
ప్రపంచంలో అత్యధిక ఆయుర్దాయం కలిగిన దేశాల్లో జపాన్ ఒకటి. అక్కడి ప్రజలు కేవలం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మాత్రమే కాకుండా.. వారి క్రమశిక్షణతో కూడిన జీవన విధానం, ఆలోచనా విధానం వల్ల సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తున్నారు. జపనీయుల కొన్ని ప్రత్యేక అలవాట్లను మనం కూడా అలవాటు చేసుకుంటే.. అవి మన జీవితాన్నీ మరింత సంతృప్తికరంగా మార్చే అవకాశముంది. జపనీయులు వందేళ్లు దీర్ఘాయుష్షుతో జీవించేందుకు దోహదపడుతున్న అద్భుతమైన జీవన సూత్రాలు ఇవే.
జపనీయులలో చాలా మంది ‘ఇకిగాయ్’ అనే జీవన విధానాన్ని అనుసరిస్తారు. అంటే.. జీవితం ఏదో నడిచిపోతోందని కాకుండా.. జీవితాన్ని సార్థకం చేసుకోవాలనే బలమైన లక్ష్యంతో వారు జీవిస్తారు. ఉదయం నిద్రలేవగానే ఉత్సాహంగా ఆ రోజును ప్రారంభించేందుకు ఒక కారణం ఉండాలని వారు నమ్ముతారు. ఇష్టమైన పని, మన ప్రతిభ, సమాజానికి ఉపయోగపడే అంశాలు కలిసే చోటే నిజమైన ఆనందం దాగి ఉంటుందని జపనీయులు నమ్ముతారు.
గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడంపై జపనీయులు ఎక్కువగా దృష్టి పెడతారు. కళాత్మక కార్యక్రమాలు, ధ్యానం వంటి అలవాట్లపై వారు దృష్టిసారిస్తారు. ఇవి మానసిక ప్రశాంతతను పెంచుతాయి.
జపాన్‌లో మినిమలిజం ఒక జీవన విధానం. అవసరం లేని వస్తువులను ఇంట్లో నిల్వ చేయకుండా, అవసరమైన వాటినే ఉంచడం వల్ల మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. తక్కువ వస్తువులు… ఎక్కువ సంతోషం అనే జీవన విధానానికి వారు ప్రాధాన్యత ఇస్తారు.
మానసిక, శారీరక ఆరోగ్యానికి జపనీయులు చాలా ప్రాధాన్యత ఇస్తారు. తాజా కూరగాయలు, చేపలు, సీఫుడ్, తృణధాన్యాలు జపనీయుల ఆహారంలో ప్రధాన భాగంగా ఉంటాయి. ఎక్కువ నూనె, చక్కెర, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారు. ఈ పోషకాహార అలవాట్లే వారి దీర్ఘాయువు, ఆరోగ్యం వెనకున్న రహస్యం.
బిజీ జీవితంలో కూడా ఇంటిని ప్రశాంతతకు నిలయంగా మార్చుకోవడం జపనీయులకున్న ఓ గొప్ప అలవాటు. సరైన వెలుతురు, శుభ్రమైన పరిసరాలు, కుటుంబ సభ్యులతో గడిపేందుకు వారు ఎక్కువగా ఇష్టపడుతారు. దీని ద్వారా మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారు.
ఒక్కసారిగా పెద్ద మార్పులు చేయడం కంటే ప్రతిరోజూ చిన్న చిన్న మెరుగుదలలు చేసుకుంటూ ముందుకు సాగాలని “కైజెన్” తత్వం చెబుతుంది. ఈ అలవాటు జీవితంలో స్థిరమైన విజయాలకు దారి తీస్తుంది.
చెట్లు, పూలు, ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు జపనీయులు ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తారు. అడవుల్లో నడకలు, చెర్రీ బ్లాసమ్ పూల అందాలను వీక్షించడం వంటి కార్యక్రమాలు ఒత్తిడిని తగ్గిస్తాయి.
“ఒమొటెనాషి” అనే భావన ప్రకారం అతిథులను ఎలాంటి స్వార్థం లేకుండా గౌరవంగా చూసుకోవడం జపాన్ సంస్కృతిలో భాగం. ఇది మనుషుల మధ్య బలమైన బంధాలను ఏర్పరుస్తుంది.
సమయానికి విలువ ఇవ్వడం, క్రమశిక్షణ, బాధ్యతతో వ్యవహరించడం, కష్టపడి పనిచేయడం జపనీయుల ప్రధాన లక్షణాలు. అందుకే ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ ఒకటిగా నిలిచింది.
భూకంపాలు, సునామీలు వంటి ఎన్నో ప్రకృతి విపత్తులను ఎదుర్కొన్నప్పటికీ జపాన్ ప్రజలు ధైర్యం కోల్పోలేదు. పట్టుదలతో పరిస్థితులకు అనుగుణంగా మారి.. ప్రతిసారి మరింత బలంగా తిరిగి నిలబడటం వారి ప్రత్యేకత. జపనీయుల పట్టుదల అందరికీ ఆదర్శం.
జపాన్ సంస్కృతిలో పెద్దలను గౌరవించడానికి అత్యున్నత స్థానం ఉంటుంది. వయసుతో వారు పొందిన అనుభవం, జ్ఞానాన్ని ఎంతో గౌరవిస్తారు. వారిచ్చే సలహాలను అత్యంత విలువైనవిగా భావిస్తారు. దీనివల్ల వారి కుటుంబ బంధాలు తరతరాలుగా బలంగా ఉంటాయి.
చిన్న పనైనా, పెద్ద పనైనా అత్యంత శ్రద్ధతో చేయడం జపనీయుల లక్షణం. అందుకే వారి ప్రాడక్టులు, సేవలు ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు మారుపేరుగా నిలుస్తాయి. ఏ పని చేసినా అంకితభావంతో, నాణ్యతతో చేయాలన్న వారి లక్షణం మనం కూడా అలవాటు చేసుకోదగినది.
‘వాబి-సాబి’ అనేది ఒక అద్భుతమైన జపనీస్ జీవన తత్వం. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు.. ఏదీ పర్‌ఫెక్ట్ కాదు. జీవితంలో లోపాలను, కాలానుగుణంగా వచ్చే మార్పులను కూడా జీవితంలో భాగంగా స్వీకరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం, క్రమశిక్షణ, ప్రకృతితో అనుబంధం, మానసిక ప్రశాంతత వంటి విలువలను జపనీయులు తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు. వారి ఈ జీవన సూత్రాల్లో కొన్నింటినైనా మనం అలవర్చుకుంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆనందం, సంతృప్తి కలుగుతుంది. చిన్న చిన్న మార్పులతో ప్రారంభిస్తే, పెద్ద విజయాలు సాధించడం కష్టమేమీ కాదు.
Also Read: కొత్త జీవితం కావాలా..? పాము నేర్పించే గొప్ప జీవిత పాఠం నేర్చుకోండి..