AAM ADMI PARTY: అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారనున్న సమీకరణాలు.. మోదీకి ధీటైన ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్..?

| Edited By: Ram Naramaneni

Jan 28, 2022 | 2:11 PM

గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న లోక్ సభ సీట్ల సంఖ్య చూస్తే.. గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించింది ఈ పార్టీయేనా ఇది అన్న అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలో 2024లో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు సంసిద్దమవుతున్నాయి.

AAM ADMI PARTY: అయిదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మారనున్న సమీకరణాలు.. మోదీకి ధీటైన ప్రత్యామ్నాయంగా కేజ్రీవాల్..?
Follow us on

AAM ADMI PARTY PRESIDENT ARAVIND KEJRIWAL EMERGING ALTERNATE TO NARENDRA MODI: బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎవరు? జాతీయ స్థాయిలో బీజేపీ (BJP), కాంగ్రెస్ పార్టీ (CONGRESS PARTY)లే కదా పెద్ద పార్టీలు.. కాబట్టి బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అనే వాళ్ళుండొచ్చు. కానీ గత దశాబ్దకాలంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. ఆ పార్టీ ఎన్నికల్లో పొందుతున్న సీట్ల సంఖ్య చూస్తే.. బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ కాదేమో అన్న సందేహం కలుగక మానదు. గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో (2014, 2019) కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న లోక్ సభ (LOKSABHA) సీట్ల సంఖ్య చూస్తే.. గత ఏడు దశాబ్దాలుగా దేశాన్ని పాలించింది ఈ పార్టీయేనా ఇది అన్న అనుమానం కలుగుతుంది. ఈ క్రమంలో 2024లో మరోసారి సార్వత్రిక ఎన్నికలకు పార్టీలు సంసిద్దమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగింటిలో బీజేపీ అధికారంలో వుండి మరోసారి అధికారంలోకి వచ్చేందుకు పోరాడుతోంది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో వున్నప్పటికీ.. ఒక్క ఉత్తరాఖండ్ (UTTARAKHAND ASSEMBLY ELECTIONS 2022) మినహా ఎక్కడా అధికారంలోకి వచ్చే సంకేతాలు కనిపించడం లేదు. ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్ పార్టీని హరీశ్ రావత్ (HARISH RAWATH) తన సొంత చరిష్మాతో గెలిపించాలే గానీ. ఆ పార్టీకి ప్రజాదరణ పెరిగి మాత్రం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక ఉత్తర ప్రదేశ్‌ (UTTAR PRADESH ASSEMBLY ELECTIONS 2022)ని దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఆ రాష్ట్రంలో నాలుగో స్థానానికే పరిమితమైంది. మణిపూర్ (MANIPUR ASSEMBLY ELECTIONS 2022), గోవా (GOA ASSEMBLY ELECTIONS 2022)ల్లో కాంగ్రెస్ పార్టీ బరిలో వున్నా ప్రధాన పోటీలో లేదని ఒపీనియన్ పోల్స్ చాటి చెబుతున్నాయి. ఇక పంజాబ్‌ (PUNJAB ASSEMBLY ELECTIONS 2022)లో అధికారంలో వున్న కాంగ్రెస్ పార్టీ అక్కడ మరోసారి గెలిచే అవకాశం కనిపించడం లేదు. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీకి కెప్టెన్ అమరీందర్ సింగ్ దూరమవడం.. పీసీసీ అధ్యక్షుడు నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ ఒంటెద్దు పోకడలు.. కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలను సన్నగిల్లేలా చేస్తున్నాయి. ఇక పంజాబ్‌లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, శిరోమణి అకాలీదళ్ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఈ మూడు పార్టీల్లో ఆప్ పార్టీది కాసింత పైచేయిగా కనిపిస్తోంది.

ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా వుండబోతున్నా.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎవరు వుండబోతున్నారు ? మోదీ స్థాయిలో వ్యక్తిగత చరిష్మా సాధించి.. బీజేపీకి గట్టిపోటీ ఎవరు ఇవ్వబోతున్నారు ? ఈ అంశాలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. మోదీకి ధీటైన నేతగా ఎదిగే విషయంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి సరైన మార్కులు పడడం లేదన్నది ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజంగానే భావించాలి. రాహుల్ గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత జరగిన ఏ ఎన్నికలోను ఆయన పెద్దగా ప్రభావం చూపలేదు. భవిష్యత్తులో చూపుతారు అన్న సంకేతాలు కూడా కనిపించడం లేదన్నది రాజకీయ విశ్లేషకులు అంటున్న మాట. ఇక గత సంవత్సరం జరిగిన బెంగాల్ ఎన్నికల్లో రెండోసారి అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్.. అదే ఊపులో జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయం కాబోతుందన్న విశ్లేషణలు వినిపించాయి. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ జాతీయ స్థాయిలో మోదీకి ప్రత్యామ్నాయం కావచ్చన్న అంఛనాలు వినిపించాయి. అయితే.. బెంగాల్‌లో మరో దఫా అధికారం చేపట్టిన తర్వాత మమతాబెనర్జీ జాతీయ స్థాయిలో ఎదిగేందుకు చేసిన ప్రయత్నాలు ఏమీ కానరాలేదు. ఈ క్రమంలో దేశరాజధానిలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరి వరుసగా విజయాలు సాధిస్తూ వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జాతీయ స్థాయిలో చరిష్మా సాధిస్తున్నారన్న అంఛనాలు, విశ్లేషణలు తాజాగా మొదలయ్యాయి.

ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పాగా వేసేందుకు యత్నిస్తోంది. పంజాబ్‌లో గత లోక్ సభ ఎన్నికల్లో ఆప్ మెరుగైన ఫలితాలను సాధించింది. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న చతుర్ముఖ పోటీలో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం సాధించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అందుకే అక్కడ ఏకంగా ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించేశారు. అదే ఊపు గోవాలోను కనిపిస్తోంది. విద్యావంతులు అధికంగా వున్న గోవాలోను ఆమ్ ఆద్మీ పార్టీ అధికార బీజేపీకి సవాల్ విసురుతోంది. అక్కడ కూడా ఆప్ పాగా వేయొచ్చన్న అంఛనాలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక ఉత్తరాఖండ్‌లోను కేజ్రీవాల్ పార్టీ మెరుగైన నెంబర్ పొందుతుందంటున్నారు. ఈక్రమంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అరవింద్ కేజ్రీవాల్ అయితే సొంతంగా మోదీని సవాల్ చేయగలిగే స్థాయికి చేరుకోవడమో.. లేదా విపక్షాల ఉమ్మడి ఆమోదయోగ్య నేతగా ప్రధాని అభ్యర్థిగా బరిలోకి దిగడమో జరుగుతుందని జాతీయ స్థాయి రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.

నిజానికి దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా తమ సొంత రాష్ట్రం మినహాయిస్తే.. మరో రాష్ట్రంలో గెలిచిన చరిత్ర లేదు. ఈ సూత్రం నుంచి జాతీయ పార్టీలుగా చెప్పుకునే సమాజ్ వాదీ, బీఎస్పీ, ఎన్సీపీలు కూడా మినహాయింపు కాదనే చెప్పాలి. సమాజ్ వాదీ, బీఎస్పీలు ఉత్తర్ ప్రదేశ్‌కు పరిమితం కాగా.. ఎన్సీపీ మహారాష్ట్రకు పరిమితమైంది. ఇక తెలుగుదేశంపార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, బీజు జనతాదళ్ ఒడిశాకు, డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు తమిళనాడుకు, టీఆర్ఎస్ తెలంగాణకు, వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరిమితమయ్యాయి. కానీ ఈ సూత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి వర్తించే పరిస్థితి లేదు. ఎందుకంటే గత సార్వత్రిక ఎన్నికల్లోనే ఆప్ పార్టీ ఈ సూత్రాన్ని బ్రేక్ చేస్తూ పంజాబ్‌లో మెరుగైన సీట్లను గెలుచుకుంది. ప్రస్తుతం కూడా పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో గట్టి పోటీనిచ్చే స్థాయికి ఎదిగింది కేజ్రీవాల్ పార్టీ. కేజ్రీవాల్ ఢిల్లీ పరిపాలనలో తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారు. ఏ ఒక్క వర్గానికో ప్రయోజనం కలిగించే పథకాలను కాకుండా అందరికీ వర్తించేలా స్కీములను అమలు చేస్తున్నారు. అదేసమయంలో అవినీతిరహితంగా ఆయన పాలన కొనసాగడం కూడా ఓ సానుకూలాంశంగా మారింది. ఈ అంశాల ఆధారంగా అరవింద్ కేజ్రీవాల్ వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయం కావచ్చన్న విశ్లేషణలు ఊపందుకున్నాయి.

ఇవి కూడా చదవండి:

Election 2022: పొత్తు రాజకీయాల్లో కాంగ్రెస్ చిత్తు.. వ్యూహాలతో దూసుకెళ్తున్న బీజేపీ..

Andhra Pradesh: జిన్నా ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాడో.. బీజేపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన వైసీపీ ఎంపీ..