
కళ్ల అందాన్ని రెట్టింపు చేయడంలో కనురెప్పలు (Eyelashes) కీలక పాత్ర పోషిస్తాయి. మస్కరా లేదా ఆర్టిఫిషియల్ రెప్పల అవసరం లేకుండా ఇంట్లోనే సహజ పద్ధతుల్లో కనురెప్పలను ఒత్తుగా, పొడవుగా మార్చుకోవచ్చునని మీకు తెలుసా..? ఇందుకోసం మనకు అందుబాటులో లభించే పదార్థాలు అద్భుతంగా మేలు చేస్తాయి. అలాంటి పదార్థాలు ఏవి..? వాటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు చూద్దాం..
ఆముదం నూనె (Castor Oil): జుట్టు ఎదుగుదలకు ఆముదం ఎంతగానో సహాయపడుతుందని మనకు తెలుసు. కనురెప్పలు వేగంగా పెరగడానికి కూడా ఇది నెం.1 హోం రెమెడీగా పనిచేస్తుంది. ఆముదంలో ఉండే రిసినోలిక్ యాసిడ్, ముఖ్యమైన ఫ్యాటీ యాసిడ్స్ కుదుళ్లకు లోతైన పోషణను అందిస్తాయి. రాత్రి పడుకునే ముందు ఒక ఇయర్ బడ్ (Earbud) లేదా శుభ్రమైన మస్కరా బ్రష్ సహాయంతో కొద్దిగా ఆముదం తీసుకుని కనురెప్పలపై అప్లై చేయాలి, మరుసటి రోజు ఉదయం కడిగేసుకోవాలి.
విటమిన్ ఇ ఆయిల్ (Vitamin E Oil): విటమిన్ ఇ అనేది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది వెంట్రుకలు దెబ్బతినకుండా రక్షించి, కొత్త జుట్టు పెరగడానికి ప్రేరేపిస్తుంది. మార్కెట్లో లభించే విటమిన్ ఇ క్యాప్సూల్ నుండి నూనెను పిండి, దానిని రాత్రి పూట కనురెప్పలకు రాయడం వల్ల రెప్పలు బలంగా, ఒత్తుగా మారుతాయి.
ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె: ఆలివ్ ఆయిల్‌లో విటమిన్ ఎ, ఇ పుష్కలంగా ఉంటాయి. ఇది కనురెప్పల రంగును ముదురు నల్లగా మార్చడానికి ఉపయోగపడుతుంది. అలాగే కొబ్బరి నూనెలోని ప్రొటీన్లు వెంట్రుకలు విరిగిపోకుండా చూస్తాయి. ఈ రెండు నూనెలను సమానంగా కలుపుకుని రోజూ కనురెప్పలకు మసాజ్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
పెట్రోలియం జెల్లీ (Vaseline): కనురెప్పలు పొడిబారడం వల్ల కూడా త్వరగా రాలిపోతుంటాయి. వాసెలిన్ లేదా పెట్రోలియం జెల్లీ కనురెప్పలకు అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు కొద్దిగా వాసెలిన్‌ను కనురెప్పలకు రాసుకోవడం వల్ల అవి మృదువుగా మారి, వేగంగా ఎదుగుతాయి.
పోషకాహారం, జాగ్రత్తలు: బాహ్య సంరక్షణతో పాటు లోపలి పోషణ కూడా ముఖ్యం. మీ ఆహారంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, బాదం, చేపలు వంటివి డైట్‌లో చేర్చుకోవాలి. అంతేకాకుండా, రాత్రి పడుకునే ముందు కంటికి ఉన్న మేకప్‌ను లేదా మస్కరాను పూర్తిగా తొలగించడం అస్సలు మరువకూడదు. సహజసిద్ధమైన చిట్కాలు ఫలితాన్ని ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఓపికగా వీటిని క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా మీ కనురెప్పలు అందంగా, ఒత్తుగా మారుతాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..