BRICS Summit 2026: బ్రిక్స్‌ భోజనంలో వెజ్‌ వివాదం..ప్లేట్‌ నుంచి పాలిటిక్స్‌ దాకా..!

బ్రిక్స్‌ సదస్సులో ప్రపంచ అగ్రనేతల కోసం భారత్‌ ఏర్పాటు చేసిన విందు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధుల కోసం మిల్లెట్స్‌, పప్పులు, పనీర్‌, సంప్రదాయ కూరలు, స్వీట్లతో పూర్తిగా వెజిటేరియన్‌ మెనూను వడ్డించారు. అయితే విందులో నాన్‌వెజ్‌ వంటకాలు లేకపోవడమే ఆసక్తికర చర్చకు కారణమైంది. ఇది రాజకీయ చర్చకు దారితీసింది.

BRICS Summit 2026: బ్రిక్స్‌ భోజనంలో వెజ్‌ వివాదం..ప్లేట్‌ నుంచి పాలిటిక్స్‌ దాకా..!
BRICS Summit 2026

Edited By:

Updated on: Sep 15, 2026 | 6:04 PM

ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారు పెద్దలు. కానీ బ్రిక్స్‌ సదస్సు విషయంలో రచ్చ మాత్రం భోజనంతోనే మొదలైంది. అంతర్జాతీయ వేదికపై భారత్‌ ఇచ్చిన విందులో పూర్తిగా వెజిటేరియన్‌ మెనూ పెట్టడం ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసింది. ప్రపంచ దేశాల నేతలు, ప్రతినిధులకు భారతీయ వంటకాలతో ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. మిల్లెట్స్‌, పప్పులు, పనీర్‌, రకరకాల కూరలు, సంప్రదాయ స్వీట్లను మెనూలో పెట్టారు. అయితే నాన్‌వెజ్‌ లేకపోవడమే ఇప్పుడు అసలు చర్చగా మారింది.

అసలు వివాదం ఏంటి?

భారత్‌ అంటే వెజిటేరియన్‌ ఆహారమే కాదని, దేశంలో కోట్లాది మంది నాన్‌వెజ్‌ కూడా తింటారని చర్చ మొదలైంది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆహారపు అలవాట్లు ఉంటాయి. కొందరికి వెజ్‌ ఇష్టం అయితే.. మరికొందరికి నాన్‌వెజ్‌ ఇష్టం. ఇది మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్న వైవిధ్యం. అలాంటప్పుడు అంతర్జాతీయ అతిథులకు ఇచ్చే విందులో వెజ్‌ మెనూనే ఎందుకు పెట్టారన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. రాహుల్ గాంధీ కూడా బ్రిక్స్ సదస్సులో కేవలం వెజ్ వంటకాలను వడ్డించడంపై పెదవి విరవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

మరోవైపు భారతీయ శాకాహార వంటకాలకు ఎంతో గొప్ప సంప్రదాయం ఉంది. వాటిని ప్రపంచానికి పరిచయం చేయడంలో తప్పేముందని మరో వాదన వినిపిస్తోంది. మిల్లెట్స్‌, పప్పులు, కూరగాయలతో ఆరోగ్యకరమైన, పర్యావరణహిత ఆహారాన్ని అందించాలన్న ఆలోచన కూడా ఉండొచ్చన్న అభిప్రాయం ఉంది.

వివాదంలోకి ఓవైసీ

ఇదే సమయంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ ఈ అంశంపై స్పందించారు. భారత్‌లో అందరి ఆహారపు అలవాట్లు ఒకేలా ఉండవని గుర్తుచేశారు. ప్రాంతాలు, మతాలు, వర్గాలను బట్టి ఆహారపు సంస్కృతులు మారుతాయని చెప్పారు. మైనారిటీల్లోనూ వెజిటేరియన్‌ ఆహారం తీసుకునేవారు ఉన్నారని ప్రస్తావించారు. అంటే.. ఊరంతా ఒక దారి.. ఉలిపికట్టెది ఒక దారి అన్న చందంగా ప్రతి ఒక్కరి ఆహారపు అలవాటు ఒకేలా ఉండదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

భోజనం నుంచి రాజకీయాల వరకు

నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో అసలు ప్రశ్న వెజ్‌ పెట్టారా, నాన్‌వెజ్‌ పెట్టారా అనేది మాత్రమే కాదు. అంతర్జాతీయ వేదికపై భారత్‌ తన సంస్కృతిని ఎలా చూపించాలన్నదే అసలు విషయం. భారతీయ శాకాహార వంటకాలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. అదే సమయంలో నాన్‌వెజ్‌ కూడా అనేక ప్రాంతాలు, సమాజాల జీవన విధానంలో భాగమే. కాబట్టి భారత్‌ అంటే ఒక్క రకమైన ఆహార సంస్కృతి కాదు. ఎన్నో రకాల రుచులు, ఎన్నో సంప్రదాయాలు కలిసిన దేశం. బ్రిక్స్‌ విందును ఈ కోణంలో చూస్తే ఇది ఒక రకమైన ఫుడ్‌ డిప్లమసీ కూడా. ప్రపంచ దేశాల అతిథులకు మన వంటకాలను పరిచయం చేయడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చూపించే అవకాశం దక్కింది.

పళ్లెంలోనే భారత వైవిధ్యం

మన దేశంలో భాషలు వేరు. ఆచారాలు వేరు. పండుగలు వేరు. అలాగే తిండి అలవాట్లు కూడా వేరు. ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు, తూర్పు నుంచి పడమర వరకు ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన వంటకాలు ఉన్నాయి. అందుకే తినే నోరు ఒకటే.రుచులు మాత్రం వేరు” అన్న తీరులో ఎవరి ఆహార అలవాటు వారిది. దాన్ని గౌరవించడమే అసలు వైవిధ్యం. బ్రిక్స్‌ విందులో వెజిటేరియన్‌ మెనూ పెట్టడం ఒక నిర్ణయం కావచ్చు. కానీ దానిని రాజకీయ అంశంగా మార్చాలా? లేక భారతీయ వంటకాల గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన సందర్భంగా చూడాలా? అన్నది ఇప్పుడు చర్చ.

చివరికి బ్రిక్స్‌ టేబుల్‌పై వడ్డించిన భోజనం. రాజకీయ టేబుల్‌పైకి చేరింది. వెజ్‌ మెనూతో మొదలైన చర్చ. భారత ఆహార వైవిధ్యం, సంస్కృతి, రాజకీయాల వరకు వెళ్లింది.

-కొండవీటి శివనాగరాజు, డిప్యూటీ అవుట్‌పుట్ ఎడిటర్, టీవీ9

Loading...
Unable to load recommendations.
Follow Us