Lok Sabha Polls 2024: అమేథీ నుంచి వరుణ్ గాంధీ పోటీ చేస్తారా..? బీజేపీ ఎంపీ ఏం చెప్పారంటే..

|

Feb 26, 2024 | 4:54 PM

యూపీలోని ఫిలిబిత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. పలు అంశాల్లో ఆయన కేంద్రంలోని మోదీ సర్కారు, యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

Lok Sabha Polls 2024: అమేథీ నుంచి వరుణ్ గాంధీ పోటీ చేస్తారా..? బీజేపీ ఎంపీ ఏం చెప్పారంటే..
BJP MP Varun Gandhi (File Photo)
Follow us on

యూపీలోని ఫిలిబిత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీగా ఉన్న వరుణ్ గాంధీకి ఈ సారి బీజేపీ టికెట్ ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. పలు అంశాల్లో ఆయన కేంద్రంలోని మోదీ సర్కారు, యూపీలోని యోగి ఆదిత్యనాథ్ సర్కారుకు వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో వరుణ్ గాంధీ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కాంగ్రెస్-సమాజ్‌వాది పార్టీ కూటమి మద్ధతుతో ఆయన అమేథీ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశముందన్న టాక్ వినిపిస్తోంది. 2019 వరకు అమేథీ నియోజకవర్గం నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటగా నిలిచింది. అంతకు ముందు 15 ఏళ్లు రాహుల్ గాంధీ అమేథీకి ప్రాతినిథ్యంవహించారు. గత ఎన్నికల్లో అమేథీతో పాటు కేరళలోని వయనాడ్ నుంచి లోక్‌సభకు పోటీచేసిన రాహుల్ గాంధీ.. అమేథీలో స్మృతి ఇరానీ చేతిలో పరాజయం పాలయ్యారు. వయనాడ్ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ వయనాడ్ నుంచే పోటీ చేయనున్నారు.

కాంగ్రెస్-సమాజ్‌వాది పార్టీల మధ్య కుదిరిన పొత్తుల భాగంగా.. అమేథీ, రాయ్‌బరేలి నియోజకవర్గాలను కాంగ్రెస్ దక్కించుకుంది. రాయ్‌బరేలి నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహిస్తున్న సోనియాగాంధీ..రాజ్యసభకు వెళ్తున్నారు. దీంతో రాయ్‌బరేలి నుంచి ప్రియాంక గాంధీ బరిలో నిలిచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో అమేథీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరిని బరిలో నిలుపుతుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

రాహుల్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేయని పక్షంలో ఇక్కడి నుంచి వరుణ్ గాంధీ పోటీ చేయాలని గాంధీ-నెహ్రూ కుటుంబ అభిమానులు కోరుతున్నారు.  1980లో వరుణ్ గాంధీ తండ్రి సంజయ్ గాంధీ ఇక్కడి నుంచి పోటీచేసి గెలుపొందారని గుర్తుచేస్తున్నారు. ఇక్కడి నుంచి పోటీ చేస్తే తమ మద్ధతు ఉంటుందని చెబుతున్నారు. మరికొందరు మేనకా గాంధీ, వరుణ్ గాంధీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని కోరుతున్నారు. అయితే వారు ఇందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది.  కాంగ్రెస్, సమాజ్‌వాది పార్టీల మద్ధతులో స్వతంత్ర అభ్యర్థిగా వరుణ్ గాంధీ అమేథీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.  ఇదే అంశంపై వరుణ్ గాంధీని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అయితే తాను  అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదని ఆయన సమాధానం ఇచ్చారు.

బీజేపీ టికెట్ డౌటే…

బీజేపీ నుంచి ఫిలిబిత్ టికెట్ దక్కే అవకాశం లేనందున వరుణ్ గాంధీ తదుపరి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికర అంశంగా మారింది. గతంలో పార్టీ లైన్‌తో విభేదిస్తూ రైతుల ఆందోళనకు వరుణ్ గాంధీ మద్ధతు ప్రకటించారు. గతంలో ఆయన సమాజ్‌వాది పార్టీలో చేరే అవకాశముందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే తన తదుపరి రాజకీయ అడుగులపై వరుణ్ గాంధీ మౌనంవీడడం లేదు. అటు వరుణ్ గాంధీ తల్లి మేనకా గాంధీ ప్రస్తుతం యూపీలోని సుల్తాన్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యంవహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆమెకు కూడా బీజేపీ టికెట్ కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది. మేనకా గాంధీ, వరుణ్ గాంధీ 2004లో బీజేపీలో చేరారు. యూపీ బీజేపీలో తమకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని వారు గత కొన్నేళ్లుగా గుర్రుగా ఉన్నారు.

వరుణ్ గాంధీ, మేనకా గాంధీలకు టికెట్ నిరాకరిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఫిలిబిత్, సుల్తాన్‌పూర్ సీట్లను బీజేపీ ఎవరికి కేటాయిస్తుందన్న అంశం కూడా యూపీ రాజకీయ వర్గాల్లో ఆసక్తిరేపుతోంది.