పార్లమెంట్‌లో కలర్ స్మోక్ దాడి అందరిని షాక్‌కు గురిచేసింది. కట్టుదిట్టమైన భద్రత ఉండే చట్టసభల్లో భద్రతా వైఫల్యాన్ని ఈ ఘటన వెలుగు లోకి తెచ్చింది. దీనిపై పార్లమెంట్‌లో అధికార. విపక్షాల మధ్య మాటల తూటాలతో యుద్ద వాతావరణం నెలకొంది. అయితే పార్లమెంటులో అలజడి సృష్టించిన వీళ్లంతా ఈ తరహా దాడికి ఎందుకు పాల్పడ్డారు.. కారణమేంటి..? దీని వెనుక ఉన్నదెవరు..? పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడి జరిగిందా..? ఇందులో భద్రతా వైఫల్యం ఎంత? అనే కోణాల్లో పోలీసుల విచారణ కొనసాగుతోంది.
పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ సాగర్‌శర్మ, మనోరంజన్, నీలం, ఆమోల్ షిండే, గురుగావ్‌లో వారికి ఆశ్రయం కల్పించిన విక్కీశర్మ, అతని భార్యను ఇప్పటికే పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. వారిపై ప్రశ్నలవర్షం కురిపిస్తున్నారు. నీలం గతంలో పలు ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారా..? అనే కోణంలో విచారణ చేస్తున్నారు.
పార్లమెంట్‌పై దాడికి పాల్పడ్డ ఏడుగురు నిందితులు భగత్‌సింగ్ ఫ్యాన్స్ క్లబ్ పేరుతో ఓ సోషల్ మీడియా గ్రూప్ ఏర్పాటు చేసుకున్నట్లు విచారణలో తేలింది. సోషల్ మీడియా ద్వారా నిందితులు ఒకరినొకరు పరిచయం అయ్యారు. వీరంతా ఏడాదిన్నర క్రితం మైసూరులో కలిసినట్లు తెలుస్తోంది. 9 నెలల క్రితం మరోసారి కలిసినట్లు సమాచారం. జులైలోనే లక్నో నుంచి ఢిల్లీ వచ్చాడు సాగర్‌శర్మ. అప్పుడే పార్లమెంట్ సెక్యూరిటీ ఏర్పాట్లపై రెక్కీ నిర్వహించినట్లు విచారణలో వెల్లడైంది. పార్లమెంట్‌లో పొగదాడి కోసం నిందితులు ఆదివారం ఢిల్లీ చేరుకున్నారు. గుర్గావ్‌లోని విక్కీశర్మ ఇంట్లో బసచేసి పథక రచన చేశారు. మహారాష్ట్ర నుంచి స్మోక్ క్యాన్లను ఆమోల్ షిండే తీసుకొచ్చారు.
ఇండియాగేట్ దగ్గర మీటింగ్ పెట్టుకుని స్మోక్ క్యాన్లను అందరూ పంచుకున్నారు. ఆరుగురు పాసులు తీసుకొని లోపలికి వెళ్లాలని పథకం రచించారు. కానీ మనో రంజన్, సాగర్‌శర్మకు మాత్రమే పాసులు లభించాయి. వీళ్లిద్దరు మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా పీఏ ద్వారా పాసుల కోసం ప్రయత్నించినట్లు తెలుస్తోంది. లోక్‌సభ గ్యాలరీ నుంచి సభలోకి దూకి స్మోక్ క్యాన్లు ప్రయోగించారు సాగర్‌శర్మ, మనో రంజన్. పార్లమెంట్ కాంపౌండ్ వెలుపల గేట్ దగ్గర పొగబాంబు ప్రయోగించి నీలం, ఆమోల్ షిండే నినాదాలు చేశారు. వాళ్లిద్దరిని పోలీసులు పట్టుకోగానే విక్కీశర్మ, లలిత్ ఝూ పరారయ్యారు. అనంతరం విక్కీశర్మ, అతని భార్యను గుర్గావ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక వీరందరిపై UAPA చట్టం ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సాగర్ శర్మ, మనోరంజన్ డి, అమోల్ షిండే, నీలం వర్మహాస్, లలిత్ ఝా మరియు విశాల్ ఈ సంఘటనను ప్లాన్ చేశారు. నిందితులంతా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారే. రిక్షా డ్రైవర్ల నుండి ఇంజనీర్ల వరకు ఈ కుట్రలో పాలుపంచుకున్నారు.
షిండే కుటుంబం ముంబై సమీపంలోని లాతూర్ జిల్లా జారీ బుద్రుక్‌లో నివసిస్తోంది. అతని తల్లిదండ్రులు రైతులు. పోలీసులు వారి ఇంటికి చేరుకోవడంతో బుధవారం జరిగిన సంఘటన గురించి తెలుసుకున్నారు. అమోల్ 12వ తరగతి వరకు చదివి ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడు. ఆర్మీలో చేరాలనుకున్న అతడు గత శనివారం ఢిల్లీ పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతడి ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉందని తల్లిదండ్రులు తెలిపారు. ఉద్యోగం లేకపోవడంతో అమోల్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అమోల్ షెడ్యూల్డ్ కులానికి చెందినవాడని, అతని కుటుంబానికి ప్రభుత్వ హౌసింగ్ స్కీమ్ కింద ఒక చిన్న ఇల్లు కేటాయించడం జరిగింది. అమోల్ అన్నయ్య నగరాల్లో కల్లుగీత కార్మికుడిగా పనిచేస్తున్నారని గ్రామస్తులు చెప్పారు.
రెండో నిందితుడు నీలమ్ వర్మహాస్ హర్యానాలోని జింద్ జిల్లా గషో ఖుర్ద్ గ్రామ నివాసి. ఎంఫిల్ డిగ్రీ చదివారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఆజాద్ భగత్ సింగ్ స్ఫూర్తితో, ఆమె తనను తాను నీలం ఆజాద్ అని పిలుచుకుంటుంది. నీలం కూడా నిరుద్యోగంతో ఇబ్బంది పడుతోంది. హర్యానా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (HTET)లో కూడా ఉత్తీర్ణత సాధించింది. కానీ ఇంకా టీచర్ ఉద్యోగం రాలేదు. ఆమె రైతుల ఉద్యమం, మహిళా మల్లయోధుల నిరసనలతో సహా వివిధ నిరసనలలో కూడా పాల్గొంది. నీలం OBC వర్గానికి చెందినది. విప్లవ భావాలు కలిగిన అమ్మాయిగా కూడా పిలుస్తారు. HTET పరీక్ష చెల్లుబాటు ఏడు సంవత్సరాలు. అంటే ఎవరైనా ఈ పరీక్షలో ఉత్తీర్ణులైతే, వారు ఉపాధ్యాయురాలిగా మారడానికి ఏడేళ్ల సమయం ఉంది. నీలం HTET గుర్తింపు ఈ సంవత్సరంతో ముగుస్తుంది. ఆమె వయస్సు 37 సంవత్సరాలు. తాను ఢిల్లీలో ఉన్నానని నీలమ్ తమతో చెప్పలేదని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
మూడో నిందితుడు సాగర్ శర్మ ఇ – రిక్షా డ్రైవర్. స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, ప్రముఖ క్యూబా ఉద్యమకారుడు చే గువేరా అభిమాని. అతను తన సోషల్ మీడియాలో ఈ ఇద్దరు వ్యక్తుల కోట్‌లను పోస్ట్ చేస్తూనే ఉంటాడు. సాగర్‌కి 28 ఏళ్లు. పార్లమెంటులోని విజిటర్స్ గ్యాలరీ నుండి సభలోకి దూకి పసుపు పొగను ఊదాడు. అతను లక్నోలోని రామ్‌నగర్‌లోని అలంబాగ్ నివాసి. ఢిల్లీ నిరసనలో పాల్గొంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబీకులు చెబుతున్నారు. తన కొడుక్కి పార్లమెంట్ పాస్ ఎలా వచ్చిందో తెలియదని సాగర్ తల్లి అంటోంది. సాగర్ ఎలాంటి తప్పుడు ఉద్దేశ్యంతో ఇలా చేయలేదని అంటున్నారు. అతను 10 వ తరగతి వరకు చదువుకున్నాడు. 2018 లో అతను బెంగళూరులోని ఒక పిండి మిల్లులో పనిచేశాడు. కానీ 2020 లో కరోనా మహమ్మారి సమయంలో తిరిగి వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ ఇ-రిక్షా నడుపుతున్నాడు.
కర్ణాటకలోని మైసూరులో నివాసం ఉంటున్న మనో రంజన్ డి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీర్ గ్రాడ్యుయేట్. పార్లమెంటులో పొగలు చిమ్మేందుకు డబ్బా విప్పిన మనోరంజన్. మనోరంజన్‌కు పుస్తకాలు, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని, మంచి మనసు ఉంటుందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మనోరంజన్ సమాజం కోసం పని చేయాలనే కోరికతో ఆ పని చేయలేదని చెబుతున్నారు కుటుంబసభ్యులు. అతను కొంతకాలం తన కుటుంబ వ్యాపారం కోసం పనిచేశాడు. ఫేస్‌బుక్‌లో భగత్ సింగ్ ఫ్యాన్ పేజీ కారణంగా అతడు ఈ కుట్రలో భాగమై ఉండవచ్చని, అందుకే ఈ కుట్రలో చేరేందుకు మైసూర్ నుంచి ఢిల్లీకి వెళ్లాడని స్థానిక పోలీసులు తెలిపారు. మనోరంజన్ తన పాఠశాల విద్యను సెయింట్ స్టీఫెన్స్ కళాశాల, మరిమల్లప్ప హైస్కూల్ నుండి అభ్యసించారు. బెంగళూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఇంజనీరింగ్ చదివారు.
ప్లానింగ్‌లో భాగంగా జీరో అవర్‌లో సాగర్ శర్మ, మనోరంజన్ డి ప్రేక్షకుల గ్యాలరీ నుంచి లోక్‌సభ ఛాంబర్‌లోకి దూకి, క్యాన్‌లో నుంచి పసుపు వాయువు ఊదుతూ నినాదాలు చేశారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో పార్లమెంట్ హౌస్ వెలుపల అమోల్ షిండే, నీలం డబ్బాల నుంచి ఎరుపు, పసుపు పొగలు వ్యాపించి ‘నియంతృత్వం నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. సాగర్, మనోరంజన్, అమోల్, నీలం ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. అదే సమయంలో ఐదో నిందితుడు విశాల్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటుకు చేరుకోకముందే నలుగురూ విశాల్ ఇంట్లోనే బస చేసినట్లు పోలీసలు తెలిపారు. పరారీలో ఉన్న ఆరో నిందితుడు లలిత్ కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…