
మనం తరచుగా ఇంట్లో కొబ్బరి కాయలు కొడుతుంటాం. పచ్చి కొబ్బరి మనందరి ఇళ్లల్లోనూ లభిస్తుంది. ఒక్కోసారి ఇది ఎండిపోతుంది. అలా ఎండిన కొబ్బరను పారవేసే బదులు మీరు ఇంట్లోనే సులభంగా స్వచ్ఛమైన, సువాసనగల కొబ్బరి నూనెను తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారుచేసిన నూనె చాలా నెలల పాటు చెడిపోదు. దీని సువాసన కూడా చాలా ఎక్కువగా, తాజాగా ఉంటుంది. అది మీ ఇళ్లంతా వ్యాపిస్తుంది. ఈ నూనెను మీ ముఖానికి రాసుకోవడం వల్ల మీ ముఖం మెరుస్తుంది. ఈ నూనె చర్మం, జుట్టుకు చాలా మేలు చేస్తుంది. ఇంట్లోనే ఆరోగ్యకరమైన రీతిలో కొబ్బరినూనె తయారు చేసుకోవటం ఎలాగో మీరూ ఓ లుక్కేయండి.
ఇంటి వద్దే స్వచ్ఛమైన ఆర్గానిక్ కొబ్బరి నూనె తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో దొరికే నూనెల్లో కల్తీ ఉండే అవకాశం ఉన్నందున, ఎండుకొబ్బరితో మిక్సీలోనే సులభంగా తయారు చేయడం మంచిది. ఇది వంటకు, జుట్టు సంరక్షణకు, చర్మానికి ఎంతో ఉపయోగకరం. దీనికి కావలసిన పదార్థాలు:
ఎండుకొబ్బరి ముక్కలు – 2 కప్పులు
గోరువెచ్చని నీరు – అవసరమైనంత
మిక్సీ గ్రైండర్
పలుచటి వస్త్రం లేదా ఫిల్టర్
తయారీ విధానం: ముందుగా, ఎండుకొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకోవాలి. కొద్దిగా గోరువెచ్చని నీరు వేసి మెత్తగా పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. ఇది కొబ్బరి పాలుగా మారుతుంది. ఈ పేస్ట్‌ను పలుచటి వస్త్రంతో వడకట్టి పాలు తీసుకోవాలి. బాగా పిండి పూర్తిగా పాలు తీసేయాలి. ఈ కొబ్బరి పాలను మందపాటి గిన్నెలో వేసి మెల్లగా మరిగించాలి. కొద్దిసేపటికి పాలు మరిగి పైభాగంలో నూనె వేరుపడుతుంది. కింద భాగంలో ముద్దలా మిగులుతుంది. నూనె పూర్తిగా వేరైన తర్వాత చల్లారనివ్వాలి. తర్వాత ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.
ఉపయోగాలు: ఇలా ఇంట్లోనే తయారు చేసుకున్న కొబ్బరి నూనె వంటల్లో కూడా ఉపయోగించవచ్చు. జుట్టుకు అప్లై చేస్తే బలంగా, మెరిసేలా చేస్తుంది. చర్మానికి మాయిశ్చరైజర్‌లా పనిచేస్తుంది. అయితే, ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం తప్పనిసరి. నూనెను తయారు చేయటానికి మంట ఎక్కువగా ఉండకూడదు, లేకపోతే నూనె మాడిపోయే అవకాశం ఉంటుంది. పూర్తిగా చల్లారిన తర్వాతే నిల్వ చేయాలి. నీరు తగలకుండా ఉంచాలి.
ఇలా ఎండుకొబ్బరి నుంచి ఇంట్లోనే తయారు చేసే కొబ్బరి నూనె స్వచ్ఛమైనది. ఆరోగ్యకరమైనది. కొద్దిపాటి సమయం, సరైన విధానం పాటిస్తే సహజమైన ఆర్గానిక్ నూనె మీ చేతుల్లోకి వస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..