చోరీకి కాదేదీ అనర్హం అన్నట్లు దొంగలు రెచ్చిపోయారు. తాజాగా ఏకంగా పసిపిల్లల ప్రాణాలను పణ్ణంగా పెట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. మధ్యప్రదేశ్‌లోని ఓ జిల్లా ఆసుపత్రిలోని ఎన్‌ఐసీయూ వార్డులోని ఆక్సిజన్ గ్యాస్ పైప్‌లైన్‌ను గుర్తుతెలియని దొంగలు కట్ చేసి ఎత్తకెళ్లారు. దీంతో ఆస్పత్రిలో చేరిన 12 మంది చిన్నారుల ప్రాణాలను ప్రమాదంలో పడేశారు. ఆక్సిజన్ సరఫరా నిలిపివేయడంతో పిల్లలు పెద్దగా ఏడవడం ప్రారంభించారు. గార్డు వెంటనే అలారం మోగించడంతో ఆసుపత్రి సిబ్బంది రంగంలోకి దిగింది.
మంగళవారం(డిసెంబర్ 17) అర్థరాత్రి రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో జరిగిన ఈ సంఘటన ఆసుపత్రి సిబ్బందిలో భయాందోళనలకు గురిచేసింది. క్లిష్టమైన ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలోని NICU వార్డులో మొత్తం 23 మంది పిల్లలు చేరారు. వీరిలో 12 మంది చిన్నారులు ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. మంగళవారం రాత్రి ప్లాంట్ సమీపంలోని 10 అడుగుల కాపర్ ఆక్సిజన్ పైప్‌లైన్‌ను దొంగలు కట్ చేశారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఎన్‌ఐసియు)కి ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఆక్సిజన్‌పై ఆధారపడిన 12 మంది శిశువులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. పిల్లల ఏడ్పులతో సిబ్బంది అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
ఈ విషయం తెలుసుకున్న వైద్య సిబ్బంది సీనియర్ వైద్యులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న శిశువైద్యుడు డాక్టర్ ఆర్ ఎస్ మాథుర్ , సివిల్ సర్జన్ నితిన్ పటేల్ ఆస్పత్రికి చేరుకున్నారు. ఆక్సిజన్ యూనిట్ వైపు వెళ్లి ఆక్సిజన్ పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా అది తెగిపోయి కనిపించింది. దీంతో వైద్యులు వెంటనే జంబో సిలిండర్ల నుంచి ఆక్సిజన్ సరఫరా ప్రారంభించారు.
సకాలంలో జంబో సిలిండర్లు అందుబాటులో లేకుంటే పెను ప్రమాదం సంభవించి ఉండేదని డాక్టర్ ఆర్ ఎస్ మాథుర్ తెలిపారు. రాత్రి సమయంలో లిక్విడ్ ఆక్సిజన్ లైన్‌ను దొంగలు పగలగొట్టారని సివిల్ సర్జన్ నితిన్ పటేల్ తెలిపారు. దీంతో సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కొత్త భవనంలోనూ చోరీ జరిగినట్లు తెలిపారు. గతంలో కూడా దొంగతనాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి పిల్లలంతా కలిసి ఏడుపు వినిపించడంతో వైద్య సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..