స్టీల్ సిటీ దిశగా వడివడిగా మెట్రోరైల్

స్టీల్ సిటీ వైజాగ్ దిశగా మెట్రో రైలు ప్రాజెక్టు వడివడిగా పరుగులు పెడుతోందా? విజయవాడ మెట్రో ప్రాజెక్టు కంటే ముందుగానే విశాఖ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయా?

స్టీల్ సిటీ దిశగా వడివడిగా మెట్రోరైల్
Follow us

|

Updated on: Oct 04, 2020 | 1:13 PM

Metro Rail moving towards to Vizag city: స్టీల్ సిటీ వైజాగ్ దిశగా మెట్రో రైలు ప్రాజెక్టు వడివడిగా పరుగులు పెడుతోందా? విజయవాడ మెట్రో ప్రాజెక్టు కంటే ముందుగానే విశాఖ మెట్రో పనులు ప్రారంభం కానున్నాయా? పరిస్థితులు, పరిణామాలు, మంత్రుల మాటలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. విశాఖపట్నంలో త్వరలో మెట్రో రైలు కార్యాలయం ప్రారంభం కానున్నది. అదే సమయంలో విశాఖ మెట్రో ప్రాజెక్టు డీపీఆర్‌కు తుది రూపు రానున్నది.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధాని ఖారారైన దరిమిలా విజయవాడ, విశాఖపట్నం నగరాలకు మెట్రో రైలు ప్రాజెక్టులు వస్తాయంటూ ప్రభుత్వం చెబుతూ వస్తోంది. చంద్రబాబు హయాంలో అమరావతి-విజయవాడ-గుంటూరు మధ్య వేగంగా రవాణా వ్యవస్థ వుండాలని భావించి.. దానికి అనుగుణంగా మెట్రో రైలు ప్రాజెక్టుపై డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టు రూపొందించే పనులు మొదలు పెట్టారు. అదే సమయంలో ఉత్తరాంధ్రకు సమన్యాయం చేస్తామంటూ విశాఖపట్నంకు కూడా మెట్రో రైలును ప్రతిపాదించారు.

అయితే, 2019 ఎన్నికల తర్వాత పరిస్థితి మారిపోయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి… రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించారు. కరోనా వచ్చి.. మూడు రాజధానుల ప్రతిపాదనను కాస్త నెమ్మదించింది గానీ… తొలి రోజుల్లో జగన్ చూపిన వేగానికి ఈపాటికి విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటయ్యి వుండేది. కరోనాకు తోడు కోర్టు వ్యాజ్యాలు కూడా మూడు రాజధానుల ప్రతిపాదనను నెమ్మదించిన విషయం అందరికీ తెలిసిందే.

అయితే, రాజధాని విషయంలో తలెత్తిన వివాదాలు ఎలా వున్నా.. ముఖ్యమంత్రి మాత్రం మూడు రాజధానుల ప్రతిపాదనకే మొగ్గు చూపుతున్నారు. అందుకే చాపకింద నీరులా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ తరలింపు కార్యక్రమం కొనసాగిస్తూనే వున్నారు. ఈ విషయం రాష్ట్ర మంత్రులు అడపాదడపా చేసే ప్రకటనల ద్వారా వెల్లడవుతూనే వుంది.

తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం చేసిన వ్యాఖ్యలు విశాఖపై ప్రభుత్వాధినేతల ప్రత్యేక ప్రేమను చాటింది. విశాఖపట్నంలో త్వరలోనే మెట్రో రైలు కార్యాలయం ప్రారంభమవుతుందని బొత్స ప్రకటించారు. దాంతో విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో చర్యలు వేగంగా చోటుచేసుకుంటున్నాయని, స్టీల్ సిటీలో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు చర్యలు వడివడిగా పడుతున్నాయని అర్థమవుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.