Haryana Election Results: గెలుపు వాకిట బోర్లాపడ్డ కాంగ్రెస్.. ఆ పార్టీ కొంప ముంచిన కారణాలివే..!

| Edited By: Janardhan Veluru

Oct 08, 2024 | 7:09 PM

Haryana Assembly Election Results 2024: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతాయన్న ధీమాతో ఓట్ల లెక్కింపు ప్రారంభించడంతోనే సంబరాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభాసుపాలైంది. ఇప్పటికీ ఓటమిని అంగీకరించకుండా కేంద్ర ఎన్నికల సంఘంపై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఓవైపు సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, జాట్ సామాజికవర్గంలో నెలకొన్న ఆగ్రహం..

Haryana Election Results: గెలుపు వాకిట బోర్లాపడ్డ కాంగ్రెస్.. ఆ పార్టీ కొంప ముంచిన కారణాలివే..!
Haryana Assembly Election 2024 Results
Follow us on

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతాయన్న ధీమాతో ఓట్ల లెక్కింపు ప్రారంభించడంతోనే సంబరాలు చేసుకుని కాంగ్రెస్ పార్టీ అభాసుపాలైంది. ఇప్పటికీ ఓటమిని అంగీకరించకుండా కేంద్ర ఎన్నికల సంఘంపై నెపాన్ని నెట్టేసే ప్రయత్నం చేస్తోంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఓవైపు సహజంగా ఏర్పడే ప్రభుత్వ వ్యతిరేకత, జాట్ సామాజికవర్గంలో నెలకొన్న ఆగ్రహం, దేశానికి అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని తెచ్చిపెట్టిన క్రీడాకారుల్లో కొందరు రాజకీయా ఆరంగేట్రం చేసి కాంగ్రెస్‌ పక్షాన నిలబడడం, రైతు ఆందోళనలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం, అగ్నివీర్ పథకంపై అసంతృప్తి వంటి అనేక సవాళ్లను ఎదుర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీని బలమైన ప్రత్యర్థి ఎవరైనా సునాయాసంగా ఓడించవచ్చు. అయితే అలా వ్యతిరేకించే వర్గాలను ఆకట్టుకుని, వారిలో నమ్మకాన్ని కల్గించగల్గితేనే విజయం సిద్ధిస్తుంది. ఎగ్జిట్ పోల్ అంచనాల కంటే ముందు నుంచే హర్యానాలో అధికారపక్ష వ్యతిరేక వాతావరణం గురించి విస్తృతంగా చర్చ జరిగింది. ఈ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేయదగ్గ వర్గాలైన కిసాన్ (రైతులు), నవ్‌జవాన్ (యువత), పహిల్వాన్ (రెజ్లర్లు) బాహాటంగానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తరహా నెరేటివ్ (కథనం)ను రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేసింది. ఈ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీయే గెలుపొందాలి. కానీ అలా జరగలేదు. విజయం వాకిట గ్రాండ్ ఓల్డ్ పార్టీ బొక్కబోర్లా పడింది. ఇందుకు దారితీసిన కారణాల్లో కాంగ్రెస్ స్వయంకృతాపరాథాలే ఎక్కువ.

బెడిసికొట్టిన జాట్-దళిత కాంబినేషన్

ఎన్నికలను ప్రభావితం చేసే ఇతర అంశాలు ఎన్నున్నా.. సామాజిక సమీకరణాలు పోషించే పాత్ర అంతా ఇంతా కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జాట్- దళిత – మైనారిటీ కాంబినేషన్ ఆధారంగా గెలుపొందాలని భావించింది. హర్యానా సమాజంలో వ్యవసాయ పెత్తందారీ వర్గంగా ఉన్న జాట్లు వ్యవసాయంతో పాటు రాజకీయంగా ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ముఖ్యమంత్రిగా జాట్ వర్గం నేతలే ఉండేవారు. అలాంటి జాట్లకు గత పదేళ్లుగా రాజకీయంగా ఎలాంటి ఆధిపత్యం లేకుండా పోయింది. భారతీయ జనతా పార్టీ జాటేతర వర్గానికి చెందిన నేత మనోహర్ లాల్ ఖట్టర్‌కు 9 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించగా.. ఏడాది కాలంగా ఓబీసీ వర్గాలకు చెందిన నయాబ్ సింగ్ సైనీ సీఎంగా ఉన్నారు. ఈ చర్య జాట్లలో తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి కారణమైంది. దీంతో ఆ వర్గంలో మెజారిటీ ఓటర్లు బీజేపీ పట్ల వ్యతిరేకత మాత్రమే కాదు, ద్వేషాన్ని కూడా పెంచుకున్నారు. ఫలితంగా బీజేపీ ని వ్యతిరేకించే బలమైన పార్టీ కాంగ్రెస్‌కు అండగా నిలవాలని వారు నిర్ణయించుకున్నారు. రైతులుగా, పహిల్వాన్లుగా ఎక్కువ సంఖ్యలో ఉన్న జాట్లకు కాంగ్రెస్ పెద్దపీట వేసింది. తమ రాష్ట్ర విభాగంలో జాట్ వర్గం నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడాకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది.

మరోవైపు తమ సాంప్రదాయ ఓటుబ్యాంకుగా ఉన్న దళిత, మైనారిటీలను కలుపుకుంటే తాము సునాయాసంగా విజయం సాధించవచ్చని భావించింది. కానీ జాట్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జాటేతర సామాజికవర్గాలకు సహజంగానే కంటగింపుగా మారుతుంది. ఏ సమాజంలోనూ ఒకే వర్గం నిరంతరం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటే మిగతా వర్గాలు సహించలేవు. ఇక్కడా అదే జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటుబ్యాంకుగా ఉన్న జాటేతర సామాజిక వర్గాలు క్రమంగా దూరమయ్యాయి. వారిలో ఇతర వెనుకబడిన వర్గాలు (OBC)లు కీలక పాత్ర పోషించారు. ఆ వర్గాల్లో గట్టి పట్టు సాధించిన బీజేపీ ఈ ఎన్నికల్లో గట్టెక్కి, హ్యాట్రిక్ విజయంతో రికార్డు సృష్టించింది.

Haryana Assembly Election Results 2024

పోనీ జాట్ వర్గం ఓటర్లంతా పూర్తిగా కాంగ్రెస్‌కు అండగా నిలిచారా అంటే ఫలితాల సరళిని చూస్తే అదీ జరగలేదని అర్థమవుతుంది. కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వంలో జాట్ వర్గం నేత భూపిందర్ సింగ్ హుడాకు దళిత వర్గం నేత కుమారి సెల్జాకు మధ్య విబేధాలు ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. కాంగ్రెస్ అధిష్టానం హుడాకు పూర్తి స్వేచ్ఛనివ్వడంతో రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాల్లో 70 సీట్లు తన వర్గంవారికే ఇచ్చుకున్నారు. ఇది కుమారి సెల్జాకే కాదు, జాట్ వర్గానికే చెందిన రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలాకు సైతం మింగుడుపడలేదు. కాంగ్రెస్ గెలుపొందితే ముఖ్యమంత్రి రేసులో హుడాతో పాటు సెల్జా, సూర్జేవాలా వంటి నేతల పేర్లు వినిపించడంతో ఈ ఇద్దరు నేతలను హుడా ఉద్దేశపూర్వకంగానే దూరం పెట్టారన్నది పార్టీలో అంతర్గత చర్చ. దీంతో ఈ నేతలిద్దరూ రాష్ట్రవ్యాప్త ప్రచారం జోలికి వెళ్లకుండా తమ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు.

సెల్జా అలక జాతీయ మీడియాలో విస్తృత చర్చకు కారణమైంది. సెల్జా పట్ల వ్యవహించిన తీరుతో దళితుల మనోభావాలు దెబ్బతిన్నాయి. సెల్జాను బుజ్జగించకపోతే దళిత ఓట్లు ప్రభావితమవుతాయని భావించిన కాంగ్రెస్ అధిష్టానం చివరకు ఆమెతో మాట్లాడి నచ్చజెప్పినట్టు తెలిసింది. పోలింగ్ తేదీకి కాస్త ముందు ఆమె మళ్లీ ప్రచారంలో కనిపించారు. ప్రచారం చివరి దశకు చేరుకున్న సమయంలో రాహుల్ గాంధీ నిర్వహించిన సభల్లో సెల్జాకు ప్రాధాన్యత కల్పించారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఓవైపు కాంగ్రెస్ అంటే హుడా, హుడా అంటే కాంగ్రెస్ అన్న రీతిలో భూపిందర్ సింగ్ హుడా వ్యవహరించడం కారణంగా కాంగ్రెస్ గెలిస్తే కచ్చితంగా ‘జాట్’ వర్గం నేత సీఎం అవుతారని దళితులు భావించారు. సెల్జా వంటి నేతలకే అవమానాలు ఎదురవగా.. గ్రామాల్లో ప్రతిరోజూ తాము జాట్ వర్గం నేతలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందారు. దీంతో కాంగ్రెస్‌కు ఓటేయాల్సిన దళిత ఓటుబ్యాంకులో కొంత చీలిక ఏర్పడింది. చివరి దశలో సెల్జాకు రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇవ్వడం జాట్ వర్గం ఓటర్లలో అనుమానాలు కల్గించింది. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే సామాజిక సమీకరణాల సాకు చెప్పి సీఎం పదవి తమకు దక్కకుండా సెల్జాకు ఇస్తారేమోనన్న అనుమానం వారిలో బలపడింది. దీంతో జాట్ ఓటర్లలో కొందరు కాంగ్రెస్‌కు దూరం జరిగినట్టు చర్చ జరుగుతోంది. ఇలా తాము ఆశించిన జాట్-దళిత కాంబినేషన్‌ బెడిసికొట్టినట్టయింది.

Haryana Assembly Election Results 2024

ఫ్రాంచైజీ వ్యవస్థకు స్వస్తి చెప్పాలి

గత ఏడాది జరిగిన చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, తాజాగా హర్యానా ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీలో ‘ఫ్రాంఛైజీ వ్యవస్థ’పై చర్చనీయాంశమైంది. సాధారణంగా ప్రాంఛైజీ అంటే ఒక ఫేమస్ పాపులర్ బ్రాండ్ వ్యాపార సంస్థ.. తమ బ్రాండ్ పేరుతో వ్యాపారాలను నిర్వహించుకోడానికి ఇతరులకు అవకాశం కల్పించడాన్నే ఫ్రాంచైజీగా వ్యవహరిస్తూ ఉంటాం. అయితే కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని రాజకీయాల్లో అమలు చేసిందని ఆ పార్టీ నేతలే విమర్శిస్తూ ఉంటారు. మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌, రాజస్థాన్‌లో అశోక్‌ గెహ్లాట్‌, ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌ బాఘేల్‌ తర్వాత హర్యానాలో భూపీందర్‌ హుడాకు ఏకపక్షంగా అధికారం కట్టబెట్టారన్నది వారి ఆరోపణ. ఈ రాష్ట్రాల్లో ఓటమికి ఫ్రాంచైజీ వ్యవస్థే కారణమని సూత్రీకరిస్తున్నారు.

హిమాచల్‌, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇలా జరగలేదని, అందుకే అక్కడ ప్రభుత్వాలను ఏర్పాటు చేయగలిగామని విశ్లేసిస్తున్నారు. హుడా మొత్తం తన వర్గానికి చెందిన 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లు ఇవ్వగా, సెల్జా వర్గంలోని నలుగురు సిట్టింగ్‌లకు కూడా టిక్కెట్లు లభించాయి. మొత్తం 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలలో 16 మంది ఓడిపోయారు. హుడా మద్దతుదారుడైన దళిత రాష్ట్ర అధ్యక్షుడు ఉదయ భాన్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారు. ఇదిలా ఉంటే.. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో పొత్తు పెట్టుకుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుందని అధిష్టానం భావిస్తే.. హుడా ససేమిరా ఒప్పుకోలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్క సీటు గెలవలేకపోయినా.. రాష్ట్రవ్యాప్తంగా 1.8% ఓట్లు సాధించింది. కొన్ని నియోజకవర్గాల్లో కేవలం 100 లోపు ఓట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది.

ఫలించిన కమలనాథుల గోవా వ్యూహం

రెండు కంటే ఎక్కువ పార్టీలు, అభ్యర్థులు బరిలో నిలిచిన ఏ ఎన్నికల్లోనైనా గెలవాలంటే కచ్చితంగా 50% మించి ఓట్లు సాధించాల్సిన అవసరం లేదు. హర్యానాలో 2014లో బీజేపీ 33% ఓట్లు మాత్రమే పొందింది. వాటితోనే 47 సీట్లను గెలుపొంది సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ 67% ఓట్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ.. అవన్నీ ఒకే పార్టీకి చేరకుండా వేర్వేరు పార్టీల మధ్య చీలిపోయాయి. 2019లో బీజేపీ తన ఓట్లను 36 శాతానికి పెంచుకుంది. కానీ ఈసారి సీట్ల సంఖ్య తగ్గి 40కే పరిమితం కావాల్సి వచ్చింది. తాజా ఎన్నికల్లో బీజేపీ అటూఇటుగా 40% ఓట్లను సాధించింది. అయినప్పటికీ మిగతా 60 శాతం ఓటర్లు బీజేపికి వ్యతిరేకంగా ఉన్నారనే అర్థం. అయితే బీజేపీ ప్రతి ఐదేళ్లకు తన మద్దతు పెంచుకుంటుందని కూడా ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఎన్నికల్లో గెలవాలంటే తమను వ్యతిరేకించే ఓట్లు చీలిపోవాలి అన్నది కూడా ఒక వ్యూహంగా మారిపోయింది. గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఇదే వ్యూహాన్ని అమలు చేసి విజయం సాధించింది.

హర్యానాలో తమకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్‌తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(INLD), జన్‌నాయక్ జనతా పార్టీ (JJP), బహుజన్ సమాజ్ పార్టీ (BJP), ఆజాద్ సమాజ్ పార్టీ (ASP)లు పోటీ చేశాయి. అలాగే కొన్నిచోట్ల బలమైన నేతలు స్వతంత్రులుగా పోటీ చేశారు. వారిలో కాంగ్రెస్‌లో టికెట్ ఆశించి దక్కించుకోలేకపోయినవారున్నారు. బీజేపీ సాధించిన 40% ఓట్లు పోగా మిగతా 60 శాతంలో కాంగ్రెస్‌ను 39.09%కు పరిమితం చేసి మిగిలిన ఓట్లు తలా కొంత పంచుకున్నారు. వారిలో స్వతంత్రుల వాటాయే 10 శాతం కంటే ఎక్కువ ఉందంటే ఏ స్థాయిలో వ్యతిరేక ఓటు చీలిందో అర్థం చేసుకోవచ్చు. మొత్తానికి కాంగ్రెస్ స్వయంకృతాపరాథాలకు బీజేపీ గెలుపు వ్యూహాలు తోడయ్యాయి. కాంగ్రెస్‌కు మరోసారి ఆత్మపరిశీలన చేసుకునే ఫలితాలనిచ్చాయి.

మరిన్ని ప్రీమియం కథనాల కోసం.. TV9 News యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి