Abujhmad Encounter: నెత్తురోడిన అబూజ్‌మఢ్‌ మహారణ్యం.. తుడుచు పెట్టుకుపోయిన మావోయిస్టుల కోట!

|

Oct 05, 2024 | 7:25 PM

ఖాకీలు దూరలేని కారడవి. CRPF చేరుకోలేని చిట్టడవి. మావోయిస్టులకు పెట్టని కోట. అదే బస్తర్ దండకారణ్యం. అందులో ఎంత వెతికినా.. అంతుచిక్కని అబూజ్‌మఢ్‌ మహారణ్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్‌.

Abujhmad Encounter: నెత్తురోడిన అబూజ్‌మఢ్‌ మహారణ్యం.. తుడుచు పెట్టుకుపోయిన మావోయిస్టుల కోట!
Abujhmad Encounter
Follow us on

ఖాకీలు దూరలేని కారడవి. CRPF చేరుకోలేని చిట్టడవి. మావోయిస్టులకు పెట్టని కోట. అదే బస్తర్ దండకారణ్యం. అందులో ఎంత వెతికినా.. అంతుచిక్కని అబూజ్‌మఢ్‌ మహారణ్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్‌. ఒకప్పుడు అక్కడ వాళ్లదే రాజ్యం. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఎర్రకోటలో ఖాకీ తుపాకులు గర్జిస్తున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో అబూజ్‌మఢ్‌ నెత్తురోడుతోంది. బస్తర్‌ మే సవాల్‌ అంటూ మావోయిస్టులను వాళ్ల అడ్డాలోనే చాలెంజ్‌ చేసే స్థాయికి బలగాలు ఎలా వచ్చాయి? ఆయువుపట్టులోనే మావోయిస్టులను కోలుకోలేని దెబ్బ ఎలా తీయగలుతున్నారు?

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ డివిజన్‌లో నక్సలైట్లపై సైనికుల యాంటీ నక్సల్ ఆపరేషన్ నిరంతరం కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా శుక్రవారం(అక్టోబర్ 4) నారాయణపూర్, బీజాపూర్ పోలీసులు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్‌లో భారీ విజయం సాధించారు. నక్సలైట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 37 మంది నక్సలైట్లను సైనికులు హతమార్చారు. దేశ చరిత్రలో రెండో అతి పెద్ద ఎన్‌కౌంటర్‌ ఇది. ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్‌ మఢ్‌ అడవులను మరోసారి ఎరుపెక్కించింది. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్‌లో 37 మంది మావోయిస్టులు హతమయ్యారు.

ఘటనా స్థలం నుంచి ఏకే-47, ఎస్‌ఎల్‌ఆర్‌ వంటి ఆటోమేటిక్‌ ఆయుధాలు, పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను కూడా సైనికులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో భద్రతా సిబ్బంది ఎవరూ మరణించినట్లు సమాచారం లేదు. పెద్ద సంఖ్యలో నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం అందడంతో స్థానిక పోలీసు బలగాలు, డిఆర్‌జి, పారామిలటరీ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి నక్సలైట్ల స్థావరంపై దాడి చేసి 30 మంది నక్సలైట్లను హతమార్చినట్లు చెబుతున్నారు. మరణించిన నక్సలైట్ల మృతదేహాలతో శనివారం నారాయణపూర్ ప్రధాన కార్యాలయానికి సైనికులు చేర్చారు. దండకారణ్యంలో గత గత 9 నెలల్లో బస్తర్‌లో 556 మంది నక్సలైట్లు లొంగిపోయారు. 165 మంది నక్సలైట్లు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారు. 663 మంది నక్సలైట్లను పోలీసులు అరెస్టు చేశారు.

దంతెవాడ, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దుల్లో.. దట్టమైన అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్‌ వాంటెడ్‌ నక్సలైట్‌ కమాండర్లు కమలేశ్‌ ఆలియాస్‌ ఆర్కే, నీతి అలియాస్‌ ఉర్మిల మృతి చెందినట్లు సమాచారం. దండకారణ్య స్పెషల్ జోనల్‌ కమిటీ సభ్యుడు కమలేశ్‌ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్‌ వాటెండ్‌గా ఉన్నాడు. ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు. నీతి అలియాస్‌ ఉర్మిల బీజాపూర్‌ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. కమలేశ్‌ ఏపీలోని విజయవాడ ప్రాంతానికి చెందినవాడని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రేంజ్‌లో ఉన్న నారాయణ్‌పూర్‌- దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో శుక్రవారం మధ్యాహ్నం ఎన్‌కౌంటర్‌ ప్రారంభం అయింది. అబూజ్‌మడ్‌ దండకారణ్యంలో మావోయిస్టులు ఉన్నారని.. వారిలో కొందరు అగ్రనేతలు కూడా ఉన్నారనే సమాచారం భద్రతా బలగాలకు అందడంతో ఆ ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్‌ చేపట్టారు.

అసలు ఈ ఆపరేషన్‌ ఎలా జరిగింది..?

నారాయణ్‌పూర్‌-దంతెవాడ జిల్లా సరిహద్దుల్లో నక్సల్‌ క్యాంప్‌ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ క్యాంప్‌లో దాదాపు 50మంది మావోయిస్టులు ఉన్నట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం పోలీసులకు అందింది. దీంతో 4 రోజులు ముందుగా ఆపరేషన్‌ ప్లాన్‌ చేశారు భద్రతా దళాలు. దట్టమైన అడవిలో 25 కిలోమీటర్ల పాటు ట్రెక్కింగ్‌, అనంతరం ఒక్కసారిగా DRG, STF, పోలీసుల ముప్పేట దాడి చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు భీకర కాల్పులతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ఎన్‌కౌంటర్‌‌లో బస్తర్‌ డివిజనల్‌ కమిటీ తుడిచిపెట్టుకుపోయింది. PLGA కంపెనీకి చెందిన ఆరుగురు కీలక సభ్యులు కూడా హతమైన్నట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. నాలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దండకారణ్యంలో పోలీసుల కూంబింగ్‌ ఇంకా జరుగుతోంది. చనిపోయిన మావొయిస్టులను గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. ఇప్పటివరకు 31మందిని గుర్తించారు. అయితే మిగిలిన వారి పేర్లు ఫొటోలు కూడా విడుదల చేయాలంటున్నారు ఏపీ పౌరహక్కుల సంఘం నేతలు. వారిలో నంబాల కేశవరావు, తక్కెళ్లపల్లి వాసుదేవరావు ఉండే ఉంటారని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..