దక్షిణ భారత్‌కు డేంజర్‌ బెల్స్‌.. ఆరు నెలల్లో వేలాది మరణాలు.. తెలుగు రాష్ట్రాలకూ తప్పని ఎఫెక్ట్‌..!

క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ నివేదిక ప్రకారం, సూపర్ ఎల్‌నినో కారణంగా భారత్‌లో సెప్టెంబర్ 2026-ఫిబ్రవరి 2027 మధ్య 15,800 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించవచ్చు. దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ, అధిక ప్రమాదంలో ఉన్నాయి. వాతావరణ మార్పులతో పాటు ఈ ముప్పును ఎదుర్కొనేందుకు ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, ప్రజలకు అవగాహన, రక్షణ చర్యలు అత్యవసరం.

దక్షిణ భారత్‌కు డేంజర్‌ బెల్స్‌.. ఆరు నెలల్లో వేలాది మరణాలు.. తెలుగు రాష్ట్రాలకూ తప్పని ఎఫెక్ట్‌..!
El Nino Impact India

Updated on: Sep 30, 2026 | 11:26 AM

సూపర్ ఎల్‌నినో ప్రభావం భారత్‌పై తీవ్రంగా పడే అవకాశం ఉందని తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ విడుదల చేసిన ‘451,000 at Risk’ నివేదిక ప్రకారం.. సెప్టెంబర్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 మధ్య సాధారణ సంవత్సరంతో పోలిస్తే భారత్‌లో వేడి సంబంధిత కారణాలతో అదనంగా సుమారు 15,800 మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఇది వాస్తవ మరణాల లెక్క కాదు.. వాతావరణం, ఉష్ణోగ్రతలు, స్థానిక పరిస్థితులు, గతంలో ఉష్ణోగ్రతలకు సంబంధించిన మరణాల నమూనాల ఆధారంగా రూపొందించిన అంచనా.

నివేదిక ప్రకారం భారత్‌లోనే అత్యధిక ప్రభావం దక్షిణాది రాష్ట్రాలపై కనిపించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో 2,640 అదనపు మరణాలు అంచనా వేయగా.. కర్ణాటక 1,870తో దేశంలో రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్, కేరళలో చెరో 1,680, తమిళనాడులో 1,640, తెలంగాణలో 1,122 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉందని నివేదిక గణాంకాలు సూచిస్తున్నాయి. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐదు దక్షిణ రాష్ట్రాల్లో కలిపి 7,992 మరణాలు అంచనా వేయశారు. అంటే దేశవ్యాప్తంగా అంచనా వేసిన సంఖ్యలో దాదాపు సగం దక్షిణ భారతంలోనే ఉండొచ్చన్నమాట..!

ఫిబ్రవరిలో ముప్పు మరింత పెరిగే అవకాశం

నివేదికలోని అంచనాల ప్రకారం దక్షిణాది రాష్ట్రాల్లో వేడి సంబంధిత మరణాలు సెప్టెంబర్, అక్టోబర్‌లో అధికంగా ఉండి.. నవంబర్, డిసెంబర్‌లో కొంత తగ్గిన తర్వాత జనవరి, ఫిబ్రవరిలో మళ్లీ పెరిగే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత ఆరు నెలల అంచనా ముగిసిన తర్వాత కూడా భారత్‌లో, ముఖ్యంగా ఉత్తరార్థగోళ వేసవి సమయంలో వేడి సంబంధిత మరణాలు పెరిగే అవకాశం ఉందని Climate Impact Lab పేర్కొంది.

అసలు ఏంటి సూపర్ ఎల్‌నినో?

పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతల్లో అసాధారణ పెరుగుదలతో ఏర్పడే ఎల్‌నినో ప్రపంచవ్యాప్తంగా వాతావరణ నమూనాలను ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత ఎల్‌నినో జూన్ 2026లో ప్రారంభమై ఉత్తరార్థగోళ వసంతకాలం వరకు కొనసాగే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. రాబోయే నెలల్లో ప్రపంచ భూభాగ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి సుమారు 1.2°C అధికంగా ఉండొచ్చని, అత్యంత వేడి రోజులు సాధారణ సంవత్సరంతో పోలిస్తే 44 శాతం అధికంగా ఉండవచ్చని అంచనా వేసింది.

Climate Impact Lab లెక్కల ప్రకారం.. ఎల్‌నినో ప్రారంభమైన జూన్ 2026 నుంచి ఫిబ్రవరి 2027 వరకు తొమ్మిది నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణ సంవత్సరంతో పోలిస్తే సుమారు 4,51,000 అదనపు వేడి సంబంధిత మరణాలు సంభవించే అవకాశం ఉంది. ఇందులో వచ్చే ఆరు నెలలకు సంబంధించిన అంచనా 2,39,000 గా ఉంది.

తెలంగాణకు ఎందుకు అప్రమత్తత అవసరం?

తెలంగాణలో 1,122 అదనపు వేడి సంబంధిత మరణాల అంచనా నమోదవడం రాష్ట్రానికి కూడా ముప్పు ఉందనే విషయాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఉన్నవారు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులు, తగిన శీతలీకరణ సదుపాయాలు లేని ప్రజలు తీవ్ర వేడికి ఎక్కువగా గురయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముందస్తు వేడి హెచ్చరిక వ్యవస్థలు, బలహీన వర్గాలకు లక్ష్యిత ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు, తాగునీటి కేంద్రాలు, కూలింగ్ సెంటర్లు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే కార్మికులకు రక్షణ చర్యలు, ఆసుపత్రుల్లో అత్యవసర సామర్థ్యాన్ని పెంచడం వంటి చర్యలు ఉపయోగపడతాయని Climate Impact Lab సూచించింది.

పరిశోధకుల దృష్టిలో ఈ నివేదిక కేవలం ప్రస్తుత ఎల్‌నినో ప్రమాదాన్ని చూపించడమే కాదు.. భవిష్యత్తులో వాతావరణ మార్పులతో సాధారణంగా మారే అధిక ఉష్ణోగ్రత పరిస్థితులకు ముందస్తు హెచ్చరికగా కూడా పనిచేస్తోంది. అందుకే అత్యవసర చర్యలతో పాటు దీర్ఘకాలికంగా వేడి నుంచి ప్రజలను రక్షించే మౌలిక సదుపాయాలు, ఆరోగ్య వ్యవస్థలు, ముందస్తు ప్రణాళికలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని నివేదిక సూచిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us