
శీతాకాలం రాగానే మన ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తాయి. ఈ చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి, రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా, సూపర్‌ఫుడ్‌గా పిలువబడే బాదం పప్పులను ఈ సీజన్లో క్రమం తప్పకుండా తింటే అసాధారణమైన ఆరోగ్య లాభాలను పొందవచ్చు. బాదంలో విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రొటీన్లు, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి.
చలికాలంలో జలుబు, దగ్గు, వైరల్ ఫీవర్స్ వంటి సమస్యలు సర్వసాధారణం. బాదంలో ఉండే విటమిన్-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, సీజనల్ వ్యాధుల బారి నుంచి రక్షిస్తాయి.
బాదంలో మోనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ క్రమం తప్పకుండా బాదం తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది.
చలికాలంలో చలిగాలుల కారణంగా చర్మం పొడిబారి నిర్జీవుగా మారుతుంది. బాదంలోని విటమిన్-ఇ, ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మానికి లోపలి నుంచి పోషణనిచ్చి, చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా ఉంచుతాయి.
బాదం తింటే బుర్ర చురుగ్గా పనిచేస్తుంది అని పెద్దలు చెప్పడంలో శాస్త్రీయ నిజం ఉంది. బాదంలో ఉండే రైబోఫ్లేవిన్ మరియు ఎల్-కార్నిటైన్ వంటి పోషకాలు జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచడంలో ఎంతో తోడ్పడతాయి.
చలికాలంలో చాలామంది శారీరక శ్రమ తగ్గడం వల్ల బరువు పెరుగుతుంటారు. బాదంలో ఉండే ఫైబర్ మరియు ప్రొటీన్ ఎక్కువసేపు కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన తిళ్లను నియంత్రిస్తుంది. అలాగే దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్నవారికి కూడా ఇది సురక్షితమైన స్నాక్.
బాదంను నేరుగా తినడం కంటే, రాత్రిపూట నీటిలో నానబెట్టి, ఉదయం పొట్టు తీసి తినడం వల్ల పోషకాలు శరీరానికి పూర్తిగా అందుతాయి. రోజుకు ఒక గుప్పెడు (సుమారు 20-23 బాదంలు) తినడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఈ శీతాకాలంలో మీ దైనందిన ఆహారంలో బాదమ్‌ను భాగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి.