Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

జంక్ ఫుడ్స్ ప్రకటనలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ మేరకు...

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Central Government

Edited By: Anil kumar poka

Updated on: Mar 10, 2022 | 11:20 AM

తల్లిదండ్రులకు అలెర్ట్.. పిల్లల్లో పెరుగుతోన్న ఊబకాయాన్ని నియంత్రించేందుకు కేంద్రం పక్కా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. పిల్లలను టార్గెట్ చేస్తూ.. వారిని తప్పుదోవ పట్టిస్తోన్న జంక్ ఫుడ్స్ ప్రకటనలపై నిషేధం విధించాలన్న ప్రతిపాదనను వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోంది. ఈ మేరకు ఆ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ(డబ్ల్యూసీడీ) పిల్లలను లక్ష్యంగా చేసుకున్న జంక్ ఫుడ్స్ ప్రకటనలపై తమకు పలు కీలక సూచనలు ఇచ్చిందని ఆయన తెలిపారు. పిల్లల కార్యక్రమాలు ప్రసారమయ్యే సమయంలో జంక్ ఫుడ్స్ ప్రకటనలను నిలిపి వేయడం, సరైన ఆరోగ్య కథనాలను ప్రచారం చేయడం, జంక్ ఫుడ్స్ పోషక వాస్తవాలను పేర్కొనేలా ప్రకటనలను టెలికాస్ట్ చేయడం వంటి సలహాలను డబ్ల్యూసీడీ మంత్రిత్వ శాఖ ఇచ్చిందన్నారు. అంతేకాకుండా.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నుంచి అందిన డేటాను ప్రస్తావిస్తూ.. దేశంలోని చిన్నారుల్లో పెరుగుతున్న ఊబకాయం ఇందుకు నిదర్శనమని మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పేర్కొన్నట్లు ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్యాకేజింగ్ ఆహార ఉత్పత్తులపై పోషకాహార అంశాల వివరాలకు సంబంధించి పలు నిబంధనలలో మార్పులు చేసిందని అధికారి అన్నారు. వినియోగదారుల రక్షణ చట్టం 2019 ప్రకారం రూపొందించిన మార్గదర్శకాలు ఈ నెలాఖరులోగా విడుదలయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు.

మరోవైపు.. 2021-22 వార్షిక నివేదికలో నీతి అయోగ్.. భారతదేశంలో పెరుగుతున్న స్థూలకాయాన్ని నియంత్రించవచ్చునని పేర్కొంది. చక్కెర, కొవ్వు, ఉప్పు అధికంగా ఉండే ప్యాకేజింగ్ ఆహార పదార్ధాలపై పన్ను విధించే ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది. నాన్-బ్రాండెడ్ నామ్‌కీన్, భుజియా, వెజిటబుల్ చిప్స్, స్నాక్స్‌పై 5 శాతం జీఎస్టీ, బ్రాండెడ్, ప్యాకేజింగ్ ఉత్పత్తులకు 12 శాతం జీఎస్టీ పన్ను విధించవచ్చునని సూచించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే(NFHS-5) 2019-20 ప్రకారం, ఊబకాయం ఉన్న మహిళల సంఖ్య 2015-16లో 20.6 శాతం నుంచి 24 శాతానికి పెరగగా.. పురుషుల విషయంలో ఈ సంఖ్య 18.4 శాతం నుంచి 22.9 శాతానికి పెరిగిందని నీతి అయోగ్ పేర్కొంది. కాగా, ‘జంక్ ఫుడ్’ నియంత్రణ కోసం, ప్యాకేజింగ్ ఉత్పత్తులలో పోషకాహార సమాచారాన్ని ఇకపై ప్యాకెట్ వెనుక భాగంలో కాకుండా, వినియోగదారులకు సులభంగా కనిపించేలా ముందు వైపు లేబుల్ చేసేలా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పలు రూల్స్‌లు అమలులోకి తీసుకురానున్నట్లు సమాచారం.