డీఎంకే ఎంపీ రాజాకు ఈడీ షాక్.. కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..

|

Dec 23, 2022 | 8:14 AM

దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన 2జీ స్ప్రెక్టమ్‌ కుంభంకోణం ఆరోపణల్లో జైలుకెళ్లొచ్చిన తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ రాజాకు మరోసారి షాకిచ్చింది ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌. కోయంబత్తూరులో రూ.55కోట్ల విలువైన..

డీఎంకే ఎంపీ రాజాకు ఈడీ షాక్.. కోట్ల విలువైన ఆస్తుల అటాచ్..
Mp A.raja
Follow us on

దేశ వ్యాప్తంగా గతంలో సంచలనం సృష్టించిన 2జీ స్ప్రెక్టమ్‌ కుంభంకోణం ఆరోపణల్లో జైలుకెళ్లొచ్చిన తమిళనాడుకు చెందిన డీఎంకే ఎంపీ రాజాకు మరోసారి షాకిచ్చింది ఎన్‌ఫోర్సుమెంట్‌ డైరెక్టరేట్‌. కోయంబత్తూరులో రూ.55కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసింది. 45 ఎకరాల బినామీ భూములను స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఈ అసెట్స్‌ను జప్తు చేసినట్లు వెల్లడించింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. 2004-2007 సంవత్సరాల మధ్య కేంద్ర పర్యావరణ అటవీశాఖా మంత్రిగా ఉన్నప్పుడు రాజా అక్రమాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదు చేసింది ఈడీ. గురుగ్రామ్‌ కేంద్రంగా పనిచేసే ప్రముఖ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీకి పర్యావరణ అనుమతులు మంజూరు చేయడానికి అడ్డదారులు తొక్కినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. డీల్‌లో భాగంగా కోయంబత్తూరులో 45 ఎకరాల భూమిని రాజా కంపెనీ కొనుగోలు చేసిందని వెల్లడించింది. అయితే, ఈ భూమి రాజాకు చెందిన బినామీ కంపెనీ పేరిట ఉన్నట్లు తెలిపింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌.

నీలగిరి నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తోన్న ఎ.రాజా, డీఎంకేలో కీలక నాయకుడిగా ఉన్నారు. గతంలో 2జీ స్ప్రెక్టమ్‌ స్కామ్‌లో జైలుకు కూడా వెళ్లొచ్చారు. 2జీ స్ప్రెక్టమ్‌ స్కామ్‌ అప్పట్లో దేశ రాజకీయాలనే కుదిపేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మనీ లాండరింగ్‌ కేసులో రాజాపై అభియోగాలు నమోదు చేయడం, బినామీ ఆస్తులను జప్తు చేయడం తమిళనాట సంచలనం రేపుతోంది.  కాగా అక్టోబర్ నెలలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  రాజాపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. రాజా కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో రూ.5.53 కోట్ల మేర ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని అధికారులు ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..