
ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది గేమింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న వీడియో గేమ్ ‘గ్రాండ్ తెఫ్ట్ ఆటో VI’ (GTA 6) విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికరమైన పోలికతో అందరి దృష్టిని ఆకర్షించారు. GTA 5 విడుదలైన 2013 నుంచి GTA 6 విడుదలవుతున్న 2026 వరకు భారతదేశంలో చోటుచేసుకున్న మార్పులను వివరిస్తూ ప్రత్యేక గ్రాఫిక్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. గతంతో పోలిస్తే భారత్ ఇప్పుడు పూర్తిగా కొత్త దశలోకి ప్రవేశించిందని చెబుతూ.. “భారత్ సరికొత్త ఆట ఆడుతోంది!” (India is playing a whole new game!) అంటూ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.
GTA 5 నుంచి GTA 6 వరకు.. భారత్‌లో మార్పుల ప్రయాణం!
రాక్‌స్టార్ గేమ్స్ రూపొందించిన GTA 5 సెప్టెంబర్ 17, 2013న విడుదలైంది. అప్పటికి దేశంలో మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఆ తర్వాత 2014 మే 26న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు 13 ఏళ్లకు పైగా విరామం తర్వాత GTA 6 విడుదలవుతున్న నేపథ్యంలో, ఈ రెండు గేమ్స్ మధ్య ఉన్న సమయాన్ని భారతదేశ అభివృద్ధితో ముడిపెడుతూ ప్రధాని ప్రత్యేక ఇన్ఫోగ్రాఫిక్స్‌ను షేర్ చేశారు.
ఆర్థిక వ్యవస్థలో భారీ మార్పు!
ప్రధాని మోదీ పంచుకున్న గ్రాఫిక్స్‌లో ప్రధానంగా తొమ్మిది రంగాలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. ఒకప్పుడు ప్రపంచంలోని ‘ఫ్రాజైల్ ఫైవ్’ ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉన్న భారత్.. ప్రస్తుతం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులను ఈ పోలిక ద్వారా వివరించారు.
రూ.308 నుంచి రూ.7.51కి పడిపోయిన డేటా ధర!
డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతిని కూడా ఈ గ్రాఫిక్స్ హైలైట్ చేశాయి. 3G కాలంలో ఒక జీబీ మొబైల్ డేటా ధర సుమారు రూ.308 ఉండగా, 5G యుగంలో అది రూ.7.51కు తగ్గినట్లు పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం, చౌకైన ఇంటర్నెట్ అందుబాటులోకి రావడం వల్ల కోట్లాది మంది ప్రజలకు డిజిటల్ సేవలు చేరువయ్యాయని వివరించారు.
రైల్వేలు, పారిశుధ్యం, సౌర విద్యుత్‌లో పురోగతి!
మౌలిక సదుపాయాల రంగంలోనూ గణనీయమైన మార్పులు వచ్చినట్లు గ్రాఫిక్స్‌లో చూపించారు. రైల్వే విద్యుదీకరణ గతంలో 20 శాతంగా ఉండగా ప్రస్తుతం 99.6 శాతానికి చేరినట్లు పేర్కొన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా పారిశుధ్య కవరేజీ 39 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు వెల్లడించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోనూ భారత్ దూసుకెళ్తోందని పేర్కొన్నారు. దేశంలో సౌర విద్యుత్ సామర్థ్యం 2.82 గిగావాట్ల నుంచి 175 గిగావాట్లకు పెరిగినట్లు గ్రాఫిక్స్‌లో వివరించారు.
అంతరిక్షం, రక్షణ రంగాల్లోనూ భారత్ దూకుడు!
అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం పెరగడం మరో కీలక పరిణామంగా పేర్కొన్నారు. 2014లో కేవలం ఒకటిగా ఉన్న అంతరిక్ష స్టార్టప్‌ల సంఖ్య ప్రస్తుతం 440కి పెరిగినట్లు చూపించారు. బ్రహ్మోస్ క్షిపణి సహా దేశీయ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం, రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయడం వంటి అంశాలను కూడా ప్రస్తావించారు. ఇక తీవ్ర పేదరికం 27 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిందని, నక్సల్ హింస ప్రభావిత జిల్లాల సంఖ్య 182 నుంచి సున్నాకు చేరిందని ఇన్ఫోగ్రాఫిక్స్‌లో పేర్కొన్నారు.
GTA 6 విడుదల.. మోదీ పోస్ట్‌పై చర్చ!
మొత్తంగా GTA 5, GTA 6 విడుదలల మధ్య ఉన్న కాలాన్ని భారత్ అభివృద్ధి ప్రయాణానికి ప్రతీకగా చూపిస్తూ ప్రధాని మోదీ చేసిన ఈ ప్రయత్నం ఆసక్తిని రేకెత్తిస్తోంది. గేమింగ్ ప్రపంచంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతున్న రోజునే దేశంలో జరిగిన మార్పులను గుర్తుచేస్తూ చేసిన ఈ పోస్టు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయాలు, టెక్నాలజీ, గేమింగ్ ప్రపంచాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిన ఈ పోలిక ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..