
కర్ణాటక రాజకీయాల్లో చోటుచేసుకున్న తాజా పరిణామాలు స్టాక్ మార్కెట్‌పై ఊహించని ప్రభావాన్ని చూపించాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామా వార్తల నేపథ్యంలో ప్రముఖ కాఫీ చైన్ సంస్థ కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ షేర్లు ఏకంగా 20 శాతం వరకు ఎగసిపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. సిద్ధరామయ్య పదవి నుంచి తప్పుకోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా కొత్త సమీకరణాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాల నేపథ్యంలో ఆయన రాజీనామా చేసినట్లు వార్తలు రావడంతో.. తదుపరి ముఖ్యమంత్రిగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరు బలంగా వినిపిస్తోంది. ఈ వార్త వ్యాపార వర్గాల్లో ప్రత్యేక ఆసక్తిని రేకెత్తించింది. దీనికి ప్రధాన కారణం కాఫీ డే వ్యవస్థాపకుడు దివంగత వీజీ సిద్ధార్థ కుటుంబంతో ఆయనకు ఉన్న సన్నిహిత సంబంధాలే. వీజీ సిద్ధార్థ కుమారుడు అమర్త్య హెగ్డేకు డీకే శివకుమార్ తన కుమార్తె ఐశ్వర్యను వివాహం చేయడం తెలిసిందే.
ఈ నేపథ్యంతో.. డీకే శివకుమార్ సీఎం అయితే కాఫీ డే సంస్థకు మళ్లీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందని మదుపరులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రారంభమైన వెంటనే పెట్టుబడిదారులు భారీగా షేర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా కంపెనీ షేర్లు ఒక్కసారిగా 20 శాతం వరకు లాభపడి అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. ఒక రాజకీయ పరిణామం ప్రభావంతో ఒక కంపెనీ షేర్లు ఇంత వేగంగా పుంజుకోవడం మార్కెట్ వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. గత కొంతకాలంగా కాఫీ డే సంస్థ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వీజీ సిద్ధార్థ మరణానంతరం సంస్థ కార్యకలాపాలు కొంత మందగించాయి.
అయితే ఇప్పుడు ఆ కుటుంబానికి అత్యంత దగ్గర వ్యక్తిగా భావించే డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు కనిపించడం కంపెనీకి నైతికంగా, వ్యాపారపరంగా బలం చేకూరుస్తుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ విధానాలు కూడా వ్యాపారాలకు అనుకూలంగా ఉండొచ్చన్న అభిప్రాయం మార్కెట్లో వినిపిస్తోంది. ముఖ్యంగా పర్యాటక, రిటైల్, హాస్పిటాలిటీ రంగాలకు కొత్త ప్రభుత్వం ప్రోత్సాహక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో కాఫీ డే వంటి రిటైల్ బ్రాండ్‌లకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలిగే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు.
రాజకీయాలు, వ్యాపార రంగాల మధ్య ఉన్న అనుబంధానికి ఈ పరిణామం తాజా ఉదాహరణగా మారింది. డీకే శివకుమార్ అధికారికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడితే కాఫీ డే షేర్లలో మరింత కదలిక కనిపించే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.