హెన్నా నేచురల్ కదా అని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారా? జుట్టుకు జరిగే ఈ నష్టం తెలిస్తే షాక్ అవుతారు!

తెల్ల జుట్టును కవర్ చేయడానికి మార్కెట్లో దొరికే కెమికల్ డైల కంటే హెన్నా (గోరింటాకు) వాడటం సహజమైనది. సురక్షితమైనదని చాలా మంది భావిస్తారు. అయితే, అతిగా లేదా ఇష్టం వచ్చినట్లు హెన్నా వాడితే జుట్టు తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెన్నా వల్ల జుట్టు ఏ విధంగా డ్యామేజ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం.

హెన్నా నేచురల్ కదా అని ఇష్టమొచ్చినట్లు వాడుతున్నారా? జుట్టుకు జరిగే ఈ నష్టం తెలిస్తే షాక్ అవుతారు!
Is Henna Bad For Hair
Image Credit source: freepik

Updated on: May 27, 2026 | 9:23 PM

ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి, కాలుష్యం, ఒత్తిడి కారణంగా చిన్న వయసులోనే చాలా మందికి తెల్ల జుట్టు (Grey Hair) వచ్చేస్తోంది. దీంతో వయసు పైబడిన వారిలా కనిపిస్తామనే భయంతో కెమికల్స్ ఎక్కువగా ఉండే హెయిర్ డైలు వాడటానికి భయపడి, అందరూ ప్రత్యామ్నాయంగా హెన్నా (Henna) లేదా గోరింటాకును ఎంచుకుంటారు. హెన్నా పూర్తిగా సహజసిద్ధమైనది. కాబట్టి, దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని చాలా మంది నమ్ముతారు. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం హెన్నాను క్రమం తప్పకుండా, అతిగా వాడటం వల్ల జుట్టుకు ఊహించని నష్టం జరుగుతుందని చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..

జుట్టు తీవ్రంగా పొడిబారిపోతుంది (Dry Hair): హెన్నాలో టానిన్ (Tannin) అనే సహజ రసాయనం ఉంటుంది. ఇది జుట్టుకు మంచి ఎరుపు లేదా బ్రౌన్ రంగును ఇస్తుంది. అయితే, ఈ టానిన్‌కు జుట్టులో ఉండే సహజమైన తేమను, నూనెలను పీల్చుకునే గుణం ఉంది. అందువల్ల, తరచూ హెన్నా పెట్టుకోవడం వల్ల తలలోని తేమ పూర్తిగా ఆవిరైపోయి, జుట్టు గడ్డి పీచులా, జీవం లేకుండా మారుతుంది.

జుట్టు గరుకుగా మారడం: చాలా మంది హెన్నా పెట్టుకున్న తర్వాత జుట్టు కాస్త ఒత్తుగా కనిపిస్తోందని సంతోషపడతారు. కానీ వాస్తవానికి, హెన్నా రంగు వెంట్రుకల లోపలి భాగంలోకి వెళ్లదు. ఇది కేవలం వెంట్రుక పైభాగంలో ఒక మందపాటి పొరలా పేరుకుపోతుంది. దీనివల్ల జుట్టు లావుగా అనిపించినప్పటికీ, రోజులు గడిచేకొద్దీ అది తన సహజసిద్ధమైన సిల్కీ తనాన్ని (మృదుత్వాన్ని) కోల్పోయి విపరీతమైన గరుకుగా మారుతుంది.

ఇవి కూడా చదవండి

కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలడం: హెన్నాను తలకు దట్టంగా అప్లై చేయడం వల్ల అది స్కాల్ప్ (తల చర్మం) పై ఉండే రంధ్రాలను మూసివేస్తుంది. దీనివల్ల జుట్టు కుదుళ్లకు అందవలసిన ఆక్సిజన్, పోషణ సరిగా అందవు. తల చర్మం పొడిబారిపోయి కుదుళ్లు తమ పట్టును కోల్పోతాయి, ఫలితంగా జుట్టు విపరీతంగా రాలడం, పలచబడటం మొదలవుతుంది.

చర్మ అలర్జీల ముప్పు: సహజమైనదే కదా, అలర్జీలు రావు అనుకోవడం అపోహ మాత్రమే. కొందరి చర్మానికి హెన్నాలోని ప్రొటీన్లు పడవు. ముఖ్యంగా సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ప్యాచ్ టెస్ట్ చేసుకోకుండా నేరుగా హెన్నా వాడితే తల చర్మం ఎర్రబడటం, తీవ్రమైన దురద, దద్దుర్లు వంటి కాంటాక్ట్ డెర్మటైటిస్ సమస్యలు ఎదురవుతాయి. అయితే, హెన్నాను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ, వాడే పద్ధతి మార్చుకోవాలి. హెన్నా మిశ్రమాన్ని కలుపుకునేటప్పుడు అందులో పెరుగు, గుడ్డు తెల్లసొన లేదా అలోవెరా జెల్ వంటి మాయిశ్చరైజింగ్ పదార్థాలను కలిపి వాడటం వల్ల జుట్టు పొడిబారకుండా కాపాడుకోవచ్చు.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us