
సాంబార్, రసం, పులుసు వంటి అనేక రకాల వంటకాల్లో పులుపు కోసం మనం రోజూ చింతపండును ఉపయోగిస్తాము. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో చింతపండును కిలోల కొద్దీ కొనుగోలు చేసి నిల్వ చేస్తుంటారు. అయితే, దీనిని సరైన పద్ధతిలో భద్రపరుచుకోకపోతే, గాలిలోని తేమ కారణంగా త్వరగా పాడైపోయే అవకాశం ఉంది. చింతపండు చెడిపోయినప్పుడు దానిని గుర్తించడం ఎలా? అలాగే దానిని ఎక్కువ కాలం తాజాగా ఉంచుకునే సులభమైన పద్ధతులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బూజు పట్టడం: చింతపండు ఉపరితల భాగంలో తెల్లని, ఆకుపచ్చని లేదా నల్లటి మచ్చలు లేదా దూది లాంటి పదార్థం కనిపిస్తే అది ఫంగస్ పట్టినట్లు అర్థం. ఇలాంటి సమయంలో బూజు పట్టిన భాగాన్ని తీసివేయకుండా మొత్తం చింతపండును పడేయడమే మంచిది.
దుర్వాసన రావడము: చింతపండుకు ఉండే సహజమైన తీపి, పులుపు కలగలిసిన సువాసనకు బదులుగా విచిత్రమైన వాసన లేదా వింతైన పులుపు వాసన వస్తే దానిని ఉపయోగించకూడదు.
పురుగులు లేదా ఫంగస్: ఎక్కువ రోజులు గాలికి వదిలేస్తే చింతపండులో చిన్న చిన్న ఫంగస్, పురుగులు లేదా వాటి గుడ్లు ఏర్పడతాయి. చింతపండు కాలం గడిచే కొద్ది సహజంగానే ముదురు గోధుమ రంగులోకి లేదా నలుపు రంగులోకి మారుతుంది. కాబట్టి రంగు మారడం మాత్రమే అది పాడైపోయిందనడానికి నిదర్శనం కాదు. అయితే దుర్వాసన లేదా బూజు వంటి ఇతర లక్షణాలు ఉంటేనే అది పాడైపోయినట్లు నిర్ధారించుకోవాలి. చింతపండును దీర్ఘకాలం నిల్వ చేసే పద్ధతులు:గాలిచొరబడని డబ్బాలు: చింతపండును ఎల్లప్పుడూ గాలి తగలకుండా గట్టిగా మూత ఉండే గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలలో నిల్వ చేయాలి. ఇది తేమ, పురుగులు చేరకుండా కాపాడుతుంది.
పొడి ప్రదేశాలలో భద్రపరచడం: పొయ్యికి, సింక్‌కు దూరంగా ఉండే పొడిగా ఉన్న అల్మారాలలో వీటిని ఉంచాలి. చింతపండును డబ్బాలో నుండి బయటకు తీసేటప్పుడు ఎప్పుడూ తడి లేని పొడి స్పూన్లను మాత్రమే వాడాలి.
ఫ్రిజ్ లేదా ఫ్రీజర్‌లో నిల్వ చేయడం: పెద్ద మొత్తంలో ఉన్న చింతపండును జిప్ లాక్ కవర్లలో లేదా డబ్బాలలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే చాలా నెలల పాటు తాజాగా ఉంటుంది. చింతపండును సరిగ్గా నిల్వ చేయడం ద్వారా దాని నాణ్యత, సహజమైన రుచి ఎప్పటికీ చెడిపోకుండా ఉంటుంది.