Kumki Elephant: ఏనుగులందు కుంకీ ఏనుగులు వేరయా! ఇంతకీ వీటి ప్రత్యేకత ఏమిటి? వీటికిచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది?

| Edited By: Ravi Panangapalli

Aug 12, 2024 | 10:32 AM

కుంకీగా ఒక ఏనుగును సెలక్ట్ చేయడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అన్ని ఏనుగులను కుంకీలుగా మార్చడం చాలా కష్టం. అయితే.. అన్ని రకాల ఏనుగులను అదుపు చేసే శక్తి.. మగ ఏనుగులకు ఉంటుంది. అందుకే.. కుంకీలుగా మగ ఏనుగులను మాత్రమే సెలక్ట్ చేస్తారు. దీనికీ ఓ కారణం ఉంది.

Kumki Elephant: ఏనుగులందు కుంకీ ఏనుగులు వేరయా! ఇంతకీ వీటి ప్రత్యేకత ఏమిటి? వీటికిచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుంది?
Kumki Elephant Feature Image
Follow us on

ఏనుగమ్మా ఏనుగు మా వూరొచ్చే ఏనుగు అని చిన్నప్పుడు చాలామంది పాట పాడుకుని ఉండొచ్చు. కానీ కొన్ని ఊళ్లు మాత్రం.. అటవీ ఏనుగులను తమ ఊరికి రావద్దనే కోరుకుంటున్నాయి. ఎందుకంటే అవి చేసే విధ్వంసం అంతా ఇంతా కాదు. పంటలను పాడుచేస్తాయి. అడ్డొచ్చే వారిని చంపేస్తాయి. ఊళ్లను ధ్వంసం చేస్తాయి. దీంతో ఏనుగులంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఏపీలో చిత్తూరు, పార్వతీపురం ప్రాంతాల్లో గజరాజుల పేరు చెబితేనే ఆందోళన చెందుతారు. ఎందుకంటే.. వాటి వల్ల జరిగే నష్టం.. వచ్చే కష్టం సంగతి వాళ్లకు తెలుసు. అందుకే.. ఏపీ సర్కారు కూడా కుంకీ ఏనుగులు కావాలని కర్ణాటక ప్రభుత్వాన్ని అడిగింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం ఓకే చెప్పింది. ఇంతకీ ఈ కుంకీ ఏనుగులు ఏం చేస్తాయి? అడవి ఏనుగులను అవి ఎలా దారికి తెస్తాయి? అసలు వాటి స్పెషల్ ఏమిటి?

Kumki Elephant 1

కుంకీ ఏనుగులు వస్తే.. అడవి ఏనుగుల బాధ తగ్గుతుంది. జనావాసాల్లోకి వీటి రాకను అడ్డుకోవడానికి వీలుపడుతుంది. కొన్నేళ్లుగా వీటితో పడ్డ సమస్యలు తొలగిపోతాయి. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు పరిష్కారం లభించినట్లు అవుతుంది. ఇంతకీ కుంకీ ఏనుగులు నిజంగానే అంత ప్రత్యేకమైనవా? అవును ఇవి నిజంగానే స్పెషల్. కుంకీ ఏనుగులంటే.. మావటిలు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన ఏనుగులు. అడవి ఏనుగులను ఎలా తరిమేయాలో.. వాటిని ఎలా మచ్చిక చేసుకుని అడవిలోకి పంపించాలో.. ఆగ్రహంతో ఉన్న గజరాజులను ఎలా శాంతింపజేయాలో.. ఇలా అన్ని రకాలుగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు. అంటే అడవి ఏనుగులను క్యాప్చర్ చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కేరళ, గౌహతి ప్రాంతాల్లో వీటికి శిక్షణ ఉంటుంది. వీటిని చిన్నప్పటి నుంచి మావటిలు జాగ్రత్తగా పెంచుతారు. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Kumki Elephant 2

అడవిలో మంద నుంచి వేరు చేసిన ఏనుగులను, కొన్ని ప్రత్యేకమైన అడవి ఏనుగులను.. తీసుకువచ్చి ట్రైనింగ్ ఇస్తారు. అవి మావటిలు చెప్పే మాటలు వింటే.. వాటికి చెరుకుగడ కాని, బెల్లం కాని ఇస్తారు. దీనివల్ల ఆ ఏనుగుకు, మావటికి మధ్య బంధం ఏర్పడుతుంది. అంతా ఓకే అనుకుంటే.. అప్పుడు వాటిని ఎన్ క్లోజర్ నుంచి బయటకు తీసుకువచ్చి శిక్షణ ఇస్తారు. ఈ ట్రైనింగ్ అంతా డాక్టర్లు, అధికారుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ ట్రైనింగ్ సమయంలో ఆ ఏనుగును మిగతా ఏనుగులతో కలవనిస్తారు. దీనివల్ల అది.. అడవి ఏనుగులను ఒక్కసారిగా చూసినా కలవరపడకుండా ఉండడం సాధ్యమవుతుంది. తరువాత ఆ ఏనుగును అడవిలోకి ట్రిప్ కోసం మావటి తీసుకెళతాడు. ఇది అక్కడి పరిసరాలకు దానిని అలవాటు పడేలా చేస్తుంది. ఇక లాస్ట్ స్టేజ్ ట్రైనింగ్ లో ఆ ఏనుగులను ఒంటరిగా అడవిలోకి పంపిస్తారు. అవి తిరిగి వస్తే.. వాటికి ట్రైనింగ్ పూర్తయినట్టే. కుంకీ ఏనుగుగా మారినట్టే.

Kumki Elephant 3

కుంకీగా ఒక ఏనుగును సెలక్ట్ చేయడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. అన్ని ఏనుగులను కుంకీలుగా మార్చడం చాలా కష్టం. అయితే.. అన్ని రకాల ఏనుగులను అదుపు చేసే శక్తి.. మగ ఏనుగులకు ఉంటుంది. అందుకే.. కుంకీలుగా మగ ఏనుగులను మాత్రమే సెలక్ట్ చేస్తారు. దీనికీ ఓ కారణం ఉంది. ఆడ ఏనుగులు అయితే.. మందతో కలిసి ఉంటాయి. వాటి పిల్లల సంరక్షణ బాధ్యతలను అవే తీసుకుంటాయి. ఈ గ్రూప్ కి లీడర్ గా ఆడ ఏనుగే ఉంటుంది. అదే మగ ఏనుగులు అయితే.. ఒంటరిగా ఉంటాయి. అలాగే తిరుగుతాయి. అందుకే వీటిని మచ్చిక చేసుకోవడం కొంతవరకు ఈజీ. ఏనుగుల మంద దాడి చేసినప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి కుంకీని పంపిస్తారు. ఈ మగ ఏనుగును చూసి.. ఆడ ఏనుగులు దూరంగా జరుగుతాయి. కుంకీ వల్ల ఎక్కడ తమ పిల్లలకు హాని కలుగుతుందేమో అన్న భయంతో.. అవి ఆ ప్రదేశాన్ని ఖాళీ చేస్తాయి. అందుకే కుంకీలుగా మగ ఏనుగులకు ట్రైనింగ్ ఇస్తారు.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Kumki Elephant 4

కొన్ని సందర్భాల్లో మగ ఏనుగులు కాని దాడికి దిగితే.. వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. కుంకీ ఏనుగును తీసుకొచ్చినా.. అవతలివైపు ఏనుగులు అంత త్వరగా కంట్రోల్ కావు. అలాంటప్పుడు రెండు ఏనుగుల మధ్యా భీకర పోరాటం ఉంటుంది. అవి కాని మదమెక్కి ఉంటే.. ఆ పోరాటం ఓ రేంజ్ కు వెళుతుంది. అది కూడా ఒంటరి ఏనుగు అయితే పరిస్థితి కష్టంగా మారుతుంది. దానికి మదం ఎక్కువగా ఉంటుంది. దానిని చూసి.. కుంకీ ఏనుగులు కూడా అలానే మారిపోతాయి. అలాంటప్పుడు కుంకీలను కంట్రోల్ చేయడం కూడా కష్టమే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇవి లైన్ దాటకుండా ఉండడానికి మావటిలు వీటికి చాలా జాగ్రత్తగా వాటికి ట్రైనింగ్ ఇస్తారు.

Kumki Elephant 5

ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి. కుంకీ ఏనుగులు కాని ఒక్కసారి రంగంలోకి దిగితే.. ఇక వెనక్కు తగ్గేదేలే. అవతల ఏనుగుల మంద ఉన్నా సరే.. దానిని అడవిలోకి తరిమికొట్టి మరీ ఇవి వెనక్కు వస్తాయి. వీటికి ఇచ్చే ట్రైనింగ్ ఆ స్థాయిలో ఉంటుంది. ఇందులో మావటిలిది నిజంగానే కీలకపాత్ర. వాటిని ఆ రకంగా తీర్చిదిద్దిన ఘనత నిస్సందేహంగా మావటిలదే. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్టుగా.. గతంలో పంటపొలాలపై దాడులు చేసిన, మనుషులను చంపడానికి, గాయపరచడానికి అలవాటు పడిన ఏనుగులను పట్టి.. వాటికి కుంకీలుగా శిక్షణ ఇస్తారు. కాబట్టి వాటికి మిగిలిన ఏనుగులను ఎలా కంట్రోల్ చేయాలో అర్థమవుతుంది.

ఒక ఏనుగును కుంకీ ఏనుగుగా మార్చాలంటే కొన్నాళ్లపాటు కఠోర శ్రమ తప్పదు. పైగా ఆ సమయంలో మావటిలు చాలా ఓపిగ్గా, జాగ్రత్తగా ఉండాలి. ముందు వాటితో బంధం ఏర్పరుచుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారు. తరువాత వాటిని మచ్చిక చేసుకుని.. కుంకీగా శిక్షణ మొదలుపెడతారు. ముందు వీటికి కొన్ని సంకేతాలను అలవాటు చేస్తారు. తరువాత ఆ సంకేతాల ద్వారా అవతలి ఏనుగులను ఎలా ఎదుర్కోవాలి అన్నదాని గురించి ట్రైనింగ్ ఇస్తారు. కుంకీ ఏనుగు.. మావటిని తనపైకి ఎక్కించుకోవడం నుంచి.. మళ్లీ కిందకు దించే వరకు అంతా ఓ పద్దతి ప్రకారం ఉంటుంది. ఏవైనా జంతువులు పంటపొలాలపై పడితే.. వాటిని తరిమికొట్టడానికి ఇవి చాలా గట్టిగా అరుస్తాయి. ఇలా చేయాలని ఓ సంకేతం ద్వారా మావటిలు చెబుతారు. అందుకే మావటిలు చెప్పేవాటిని ఇవి.. తూచా తప్పకుండా పాటిస్తాయి.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.

Kumki Elephant 6

కుంకీ ఏనుగు చెవిని మావటి.. కాలితో తడితే.. అప్పుడు ముందుకు వెళ్లాలని అర్థం. అదే.. చెవి వెనుక భాగంలో కాలి తొడతో గట్టిగా తడితే.. అప్పుడు వెనుకకు వెళ్లాలని అర్థం. ఒకవేళ అది ఆగిపోవాలంటే మాత్రం.. చెవి మధ్యభాగంలో కాలితో అదమాలి. అప్పుడు అది బ్రేక్ వేసినట్టు ఆగిపోతుంది. సో.. మావటి ఇచ్చే సిగ్నల్ కు అనుగుణంగా కుంకీ ఏనుగు ప్రవర్తిస్తుంది. కాకపోతే ఇక్కడ ఓ విషయం చాలా కీలకం. ఏనుగును కంట్రోల్ చేయాలంటే.. మావటి కచ్చితంగా ఏనుగు పైనే ఉండాలి. ఒక్కసారి కిందికి దిగితే వాటికి మావటిలు ఏం చెబుతున్నారో అర్థం కాదు. ఇక ఇవి ఆరోగ్యంగా ఉండడానికి.. సహజంగా లభించే ఆహారంతోపాటు.. ప్రత్యేకంగా తయారుచేసిన ఆహారాన్ని కూడా పెడతారు.

Kumki Elephant 7

కేరళలో అయితే.. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఏనుగులను కుంకీ సేవలకు ఉపయోగిస్తారు. వాటికి 60 ఏళ్లు వచ్చేవరకు సర్వీసులో ఉంచుతారు. అప్పటివరకు వాటిని ప్రభుత్వ సేవకులుగానే పరిగణిస్తారు. 60 ఏళ్ల తరువాత అవి రిటైర్ అవుతాయి. అప్పుడు వాటిని ఏనుగుల అభయారణ్యంలో సేదదీరేలా చూస్తారు. అప్పుడప్పుడు టూరిస్టులను గ్రీట్ చేయడానికి అనుమతిస్తారు. ఏనుగులకు ఏవైనా గాయాలైనప్పుడు.. వాటంతటవి నిలబడలేనప్పుడు.. ఈ కుంకీ ఏనుగుల ద్వారా వాటికి సపోర్ట్ ఇస్తారు. అలాగే అడవి ఏనుగులు.. ఏవైనా బురద ప్రాంతాల్లో కూరుకుపోయినా.. ఎక్కడైనా ఇరుక్కున్నా.. వాటిని బయటకు తీసుకురావడానికి ఈ కుంకీ ఏనుగులను పంపిస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే. అడవి ఏనుగులకు.. ఈ కుంకీ ఏనుగులు కేర్ టేకర్స్ అని చెప్పాలి. అడవి ఏనుగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తిరిగి ఫారెస్ట్ లోకి పంపించడం, అవసరమైన సందర్భాల్లో సేవలు అందించడం.. ఈ కుంకీ ఏనుగుల పని. కుంకీలకు ఇచ్చే శిక్షణ చాలా సీక్రెట్ గా ఉంటుంది

Kumki Elephant 8

వయనాడ్ లోని ముతంగా ప్రాంతంలో కుంకీ ఏనుగుల కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ క్యాంప్ ఉంటుంది. తొలినాళ్లలో ఏనుగులను ట్రైనింగ్ కోసం కేరళ నుంచి తమిళనాడుకు పంపించేవారు. అలా ఓ మూడు గజరాజుల శిక్షణకు మూడు నెలలకు గాను అప్పట్లో దాదాపు 18 లక్షల రూపాయిలు ఖర్చయ్యాయి. తరువాత వాటికి కేరళలోనే శిక్షణ ఇప్పించడానికి నిర్ణయించారు. వీటి శిక్షణ పూర్తయిన తరువాత వాటిని వివిధ ప్రాంతాలకు పంపిస్తారు. ఇవి అందించే సేవలు మరువలేనివి. వెలకట్టలేనివి. కానీ ఓ సాధారణ ఏనుగు.. తన దూకుడు తగ్గించుకుని కుంకీ ఏనుగుగా మారాలంటే.. కనీసం మూడు నుంచి ఆరు నెలల ట్రైనింగ్ తప్పనిసరి. కొన్నింటికి మాత్రం ఇంకా ఎక్కువ సమయం పడుతుంది. ముందు వాటిని దారిలోకి తేవడానికి ఎక్కువ టైమ్ వెయిట్ చేయాలి.

ఇక్కడ మరో బాధాకరమైన సమస్య గురించి కూడా చెప్పుకోవాలి. అటవీ ఏనుగులు ఊళ్లలోకి వచ్చేటప్పుడు కొన్నిసార్లు విద్యుత్ షాక్ కు గురవుతాయి. మరికొన్నిసార్లు అనారోగ్యం బారిన పడతాయి. ఇంకొన్ని సందర్భాల్లో మృత్యువాత పడతాయి. వీటి సంరక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోలేకపోతే ఇలాంటి విషాద ఘటనలు తప్పవు. అయితే ఇవి అడవుల నుంచి బయటకు రాకుండా అడ్డుకుంటేనే ఈ సమస్య పరిష్కారమవుతుంది. కానీ అవి అటవీ సరిహద్దులు దాటకూడదంటే.. వాటికి ఆ జంగిల్ లోనే అన్నీ లభ్యమవ్వాలి. కానీ ఇప్పుడు కాంక్రీట్ జంగిల్ పెరుగుతుండడంతో.. ఒరిజినల్ జంగిల్ విస్తీర్ణం తగ్గుతోంది. అందుకే ఇవి తరచుగా అటవీ సరిహద్దు గ్రామాల్లోకి చొరబడుతున్నాయి.

పంటపొలలపై దాడి చేసే ఏనుగులను ఎలాగోలా ప్రయత్నించి రాష్ట్ర సరిహద్దులు దాటిద్దామంటే.. అవతలి రాష్ట్ర అటవీశాఖ అధికారులు అభ్యంతరం చెబుతుంటారు. ఉదాహరణకు పార్వతీపురం జోన్ లోని ఏనుగులను ఒడిశా అటవీ ప్రాంతానికి తరలించడానికి ట్రై చేస్తే.. అక్కడి అటవీ శాఖ దీనికి నో చెప్పింది. ఇలాంటి సమయంలో ఏం చేయాలో తెలియని పరిస్థితి. అందుకే ఇలాంటి సమస్యలకు పరిష్కారం.. ఎలిఫెంట్ జోన్. అవును.. ఏనుగుల కోసం ప్రత్యేకంగా జోన్ ను ఏర్పాటు చేస్తే.. వాటిని అక్కడికి తరలించడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల బాధితులకు ఉపశమనం ఉంటుంది. గతంలో కుంకీ ఏనుగులను తెప్పించి.. వాటి ద్వారా ఆపరేషన్ గజేంద్రను నిర్వహించిన సందర్భాలున్నాయి. కానీ అది పూర్తిస్థాయిలో కొనసాగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

మరిన్ని ప్రీమియం  కథనాల కోసం TV9 News APP  డౌన్‌లోడ్ చేసుకోండి.