
గాంధీ జయంతి అంటే మనకు ముందుగా గుర్తొచ్చేవి మూతపడిన బ్యాంకులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు.. దానితో పాటు తెల్లటి వస్త్రం, చేతిలో కర్ర, గుండ్రటి కళ్ళద్దాలు ఉన్న ఒక మహనీయుడి చిత్రం. కానీ, స్వాతంత్ర్య దినోత్సవం వేళ మనలో చాలామంది అడగని ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ ఏ ప్రభుత్వ పదవిని చేపట్టారు?..
దీనికి నిజాయితీగల సమాధానం.. ఆయన ఏ పదవినీ తీసుకోలేదు.
ఆయన ప్రధానమంత్రి కాలేదు, రాష్ట్రపతి కాలేదు, కనీసం పార్లమెంట్ సభ్యుడిగా కూడా కూర్చోలేదు. బ్రిటిష్ పాలనకు ముగింపు పలికిన ప్రధాన వ్యక్తిగా యావత్ దేశం కీర్తించే నాయకుడు, తాను స్వేచ్ఛను తెచ్చిన దేశంలో ఒక్క అధికార హోదాను కూడా కలిగి లేరు.
రాజకీయాలకు దూరం: గాంధీజీ 1924లో ఒకే ఒక్కసారి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు. అది కూడా అప్పటికి ఒక రాజకీయ ఉద్యమం మాత్రమే, ప్రభుత్వం కాదు. 1934 నాటికే ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుని గ్రామీణ పారిశుధ్యం, చేనేత, అణగారిన వర్గాల సంక్షేమం వంటి సేవా కార్యక్రమాలపై దృష్టి సారించారు.
స్వాతంత్ర్య సంబరాలకు దూరం: 1947 ఆగస్టులో దేశమంతా స్వాతంత్ర్య సంబరాలలో మునిగితేలుతున్నప్పుడు ఆయన ఢిల్లీలోని అధికార కారిడార్లలో లేరు. విభజన సమయంలో బెంగాల్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చెలరేగిన మత అల్లర్లను ఆపి, ప్రజల ప్రాణాలను కాపాడేందుకు కృషి చేశారు.
పదవి, హోదా లేకుండానే ఆయనకు ఆ అపారమైన ప్రభావం ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రజల నమ్మకం: ఆయన అధికారం రాజ్యాంగం ఇచ్చిన పదవి నుంచి రాలేదు. ఆయన జీవన విధానం, నిష్కల్మషమైన ప్రవర్తన, స్వీయ క్రమశిక్షణను చూసి ప్రజలే ఆయనను అనుసరించడం ప్రారంభించారు.
మార్పునకు పదవి అవసరం లేదు: సాధారణంగా మార్పు తీసుకురావడానికి మనకు ఒక హోదా, హోదాను తెలిపే బ్యాడ్జ్ లేదా ఒక నాయకత్వ కుర్చీ ఉండాలని భావిస్తాం. కానీ, గాంధీజీ జీవితం దానికి పూర్తి భిన్నమైన ఉదాహరణగా నిలుస్తుంది. మన కాలనీలో చిన్న సమస్యను పరిష్కరించేందుకు నిరంతరం శ్రమించే సాధారణ పౌరుడికి కూడా ఎలాంటి ప్రభుత్వ అధికారాలు ఉండవు, కానీ నమ్మకమే వారి శక్తి.
గాంధీజీ ఎంచుకున్న మార్గం ఏమీ తేలికైనది కాదు. దానికి అపారమైన సహనం, వ్యక్తిగత త్యాగం, ప్రాణాలను పణంగా పెట్టే తెగువ అవసరం. ఆయన అనేకసార్లు జైలుకు వెళ్లారు, సుదీర్ఘ నిరాహార దీక్షలతో తన ఆరోగ్యాన్ని, ప్రాణాలను ముప్పులోకి నెట్టారు. నైతిక అధికారంతో మార్పు తేవడం అనేది రాజకీయ అధికారం కంటే చాలా కష్టమైనది.. ప్రతి ఒక్కరి నుండి ఎక్కువ నిబద్ధతను కోరుకుంటుంది.
నోట్లపై గాంధీ బొమ్మను చూడటం లేదా సెలవు దినంగా భావించడం కంటే గాంధీ జీవితం మన ముందుంచిన ఈ ప్రశ్నకు సమాధానం వెతకడం చాలా ముఖ్యం:
“ఇరవైయో శతాబ్దంలో దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేసిన వ్యక్తికి ఎలాంటి అధికారిక పదవి అవసరం లేనప్పుడు.. సమాజంలో ఏదైనా మంచి మార్పు తీసుకురావడానికి మనం ఇంకా ఏ హోదా కోసం వేచి చూస్తున్నాం?”