AIMIM Strategy Uttar Pradesh Assembly Elections: మతం ఆధారంగా రాజకీయం చేస్తున్న ఎంఐఎం పార్టీ మరోసారి ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై దృష్టి సారించింది. ఇటీవల జరిగిన బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయిన ఎంఐఎం పార్టీ తమకు కలిసి వచ్చిన యుపీ, మహారాష్ట్రలపై పట్టును కొనసాగించాలని భావిస్తోంది. 2017 యుపీ ఎన్నికల్లో ముస్లిం ప్రభావిత ప్రాంతాల్లో గణనీయంగా ఓట్లు సాధించి, సమాజ్ వాదీ, బీఎస్పీలకు నష్టం కలిగించిన ఎంఐఎం, ఈసారి యుపీలో ఏకంగా వంద సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎంఐఎం పార్టీ అధినేత తాజాగా ట్వీట్ చేశారు. 2022లో జరిగే ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తామని అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ఇందుకోసం అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఆల్ రెడీ ప్రారంభించామని ఓవైసీ తెలిపారు. గత ఎన్నికల్లో మాదిరిగా ఎంఐఎం పార్టీ యుపీలో ఒంటరిగా కాకుండా.. మరో రెండు పార్టీలతో జతకట్టబోతున్నట్లు కూడా ఎంఐఎం అధినేత ఓవైసీ వెల్లడించారు. ఓంప్రకాశ్ రాజ్‌భర్ సారథ్యంలోని సుహేల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్‌బీఎస్‌పీ)తో కలిసి ఎంఐఎం యుపీ ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు. భగీదరి సంకల్ప్ మోర్చా పేరుతో ఇతర పార్టీలను ఏకం చేస్తున్న ఓం ప్రకాశ్ నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. అంతేకాక, ఎన్నికలు, పొత్తులపై ఇతర రాజకీయ పార్టీలతో ఇప్పటివరకు చర్చించలేదని అసదుద్దీన్ తెలిపారు. ఈ మేరకు అసదుద్దీన్ ట్వీట్ చేశారు.
उ.प्र. चुनाव को लेकर मैं कुछ बातें आपके सामने रख देना चाहता हूँ:-
1) हमने फैसला लिया है कि हम 100 सीटों पर अपना उम्मीदवार खड़ा करेंगे, पार्टी ने उम्मीदवारों को चुनने का प्रक्रिया शुरू कर दी है और हमने उम्मीदवार आवेदन पत्र भी जारी कर दिया है।1/2
— Asaduddin Owaisi (@asadowaisi) June 27, 2021
2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేసిన ఎంఐఎం పార్టీ ఐదు సీట్లను గెలుచుకుంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న సీమాంచల్ ప్రాంతంలో పట్టు సాధించేందుకు ప్రయత్నించి సక్సెస్సయింది. అంతకుముందు 2019లో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు స్థానాల్లో గెలుపొందింది. ఇలా వివిధ రాష్ట్రాల్లో పాగా వేయాలని ప్రయత్నిస్తోన్న ఎంఐఎం.. వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపైనా కన్నేసింది. అయితే, యుపీలో ఎంఐఎం పార్టీ పోటీ చేయడం భారతీయ జనతాపార్టీకి ప్రయోజనంగాను, సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలకు నష్టంగా మారుతుందని రాజకీయ పరిశీలకులు అంఛనా వేస్తున్నారు. ముస్లింల ఓట్లను ఎస్పీ, బీఎస్పీ, ఎంఐఎం పార్టీలు చీల్చుకుంటే.. హిందువుల ఓట్లు గంపగుత్తగా బీజేపీ పడే అవకాశం వుందని వారు అంచనా వేస్తున్నారు. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లోను ఎంఐఎం దూకుడు బీజేపీకే లాభించిందన్న అంఛనాలు వినిపించాయి.
హైదరాబాద్ కేంద్రంగా చిరకాలంపాటు రాజకీయం నెరపిన ఎంఐఎం పార్టీ.. ఇతర రాష్ట్రాలకు విస్తరించే ప్రణాళికను గత దశాబ్దంలోనే ప్రారంభించింది. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలోని అన్ని అసెంబ్లీ స్థానాలపై తిరుగులేని పట్టు కొనసాగిస్తున్న ఎంఐఎం పార్టీ ముందుగా కర్నాటకలోని గుల్బర్గా, బీదర్ మునిసిపాలిటీలపై నజర్ పెట్టింది. గణనీయమైన సంఖ్యలో కౌన్సిలర్లను గెలిపించుకుని అక్కడి బల్దియాలపై ముద్ర వేసింది. ఆ తర్వాత మహారాష్ట్రలోని ఔరంగాబాద్, నాందేడ్ ప్రాంతాలపై నజర్ పెట్టింది. ఔరంగాబాద్ నగర పాలక సంస్థలో పట్టు సాధించిన తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలను ఎంఐఎం పార్టీ గెలిపించుకోగలిగింది. దాంతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఎంఐఎం విస్తరించింది. ప్రస్తుతం ఔరంగాబాద్, లాతూర్, నాందేడ్, అమరావతి జిల్లాల్లో ఎంఐఎం పార్టీ బలమైన క్యాడర్‌ని ఏర్పాటు చేసుకుంది. మరట్వాడా ప్రాంతంలో ఎంఐఎం పట్టు క్రమంగా పెరుగుతున్న సంకేతాలున్నాయి.
మహారాష్ట్రలో సాధించిన సానుకూల ఫలితాల ఊపుతో 2017 యుపీ ఎన్నికల్లోను ఎంఐఎం ఉత్తరాదిన అరంగేట్రం చేసింది. యుపీలో సింగిల్‌గా పోటీ చేసి సీట్లను సాధించుకోలేకపోయినా.. అక్కడ రెండు బలమైన పార్టీలైన ఎస్పీ, బీఎస్పీల ముస్లిం ఓటు బ్యాంకులను ఎంఐఎం కొల్లగొట్టింది. దాంతో ఆ పార్టీలకు గణనీయంగా సీట్లు తగ్గి.. బీజేపీ సంఖ్య మూడొందలు దాటేందుకు దారి తీసింది. ఆ తర్వాత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లోను 20 సీట్లకు పోటీ చేసి, అయిదుగురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. అదే ఊపుతో బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఎంఐఎం పార్టీకు అంతగా అనుకూల ఫలితాలు రాలేదు. తమిళనాడులో నాలుగో కూటమిలో భాగస్వామిగా మూడు సీట్లలో ఎంఐఎం పోటీ చేసింది. కానీ కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేక చతికిలా పడింది. అయితే.. యుపీలో ముస్లింల ప్రభావం ఎక్కువగా వుండడం, గత రెండు మూడేళ్ళుగా అయోధ్య అంశం అక్కడి ముస్లింలలో బాగా ప్రభావం చూపడం.. వంటి కీలకాంశాలను పరిగణలోకి తీసుకున్న ఎంఐఎం అధినేత.. అక్కడ పాగా వేసేందుకు వచ్చే ఎన్నికలే కీలకమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే ఏకంగా యుపీలో వంద సీట్లలో పోటీ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ నిర్ణయించారు.
కాగా ఇటు తెలంగాణ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా ఎంఐఎం వుండడం విశేషం. నిజానికి తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లను గెలుచుకుంది. అయితే.. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పలువురు అధికార టీఆర్ఎస్ పార్టీలోకి జంపవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాను కోల్పోయింది. దాంతో 7 సీట్లతో రెండో స్థానంలో వున్న ఎంఐఎం పార్టీకి స్పీకర్ విపక్ష పాత్రను కట్టబెట్టారు. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు విస్తరించే వ్యూహంలో భాగంగా తొలుత ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, గుంటూరు సిటీలలో ఎంఐఎం పార్టీ పోటీ చేస్తుందని భావించారు అందరు. కానీ 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో కుదిరిన లోపాయికారీ ఒప్పందం కారణంగా ఎంఐఎం ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదన్న ప్రచారం జోరుగా జరిగింది. పొరుగునే వున్న రాష్ట్రాన్ని వదిలేసి.. ఉత్తరాదిపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ దృష్టి సారించారు. ముస్లిం ఓటు బ్యాంకు అధికంగా వున్న నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికను ఆయన ప్రారంభించారు. నిజానికి బెంగాల్‌లో ముస్లిం జనాభా అధికంగా వుండే అసన్ సోల్ లాంటి ప్రాంతాలపై సీనియర్ ఓవైసీ కాస్త సీరియస్‌గానే, ముందస్తు వ్యూహంతో పని చేశారు. కానీ అక్కడ బీజేపీ వర్సెస్ తృణమూల్ అన్నట్లు సాగిన పోరులో ఎంఐఎం అంతగా ప్రభావం చూపలేకపోయింది. తాజా నిర్ణయంతో యుపీలో ఎంఐఎం పార్టీ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.