ఇంట్లోనే కుంకుమపువ్వు పండించడం ఎలా? కుండీలో సాగు చేసే సులభమైన పద్ధతులు!

అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో ఒకటైన కుంకుమపువ్వును కేవలం పెద్ద పొలాల్లోనే కాకుండా మన ఇంట్లోని కుండీలలో కూడా సులభంగా పెంచుకోవచ్చు. దీని కోసం ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య కాలంలో ఆరోగ్యకరమైన దుంపలను ఎంచుకుని, తేమ నిల్వ ఉండని సరియైన మట్టి మిశ్రమం ఉన్న కుండీలలో నాటాలి. మొక్కకు తగినంత ఎండ, మితమైన నీరు అందేలా చూసుకోవాలి. సాధారణంగా అక్టోబర్ - నవంబర్ నెలల్లో మొక్కకు పూలు పూస్తాయి. పూల నుండి ఎరుపు రంగు దారాలను సేకరించి ఎండబెట్టి, ఎయిర్‌టైట్ జార్‌లో భద్రపరుచుకోవడం ద్వారా స్వచ్ఛమైన కుంకుమపువ్వును ఇళ్లలోనే పొందవచ్చు.

ఇంట్లోనే కుంకుమపువ్వు పండించడం ఎలా? కుండీలో సాగు చేసే సులభమైన పద్ధతులు!
How To Grow Saffron At Hom

Updated on: Nov 17, 2026 | 12:29 PM

కుంకుమపువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, విలువైన సుగంధ ద్రవ్యాలలో ఒకటి. దీనిలోని కొన్ని ఎర్రటి రేకలు పాలు, స్వీట్లు, వంటకాలకు అద్భుతమైన రంగును, సువాసనను అందిస్తాయి. మన దేశంలో సాధారణంగా జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కేసర్ సాగు జరుగుతుంటుంది. దీంతో కేవలం పెద్ద పొలాలు, ప్రత్యేకమైన వాతావరణం ఉంటేనే కుంకుమపువ్వు పండుతుందని చాలా మంది భావిస్తారు. కానీ, సరైన పద్ధతులు పాటిస్తే మీ ఇంట్లోని బాల్కనీలో లేదా కుండీలలో కూడా కుంకుమపువ్వును విజయవంతంగా పెంచుకోవచ్చు.

సరైన దుంపలను ఎంచుకోవడం:

కేసర్‌ మొక్కలను విత్తనాల ద్వారా కాకుండా చిన్న ఉల్లిపాయల మాదిరిగా ఉండే దుంపల ద్వారా పెంచుతారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో నమ్మకమైన నర్సరీల నుండి నాణ్యమైన దుంపలను కొనుగోలు చేయాలి. దుంపలపై ఎలాంటి బూజు, దెబ్బతిన్న భాగాలు లేదా మెత్తటి ప్రదేశాలు ఉండకూడదు. కనీసం 9 సెంటీమీటర్ల పరిమాణం ఉన్న పెద్ద దుంపలు ఆరోగ్యంగా ఉండి చక్కటి పూలను ఇస్తాయి.

కుండీ, మట్టి తయారీ:

ఈ మొక్కల సాగుకు అడుగుభాగంలో నీరు బయటకు పోయే రంధ్రాలు ఉన్న మట్టి కుండీలు లేదా కంటైనర్లు ఉత్తమం. కుండీ లోతు కనీసం 8 అంగుళాలు ఉండాలి. మట్టి తయారీ కోసం రెండు వంతుల సాధారణ మట్టి, ఒక వంతు ఇసుక, ఒక వంతు సేంద్రీయ ఎరువును కలపాలి. మట్టిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండకూడదు, లేదంటే దుంపలు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

నాటే విధానం, నీటి యాజమాన్యం:

ఆగస్టు నుండి అక్టోబర్ మధ్య కాలంలో ఈ దుంపలను సుమారు 4 అంగుళాల లోతులో నాటాలి. ప్రతి దుంపకు మధ్య సుమారు 4 అంగుళాల దూరం ఉండాలి. దుంపల పైభాగం పైకి ఉండేలా చూసుకోవాలి. నాటిన తర్వాత ఒకసారి నీరు పోసి, ఆ తర్వాత ఆకులు వచ్చేవరకు పదే పదే నీరు పోయాల్సిన అవసరం లేదు. మొక్కకు మంచి ఎండ తగిలేలా చూడాలి. ఆకులు వచ్చిన తర్వాత మట్టి పైభాగం ఎండిపోయినప్పుడు మాత్రమే మితంగా నీరు అందించాలి.

దిగుబడి, నిల్వ చేసే విధానం:

సాధారణంగా అక్టోబర్ – నవంబర్ నెలల్లో కేసర్ మొక్కలకు అందమైన పూలు పూస్తాయి. పూలు పూర్తిగా వికసించిన తర్వాత వాటి మధ్యలో ఉండే మూడు ఎర్రటి దారాలను జాగ్రత్తగా వేరు చేయాలి. వాటిని రెండు మూడు రోజులు కాగితంపై ఉంచి బాగా ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన తర్వాత వాటిని ఒక గాలిచొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఈ విధంగా ఇంట్లోనే స్వచ్ఛమైన కుంకుమపువ్వును సులభంగా తయారు చేసుకుని వంటకాలలో ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us