TN Politics: తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ.. విజయ్ పార్టీ ఎటువైపు?

| Edited By: Janardhan Veluru

Dec 23, 2024 | 7:10 PM

లోక్‌సభ ఎన్నికల్లో మూడో కూటమిగా వెళ్లి ఘోర పరాభవాన్నిమూటగట్టుకుంది బీజేపీ. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకేను గద్దె దించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తోంది. దీనికి సంబంధించిన వ్యూహాల్లో అన్నామలై తలమునకలై ఉన్నారు. డీఎంకే వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేయడం ద్వారా తాను అనుకున్నది సాధించే వ్యూహాలను బీజేపీ నేతలు పదునుపెడుతున్నారు.

TN Politics: తమిళనాడులో రాజకీయ వ్యూహం మార్చిన బీజేపీ.. విజయ్ పార్టీ ఎటువైపు?
Tamil Nadu BJP President K Annamalai
Follow us on

మనం శత్రువుని నేరుగా ఢీ కొట్ట లేనప్పుడు.. శత్రువు శత్రువుతో కలిసి అనుకున్నది సాధించాలి.. అది కుదరకపోతే తెర వెనక ఉండి ప్రధాన శత్రువుని పడగొట్టాలి అంటే అందుకు సరైన వ్యూహం అనుసరించాలి.. తమిళనాడులో ప్రస్తుతం బిజెపి ఇదే వ్యూహంతో ముందుకు వెళుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో పరాభవంతో నేర్చిన గుణపాఠాలతో.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే పక్కా వ్యూహాలతో ముందుకు వెళుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే, ఏడీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తృతీయ కూటమిగా బరిలో నిలిచిన బీజేపీ.. అనుకున్న ఫలితాలను రాబట్టలేక చతికిలబడింది.

తమిళనాడులో కొన్ని దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలే అధికారాన్ని చేజిక్కించుకుంటున్నాయి. అందులోనూ డీఎంకే, ఏడీఎంకే ఈ రెండు ప్రధాన పార్టీలుగా కూటమిలుగా ఏర్పడి దశాబ్దాలుగా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రెండు పార్టీలను కాదని మిగిలిన పార్టీలు కొన్ని కూటమిగా ఏర్పాటై అధికారాన్ని పొందాలని చూసినా అది సాధ్యపడలేదు. తమిళనాడులో అన్నాడీఎంకే బిజెపి ‘బి’ టీమ్ గా ఉందనేది పెద్ద చర్చ.. 2016-2021 మధ్య ఎడిఎంకే అధికారంలో ఉన్న ఐదేళ్లు బిజెపికి పూర్తి మద్దతుగా నిలిచింది. తమిళనాడులో ద్రవిడ పార్టీలను కాదని జాతీయ పార్టీలను ఆదరించిన పరిస్థితి గత నాలుగు దశాబ్ధాల కాలంలో ఎన్నడూ లేదు. ఐదేళ్లపాటు బీజేపీకి దగ్గరగా ఉందన్న కారణంగా ఏడిఎంకేకి పెద్ద నష్టమే జరిగింది.

లోక్‌సభ ఎన్నికల్లో అన్నా టీఎంకేకి బిజెపి దూరంగా జరిగి తృతీయ కూటమి ఏర్పాటుచేసినా ఏమాత్రం ఫలితం తగ్గలేదు. ఇటీవల నటుడు విజయ్ సొంత రాజకీయ పార్టీ(TVK)ని ఏర్పాటు చేసిన తర్వాత తమిళనాడులో రాజకీయ ముఖచిత్రం కొద్దికొద్దిగా మారుతోంది. విజయ్ పార్టీ విధానాలను ప్రకటించే క్రమంలో తమిళనాడులో ఇప్పటివరకు ప్రధాన రాజకీయ పార్టీలు మిత్రపక్షాలకు అధికార భాగస్వామి కల్పించలేదని తాము అధికారంలోకి వస్తే దాన్ని నెరవేరుస్తామని ప్రకటించడంతో రాజకీయంగా చర్చ మొదలైంది. అటు ప్రస్తుతం డీఎంకే కూటమిలో ఉన్న తిరుమావళవన్ సారధ్యంలోని విడుదలై చిరుత్తై కట్చి (VCK) విజయ్ ప్రస్తావించిన అంశంపై ఆశగా ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే మరికొన్ని రాజకీయ పార్టీలు విజేయ్ తో కలిసి నడిస్తే ఒకవేళ అధికారంలోకి వస్తే తమకు కూడా అధికార భాగస్వామ్యం ఉంటుందన్న అభిప్రాయంలో ఉన్నాయి. ఇక్కడే బిజెపి తన వ్యూహానికి పదును పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేని ఓడించడమే లక్ష్యంగా పొత్తులు ఉంటాయని ఆ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు కే. అన్నామలై ప్రకటించారు.

ప్రస్తుతం డీఎంకేలో భాగస్వామిగా ఉన్న వీసీకే కార్యకర్తలు అధికారంలో తమ పార్టీ భాగస్వామ్యం కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు. డీఎంకే ప్రభుత్వంలో వీసీకేకి కూడా ప్రతినిథ్యంకల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అధికారంలో తమకు భాగస్వామ్యం కల్పించాలని వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా కోరినా ఫలితం లేకపోయింది. డీఎంకే మాత్రం ఈ డిమాండ్‌ను పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇటీవల వరకు డీఎంకే తీరును ఎండగడుతూ వచ్చిన వీసీకే కీలక నేత ఆదవ్ ఆర్జున.. ఆ పార్టీని వీడారు. ఆయన విజయ్‌కి సన్నిహితుడని.. త్వరలోనే ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం కూడా ఉంది. డీఎంకేలా కాకుండా అధికారంలో ఇతర పార్టీలకు భాగస్వామ్యం కల్పించే విషయంలో ఏడీఎంకే సానుకూలంగా ఉంది. అందుకే చిన్నాచితక పార్టీలు ఆ పార్టీ వైపు చూస్తున్నాయి.

ప్రధాన ప్రతిపక్షమైన ఏడీఎంకే గురించి విజయ్ పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. దీంతో విజయ్ ఈసారి ఏడీటీఎంకేతో పొత్తు పెట్టుకోవడం దాదాపు ఖాయం అయిందన్న సంకేతాలు కూడా ఉన్నాయి. అలాగే ఏడిఎంకే పార్టీకి దూరమైన దివంగత జయలలిత సన్నిహితురాలు శశికళ , శశికళ మేనల్లుడు దినకరన్, మరో బహిష్కృత నేత మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం.. వీరందరిని మళ్లీ ఏడీటీఎంకు దగ్గర చేసేలా ప్రయత్నాలు ప్రచారం జరుగుతోంది. దీని వెనక బిజెపి ఉన్నట్టు తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. నటుడు విజయ్ పార్టీ.. ఏడీఎంకేతో పాటు ఆ పార్టీకి దూరమైన ఈ ముగ్గురు నేతలు కలిస్తే డిఎంకేని కచ్చితంగా ఢీకొట్టడం సాధ్యపడుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. ఈ దిశగా తెర వెనుక కమలనాథుల మంత్రాంగం నడుపుతున్నట్టు పొలిటికల్ సర్కిల్లో డిస్కషన్ జరుగుతోంది. బిజెపి నేరుగా డీఎంకేను ఢీకొట్టగలిగే పరిస్థితి లేనందున.. మూడో కూటమిగా వెళ్తే డీఎంకేకే మేలు జరుగుతుందని కమలనాథులు భావిస్తున్నారు. అందుకే డీఎంకేను కొట్టేందుకు బలమైన ప్రతిపక్ష కూటమికి సహకరించడం ద్వారా తాము అనుకున్నది సాధించొచ్చని కమలనాధులు భావిస్తున్నారు.