హమ్మయ్యా.. మ్యాన్ ఈటర్ చిక్కింది.. T-122 నరభక్షక పులిని ఎలా బంధించారంటే..

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా అటవీ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ఐదుగురి మరణాలకు కారణమైనట్లు అధికారులు గుర్తించిన T-122 పులిని అటవీశాఖ బంధించింది. ట్రాప్‌ కెమెరాలతో పులి కదలికలను గుర్తించిన రెస్క్యూ బృందాలు మత్తుమందు ఇచ్చి పట్టుకున్నాయి. తెలంగాణ సరిహద్దు గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

హమ్మయ్యా.. మ్యాన్ ఈటర్ చిక్కింది.. T-122 నరభక్షక పులిని ఎలా బంధించారంటే..
Man Eater Tiger

Edited By:

Updated on: Oct 25, 2026 | 8:26 AM

ఒకటి కాదు.. రెండు కాదు.. నెల రోజుల వ్యవధిలో ఐదుగురి ప్రాణాలు తీసేసిన నరభక్షక పులి.. గ్రామాల సరిహద్దుల్లో సంచరిస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేసిన బెబ్బులి ఎట్టకేలకు అటవీశాఖకు చిక్కింది. ‘మ్యాన్ ఈటర్’ T-122 పులి గత నెల రోజులుగా తెలంగాణ సరిహద్దు జిల్లాలైన కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల ప్రాంతాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో తీవ్ర భయాందోళనలు సృష్టించింది . ఐదుగురిని పొట్టనబెట్టుకుని, సరిహద్దు గ్రామాల ప్రజలను నిద్రలేకుండా చేసిన ఈ ఆరేళ్ల మగ పులిని అధికారులు మత్తుమందు ఇచ్చి విజయవంతంగా బంధించారు.

మహారాష్ట్రలోని చంద్రపూర్‌ జిల్లా సావిలీ తాలూకా అటవీ ప్రాంతంలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు పశువుల కాపరులు, ఇద్దరు రైతులను పొట్టన పెట్టుకున్న నరభక్షక పులి కోసం అటవిశాఖ సహా.. స్థానిక అధికారుల బృందం రంగంలోకి దిగింది‌. మనుషులపై వరుస దాడులకు పాల్పడుతున్న మ్యాన్ఈటర్ ను టీ-122 పులిగా గుర్తించి.. దానిని బందించేందుకు 30 మందిని రంగంలోకి దింపింది చంద్రపూర్ అటవీశాఖ..

స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత..

వ్యాహాడ్‌ అటవీ ప్రాంతంలో ముగ్గురు పశువుల కాపరులు సహా నెల రోజుల వ్యవధిలో ఐదుగురు మృతి చెందడంతో స్థానికుల నుండి తీవ్ర వ్యతిరేకత రావడం.. సామదా, నీలసని, పెడగావ్‌, సోనాపుర్‌, వాగోలి గ్రామాల పరిసరాల్లో పులి సంచారం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేయడంతో అటవీశాఖ ఆపరేషన్ మ్యాన్ఈటర్ ను సెప్టెంబర్‌ 27న చేపట్టింది. ట్రాప్‌ కెమెరాల సాయంతో పులి కదలికలను గుర్తిస్తూ రెస్క్యూ బృందాలు గాలింపు ముమ్మరం చేశాయి. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం సీసీఎఫ్‌ రామానుజం, డీఎఫ్‌వో రంజన్‌ తలమేరి పర్యవేక్షణలో ఆపరేషన్‌ కొనసాగింది. చివరకు పులి జాడను గుర్తించిన రెస్క్యూ బృందం.. మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి దానిని బోనులో బంధించింది.

Maharashtra Man Eater Tiger

మహారాష్ట్ర అడవుల్లో స్వేచ్ఛగా తిరగాల్సిన పెద్దపులులు.. ప్రాణాలు తీసే స్థాయికి చేరుతుండటం.. పరిస్థితి ప్రమాదకరంగా మారుతుండటంతో పులుల మధ్య ఆధిపత్య పోరు.. ఆహార కొరతను గుర్తించిన చంద్రపూర్ జిల్లా అటవీశాఖ.. పులులను పక్క రాష్ట్రాలకు తరలించే ఆపరేషన్ కు ప్లాన్ చేస్తోంది‌.

గత కొద్ది రోజులుగా బయటకు రావడానికి జంకిన ప్రజలు, పులి చిక్కిందనే వార్త వినగానే సంతోషం వ్యక్తం చేశారు. సావళి అటవీ పరిధిలోని గ్రామాలతో పాటు ఆసిఫాబాద్ సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఎట్టకేలకు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. పట్టుబడిన T-122 పులిని తదుపరి వైద్య పరీక్షల నిమిత్తం జూ లేదా పునరావాస కేంద్రానికి తరలించనున్నట్లు అధికారులు తెలిపారు.

Loading...
Unable to load recommendations.
Follow Us