశ్చర్యాన్ని కల్గిస్తుంది. అంతేకాదు.. హింసతో సాధించేది ఏం లేదంటూ.. అహింసతోనే దేశానికి స్వాతంత్య్రం సాధిస్తానని చెప్పి.. ఆ మాటలను నిజం చేసిన తీరు ప్రపంచానికే ఆదర్శం. అలాంటి మహానీయుడి జన్మదినం నేడు. ఈ సందర్భంగా ఆయన జీవిత చరిత్రను ఓ సారి స్మరించుకుందాం.

గాంధీజీ బాల్యం, విద్య..

మహాత్ముడి పూర్తిపేరు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ. ఆయన అక్టోబరు 2, 1869లో గుజరాత్ రాష్ట్రంలోని పోర్ బందర్లో ఒక సామాన్య కుటుంబములో జన్మించాడు. జన్మించారు.
ఆయన తండ్రి పేరు కరంచంద్ గాంధీ. తల్లి పుతలీ బాయి. వారి కుటుంబం ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేది. బాల్యం నుంచి గాంధీ కాస్త నిదానముగా ఉండే బాలుడు. చిన్నతనమునుండి అబద్ధాలు చెప్పే పరిస్థితులకు దూరముగా ఉండే ప్రయత్నము చేశాడు.13 ఏండ్ల వయసులో అప్పటి ఆచారము ప్రకారము కస్తూర్బాయితో వివాహము జరిగింది. పోర్‌బందర్‌, రాజ్‌కోట్‌లలో ఆయన విద్యనభ్యసించారు. 1888 లో న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి ఇంగ్లాండు వెళ్ళాడు. తల్లికిచ్చిన మాట ప్రకారము ఆయన మాంసానికి, మద్యానికి, స్త్రీ సాంగత్యానికి దూరంగా ఉన్నాడు. ఆయనకు బెర్నార్డ్ షా వంటి ఫేబియన్లతో పరిచయం ఏర్పడింది. అనేక మతాల పవిత్ర గ్రంథాలను చదివాడు. ఈ కాలములోనే ఆయన చదువూ, వ్యక్తిత్వమూ, ఆలోచనా సరళీ రూపు దిద్దుకొన్నాయి. 1891లో ఆయన పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు. బొంబాయి లోను, రాజ్‌కోట్ లోను ఆయన చేపట్టిన న్యాయవాద వృత్తి అంతగా రాణించలేదు.

దక్షిణాఫ్రికాలో గాంధీ

న్యాయవాద విద్యను అభ్యసించిన గాంధీ.. 1893లో దక్షిణాఫ్రికా వెళ్లారు. ఒక సంవత్సరము అనుకుని వెళ్ళిన గాంధీ.. ఏకంగా దక్షిణాఫ్రికాలో 21 సంవత్సరాలు గడిపాడు. కేవలం తెల్లవాడు కానందువల్ల రైలు లోంచి నెట్టివేయడం, హోటళ్ళలోకి రానివ్వకపోవడం వంటి జాతి వివక్షతలు ఆయనకు సమాజంలోని అన్యాయాలను కళ్ళకు కట్టినట్లు చూపాయి. దీంతో జాతి వివక్షపై ఆయన పోరాటం ప్రారంభించాడు. భారతీయుల అభిప్రాయాలను కూడగట్టటమూ, అన్యాయాల పట్ల వారిని జాగరూకులను చేయడమూ ఆయన చేసిన మొదటి పని. 1894లో భారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రంగా వ్యతిరేకించాడు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించాడు. ఆ తర్వాత ఇండియన్ ఒపీనియన్ అనే పత్రికను ఆయన ప్రచురించాడు. సత్యాగ్రహం అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశాడు. ఆ తర్వాత పలుచోట్ల పర్యటించిన గాంధీ 1914లో గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చాడు. అదే సమయంలో భారతదేశంలో స్వాతంత్య్రోద్యమ పోరాటం ఉప్పెనలా చిగురిస్తోంది.

దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో…

దేశ స్వాతంత్ర్యం ఉద్యమ సమయంలో గాంధీ భారత జాతీయ కాంగ్రెసు సమావేశాల్లో పాల్గొనసాగాడు. అప్పటి ప్రధాన నేతలలో ఒకరైన గోపాలకృష్ణ గోఖలే గాంధీకి భారత రాజకీయాలు, సమస్యలను పరిచయం చేశాడు. ఈ క్రమంలో ఆయన 1918 లలో చంపారణ్, ఖేడా సత్యాగ్రహాలు నిర్వహించాడు. ప్రజలను చైతన్యవంతులుగా చేయడమూ, చదువునూ సంస్కారాన్నీ పెంచడమూ, జాతి వివక్షతను విడనాడడమూ, అన్యాయాన్ని ఖండించడమూ ఈ సత్యాగ్రహంలో భాగము. ఈ కార్యక్రమంలో ఉక్కుమనిషిగా పేరొందిన సర్దార్ వల్లభభాయ్ పటేల్ గాంధీకి కుడిభుజంగా నిలచాడు. ఆయన నాయకత్వంలో వేలాదిగా ప్రజలు సర్కారు దౌర్జన్యాలకు ఎదురు నిలచి, జైలుకు తరలి వెళ్ళారు.

బాపు అని పిలిచిందెప్పుడు అంటే..

సమాజంలో అశాంతిని రేకెత్తిస్తున్నారన్న నేరంపై గాంధీని అరెస్టు చేసినపుడు జనంలో పెద్ద ఎత్తున నిరసన పెల్లుబికింది. ఈ కాలంలోనే గాంధీని ప్రజలు ప్రేమతో “బాపు” అనీ, “మహాత్ముడు” అనీ పిలుచుకొనసాగారు. గాంధీ నాయకత్వానికి బహుముఖంగా ప్రశంసలూ, ఆమోదమూ లభించాయి.

సహాయ నిరాకరణోద్యమం..

1919 ఏప్రిల్ 13న జలియన్‌వాలా బాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఈ మారణకాండతో దేశ వ్యాప్తంగా ఒక్కసారిగా ఆగ్రహావేశాలు కట్టలుతెంచుకున్నాయి. బ్రిటిష్ సైనికుల కాల్పుల్లో దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ ఘటనకు నిరసనగా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించారు. స్వదేశీ వస్తువులే వాడాలని, విద్యాసంస్థలను, న్యాయస్థానాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. దీంతో సహాయ నిరాకరణోద్యమం విజయవంతమైంది. 1922 ఫిబ్రవరిలో ముగ్గురు నిరసనకారులను పోలీసులు చంపేశారు. దీంతో ఆగ్రహోదక్తులైన ఆందోళనకారులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్‌పై దాడి చేసి 22 మందిని చంపేశారు. దీంతో ఈ ఘటన మరింత హింసకు దారి తీస్తుందనే భయంతో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని నిలిపేస్తున్నట్టుగా ప్రకటించారు.

దండి యాత్ర..

భారతీయులు ఉప్పు సాగు చేయకుండా, విక్రయించకుండా బ్రిటిషర్లు చట్టం తెచ్చి.. ఉప్పుపై భారీగా పన్ను విధించారు. ఈ చట్టాన్ని నిరసిస్తూ.. గాంధీజీ దండి యాత్రను చేపట్టారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్ 6 వరకు.. అహ్మదాబాద్ నుంచి దండి వరకు 388 కి.మీ. పాదయాత్ర చేపట్టారు. వేలాది మంది ప్రజలు దండి యాత్రలో పాల్గొన్నారు. బ్రిటిషర్ల ఉప్పు చట్టాలను ఉల్లంఘించడంతో 80 వేల మంది భారతీయులను జైలుకు పంపారు. దండి యాత్ర యావత్ ప్రపంచాన్ని ఆకర్షించడంతో.. భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలనే వాదనకు బలం చేకూరింది.

క్విట్ ఇండియా..

1942 ఆగష్టు 8న గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. బ్రిటిష్ పాలనకు ఇక చరమగీతం పలకాలని ప్రజలకు పిలుపునిచ్చారు. డూ ఆర్ డై అని ఆయన ప్రజానీకానికి పిలుపునిచ్చారు. గాంధీ చేస్తున్న ప్రసంగాలు జాతీయ నాయకుల్లో స్ఫూర్తి నింపింది. దేశమంతటా ఎక్కడికక్కడ ఆందోళనలు నిర్వహించారు. దీంతో లక్షల మందిని బ్రిటీష్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. అయితే ఈ ఉద్యమంతో ఇక భారత్‌లో ఉండటం కుదరదన్న భావనకు బ్రిటీష్ ప్రభుత్వాధికారులు వచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం ముగింపు దశలో ఉందనగా భారత్‌కు స్వాతంత్య్రం ఇస్తామనే సంకేతాలిచ్చారు. దీంతో గాంధీజీ తన పిలుపును వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వం అరెస్ట్ చేసిన లక్ష మందిని విడుదల చేసింది. 1947 ఆగష్టు 15న భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది. కానీ బ్రిటిషర్లు దేశాన్ని భారత్, పాకిస్థాన్‌గా విభజించారు.

గాంధీ హత్య…

1948 జనవరి 30వ తేదీన ఢిల్లీలో బిర్లా నివాసం వద్ద గాంధీజీని నాథూరామ్ గాడ్సే కాల్చి చంపాడు. 1944 నుంచి 1948 వరకూ మహాత్మా గాంధీకి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసిన వెంకిట కల్యాణం ఆయన హత్య జరిగినప్పుడు పక్కనే ఉన్నారు. ఆ రోజు సాయంత్రం 5:17 గంటలకు మహాత్మాగాంధీ ఢిల్లీలోని బిర్లాహౌస్‌లో ప్రార్థనా సమావేశాన్ని ముగించి బయటకు వస్తున్నప్పుడు నాథూరాంగాడ్సే ఆయనకు ఎదురుగా వచ్చి చంపారని ఆయన తెలిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరపడంతో.. గాంధీ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.