టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి.. బాధ్యతల స్వీకారం

|

Oct 04, 2020 | 1:18 PM

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కార్యనిర్వహణాధికారిగా ధర్మారెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సంయుక్త కార్యనిర్వహణాధికారిగా వున్న ధర్మారెడ్డి..

టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి.. బాధ్యతల స్వీకారం
Follow us on

TTD new executive officer Dharmareddy: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కార్యనిర్వహణాధికారిగా ధర్మారెడ్డి ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం సంయుక్త కార్యనిర్వహణాధికారిగా వున్న ధర్మారెడ్డి.. కొత్త కార్యనిర్వహణాధికారి (ఈవో) వచ్చే వరకు తాత్కాలికంగా పదవిలో కొనసాగుతారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మేరకు మొన్నటి వరకు ఈవోగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ బదిలీ అయ్యారు. ఏకే సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించారు చీఫ్ సెక్రెటరీ నీలం సహానీ.

2017 మే 6వ తేదీన టీటీడీ ఈవోగా నియమితులైన అనిల్ కుమార్ సింఘాల్ ప్రతీ వారం స్వామి వారికి తలనీలాలు సమర్పిస్తూ అందరి దృష్టిని ఆకర్షించారు. నిజానికి టీటీడీ ఈవోగా నియమితులైన తొలి నాన్ తెలుగు వ్యక్తి, ఉత్తరాది ఐఏఎస్ అధికారి ఏకే సింఘాలే. ఉత్తరాది లాబీని వినియోగించుకుని ఆయన టీటీడీ ఈవోగా నియమితులయ్యారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.

అయితే, 2019 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వ పగ్గాలు చేతులు మారి వైసీపీ అధికారంలోకి వచ్చినప్పట్నించి టీటీడీకి కొత్త ఈవో వస్తారని, సింఘాల్‌ను మారుస్తారని ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ముఖ్యమంత్రి వెంటనే బదిలీ వంటి చర్యలకు ఉపక్రమించలేదు. తాజాగా జరిగిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా అనిల్ కుమార్ సింఘాల్‌ను ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు.

అయితే కొత్త ఈవో విషయంలో ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంతో ప్రస్తుతం టీటీడీ అదనపు ఈవోగా వున్న ధర్మారెడ్డి తాత్కాలిక ఈవోగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. అయితే, ప్రస్తుతం ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శగా వ్యవహరిస్తున్న జవహర్ రెడ్డిని టీటీడీ ఈవోగా నియమిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే వరకు ధర్మారెడ్డి ఈవోగా కొనసాగుతారు.

Also Read: స్టీల్ సిటీ దిశగా వడివడిగా మెట్రోరైల్