తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభంపై విద్యాశాఖ ప్రతిపాదనలు.. ఇవాళ సమీక్షించనున్న సీఎం కేసీఆర్

9,10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ సంబంధించిన తరగతుల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు

  • Balaraju Goud
  • Publish Date - 6:03 am, Mon, 11 January 21
తెలంగాణలో విద్యాసంస్థల పునః ప్రారంభంపై విద్యాశాఖ ప్రతిపాదనలు.. ఇవాళ సమీక్షించనున్న సీఎం కేసీఆర్

Telangana Schools after Sankranti: కరోనా పుణ్యామాన్ని తాళాలు పడ్డ విద్యాసంస్థలను మెల్లమెల్లగా తెరిచేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందులో భాగంగా సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ముందుగా ఉన్నత తరగతుల విద్యార్థులను మాత్రమే అనుమతించాలని భావిస్తోంది. తొలుత 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు మాత్రమే క్లాస్‌రూమ్‌ల్లో విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. 9,10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్‌ తదితర కోర్సులకు సంబంధించిన తరగతుల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. అదీ కూడా పలు షరతులతో అనుమతించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించే అంశంపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అలాగే, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై సైతం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది.

కోవిడ్‌–19 మహమ్మారి కారణంగా ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచిపోయినా, ఇంకా ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. 3వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే 9వ తరగతి, ఆపై విద్యార్థుల కోసం తరగతి గది బోధనలను ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ విద్యాసంస్థలు తెరిచి క్లాసు రూంల్లో బోధించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది.

రాష్ట్రంలో సైతం ఈ నెల 18 నుంచి 9వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించడమే మంచిదని రాష్ట్ర విద్యా శాఖ… ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వా నికి నివేదించింది. సోమవారం నిర్వహించనున్న సమీక్షలో సీఎం కేసీఆర్‌ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. పునఃప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే… ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన ప్రణాళికలను రూపొందించి ప్రకటించాలని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తోంది. విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను అంచనా వేయాలని ప్రభుత్వం భావిస్తోంది.