ముంబై ట్రాన్స్-హార్బర్ సీ లింక్ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైంది. ఈ నెల 12వ తేదిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ వంతెనను ప్రారంభించబోతున్నారు. తీవ్రమైన ట్రాఫిక్ రద్దీని తగ్గించే ప్రయత్నంలో దేశంలోనే అత్యంత పొడవైన రహదారి వంతెన ముంబయి ట్రాన్స్-హార్బర్ లింక్ నిర్మాణాన్ని చేపట్టింది మహారాష్ట్ర ప్రభుత్వం. మొత్తం రూ.17,843కోట్లతో ఈ ప్రాజెక్టును చేపట్టారు. ముంబయిలోని సెవ్రిలో ప్రారంభమై, రాయగఢ్ జిల్లాలోని నహవ శేవ(నవీముంబై) వద్ద ముగుస్తుంది. మొత్తం 21.8కిలోమీటర్ల వంతెనలో సముద్రంపైన 16.5కిలోమీటర్లు, నెలపైన మరో 5.5కిలోమీటర్ల వంతెన నిర్మాణం జరిగింది.
ప్రస్తుత ట్రాఫిక్ రద్దీతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ సీ బ్రీడ్జ్ నిర్మాణం జరిగింది. మొత్తం ఆరులైన్ల రహదారితో పాటు ఇరువైపులా అత్యవసర లైన్‌తో వంతెనను నిర్మించారు. 70 ఆర్థోట్రోపిక్ స్టీల్ డెక్ స్పాన్స్ ను 90మీటర్ల నుంచి 180మీటర్ల లెన్త్ ఉపయోగించి నిర్మాణమైన దేశంలోనే మొదటి బ్రిడ్జ్ ఇదే. సుధీర్ఘమైన ఈ సముద్రపు బ్రిడ్జ్ లో సెవ్రి, శివాజీనగర్, ఎస్ హెచ్-54, చిర్లె వద్ద ఇంటర్ ఛేంజ్ లు ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ 70వేల వాహనాలు రాకపోకలు సాగించేందుకు అనువుగా ఉంటుంది ఈ బ్రిడ్జ్. గరిష్టంగా 100కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించవచ్చు.
వంతెనపై వాహనాల బ్రెక్ డౌన్‌ల సమాచారం కోసం ప్రత్యేకంగా అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిగిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక ఈ వంతెన నిర్మాణంతో ప్రస్తుతం ఉన్న ప్రయాణ సమయం రెండు గంటల నుంచి 30నిమిషాలకు తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 10మిలియన్ల ఇంధన ఉపయోగం తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. వాహనాల నుంచే వచ్చే కార్బన్ డై ఆక్సైడ్ ను సైతం పెద్ద మొత్తంలో తగ్గించే అవకాశం ఉంది. ఇక ముంబై మెట్రోపాలీటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్వర్యంలో 2018లో ఈ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
నాలుగు ప్యాకేజీల రూపంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును గతేడాది డిసెంబర్ నెల చివరలో పూర్తిచేశారు. దేశంలోనే అతిపెద్ద సముద్ర వంతెన నిర్మాణానికి 85,000మెట్రిక్ టన్నుల ఓఎస్డీ స్టీల్, 1,70,000 మెట్రిక్ టన్నుల రెయిన్ఫోర్స్ మెంట్ స్టీల్, 9,75,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్‌ను ఉపయోగించారు.
ఇంత ఖర్చుతో నిర్మించిన సీ బ్రీడ్జ్ ఎక్కాలంటే మాత్రం భారీగా చెల్లించాల్సి ఉంటుంది. ముంబై మెట్రోపాలీటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఈ మార్గంలో టోల్ వసూలు చేయనుంది. సింగిల్ ట్రిప్ కు రూ. 250, అప్ అండ్ డౌన్ కు రూ. 375లుగా ధరను నిర్ణయించింది ప్రభుత్వం. ఇక రోజువారి పాస్ అయితే రూ. 625, నెలవారీ పాస్ అయితే రూ. 12,500లు చెల్సించాలి. అయితే ముంబై మెట్రోపాలీటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సిఫారసు చేసిన రూ. 500 టోల్‌ను తగ్గిస్తూ రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏడాది తర్వాత ఈ టోల్ ధరలను రాష్ట్ర ప్రభుత్వం సమీక్షంచనుంది. ప్రస్తుతం ప్రకటించిన టోల్ ధరలు కేవలం కార్లకు మాత్రమేనని భారీ వాహనాల టోల్ ధరలను సైతం త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..