
దేశవ్యాప్తంగా రాజకీయనేతల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ ఇండోర్‌లో బీజేపీ ఎమ్మెల్యే బ్యాట్‌తో ఓ అధికారిపై దాడిచేయడం సంచలనం రేపింది. తాజాగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు ఓ ఇంజనీర్‌పై దాడికి ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
వివరాల్లోకి వెళితే కంకావళి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే నితేష్ నారాయణ్ రాణె తన అనుచరగణంతో కలిసి ముంబై హైవే రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. అయితే ఈ పనుల్లో నాణ్యత లేదని ఆరోపిస్తూ బకెట్‌లో నింపిన బురదను రోడ్డు పనులను చేయిస్తున్న ఇంజనీర్ ప్రకాశ్ షడేకర్‌పై పోశాడు. దీంతో పాటు ఎమ్మెల్యే అనుచరులు ఇంజనీర్‌పై దాడికి కూడా యత్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి ఘటన స్ధానికంగా సంచలనం రేపింది. మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.