Assam Floods: అసోంను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. అస్తవ్యస్తంగా జనజీవనం..

|

May 15, 2022 | 10:00 AM

హఫ్లాంగ్ ప్రాంతంలో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయయని.. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పేర్కొంది.

Assam Floods: అసోంను ముంచెత్తిన భారీ వర్షాలు.. కొండచరియలు విరిగిపడి ముగ్గురు మృతి.. అస్తవ్యస్తంగా జనజీవనం..
Assam Floods
Follow us on

Assam Floods: అసోంలో కురుస్తున్న ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాకాలం ప్రారంభం కాకముందే సంభవించిన వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నిన్న డిమా హసావో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. జిల్లాలోని 12 గ్రామాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. హఫ్లాంగ్ ప్రాంతంలో దాదాపు 80 ఇళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయయని.. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారని అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ పేర్కొంది. ఇప్పటివరకు ఆరు జిల్లాల్లో కనీసం 24,681 మంది ప్రభావితమైనట్లు పేర్కొంది. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ (ASDMA) విడుదల చేసిన అధికారిక బులెటిన్ ప్రకారం.. మరణించిన వారిలో ఇద్దరు పురుషులు, మహిళ ఉన్నారు.

రాజధాని గౌహతీతోపాటు బరాక్‌ వ్యాలీలో వర్షాల కారణంగా భారీ నష్టం జరిగింది. గౌహతిలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. కాల్‌ఘర్హా ప్రాంతంలో రోడ్లన్నీ కొట్టుకుపోయాయి. రైల్వే స్టేషన్లు నీట మునిగాయి. భారీవర్షాల కారణంగా రైళ్ల రాకపోకలను అధికారులు రద్దు చేశారు. ఎగువ అరుణాచల్‌ప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో అసోం లోని డ్యాంలకు భారీగా వరద నీరు చేరుతోంది. కలైన్‌చర్ర ప్రాంతంలో 150 ఏళ్ల నాటి వంతెన కొట్టుకుపోయింది.

అసోంలో వరదల పరిస్థితిపై కేంద్రం సమీక్షించింది. రాష్ట్రానికి తక్షణసాయంగా 125 కోట్లను విడుదల చేశారు. వరద పరిస్థితిపై సీఎం హేమంత్‌ బిశ్వా శర్మ సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా అసోం-మేఘాలయా జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బరాక్‌ లోయలో చాలా చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిల్చార్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. రోడ్లపై చెట్లు కుప్పకూలాయి.

బరాక్‌ నది ప్రమాదస్థాయి దాటిని ప్రవహించడంతో అధికారులు హైఅలర్ట్‌ ప్రకటించారు. మరో రెండు రోజుల పాటు అసోంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మే 17 వరకు పాలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురుస్తుందని తెలిపింది. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాల కారణంగా ఇళ్లు , ఆస్తులు కోల్పోయిన వాళ్లను తప్పకుండా ఆదుకుంటామని సీఎం హిమంత బిశ్వా శర్మ హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read:

KTR: మరో టూరిస్టు వచ్చారు.. తిన్నారు.. వెళ్లారు.. అమిత్ షా పర్యటనపై మంత్రి కేటీఆర్‌ విమర్శలు

Congress Chintan Shivir: చింతన్ శిబిర్‌లో కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రాహుల్ పాదయాత్రకు ప్లాన్..