మీ అత్తగారికి కూడా పదవిచ్చాను..బాబుపై జగన్ ఆగ్రహం

పాలక ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చలు, హాట్ హాట్ కామెంట్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిరేపుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య జరుగుతున్న మాటల యుద్దం ఆద్యంతం సభా కార్యక్రమాలను రక్తికట్టిస్తున్నాయి. ఈ తరహా వాదోపవాదాలు, ఛలోక్తులు బుధవారం ఏపీ శాసనసభలో ఎన్నో చోటుచేసుకున్నాయి. సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే స్పీకర్ తీరుపైనా, మార్షల్స్‌పైనా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో చిచ్చు రేపాయి. స్పీకర్ పదవిని, […]

  • Rajesh Sharma
  • Publish Date - 1:16 pm, Wed, 11 December 19
మీ అత్తగారికి కూడా పదవిచ్చాను..బాబుపై జగన్ ఆగ్రహం

పాలక ప్రతిపక్షాల మధ్య వాడీవేడీ చర్చలు, హాట్ హాట్ కామెంట్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఆసక్తిరేపుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి, సభానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు మధ్య జరుగుతున్న మాటల యుద్దం ఆద్యంతం సభా కార్యక్రమాలను రక్తికట్టిస్తున్నాయి. ఈ తరహా వాదోపవాదాలు, ఛలోక్తులు బుధవారం ఏపీ శాసనసభలో ఎన్నో చోటుచేసుకున్నాయి.

సభా కార్యక్రమాలు ప్రారంభం కాగానే స్పీకర్ తీరుపైనా, మార్షల్స్‌పైనా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సభలో చిచ్చు రేపాయి. స్పీకర్ పదవిని, ఆ పదవిలో వున్న వ్యక్తిని చంద్రబాబు కించ పరిచారంటూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు సభలో గందరగోళం సృష్టించారు. స్పీకర్ తమ్మినేని సీతారామ్ సైతం చంద్రబాబు లాంటి 40 ఇయర్స్ ఇండస్ట్రీ సీనియర్లు స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంలో చంద్రబాబు ముఖ్యమంత్రిపైనా, ముఖ్యమంత్రి జగన్ విపక్ష నేతపైనా చేసిన కామెంట్లు సభను వేడెక్కించడంతోపాటు.. సభలో నవ్వులు పూయించాయి. చంద్రబాబు వైఖరిని ఎండగడుతూ సీఎం జగన్.. బాబు గారు తమ అత్తగారికి (లక్ష్మీ పార్వతి) కూడా న్యాయం చేయలేకపోయారని, కనీస పదవి ఇచ్చి గౌరవించలేకపోయారని… కానీ తాము చంద్రబాబు అత్తగారికి గౌరవప్రదమైన పదవి ఇచ్చి గౌరవించామని వ్యాఖ్యానించారు.

నామినేటెడ్ పదవుల పంపిణీలో సామాజిక న్యాయం జరగలేదంటూ టిడిపి సభ్యులు చేసిన కామెంట్లపై జగన్ పై విధంగా స్పందించడంతో సభలో నవ్వులు విరిశాయి. పదవుల పంపకంలో కమ్మ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని టిడిపి సభ్యులు గోరంట్ల తదితరులు చేసిన కామెంట్లపై జగన్ స్వయంగా రెస్పాండయ్యారు. 50 శాతం పదవులు బలహీన వర్గాలకు ఇచ్చామని జగన్ గణాంకాలను వివరించారు.

లెక్కల వివరాలు ఎలా వున్నా చంద్రబాబుపై జగన్ చేసిన మాటల యుద్దం సభ కార్యక్రమాలను రక్తికట్టించింది.