రాజీనామాకు సోనియా సిధ్ధం ? నిజం కాదంటున్న విధేయ వర్గం !

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసినట్టు చెబుతున్న లేఖ పెను దుమారాన్ని సృష్టించింది. నాయకత్వ మార్పుపై వీరంతా తమ లేఖలో..

రాజీనామాకు సోనియా సిధ్ధం ? నిజం కాదంటున్న విధేయ వర్గం !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 23, 2020 | 5:38 PM

కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటూ 23 మంది సీనియర్ నేతలు పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రాసినట్టు చెబుతున్న లేఖ పెను దుమారాన్ని సృష్టించింది. నాయకత్వ మార్పుపై వీరంతా తమ లేఖలో అదేపనిగా పేర్కొన్నారని, పార్టీ అంతర్గత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోందనడానికి ఇదే సంకేతమని అంటున్నారు. ఈ లేఖ పర్యవసానంగా సోనియా రాజీనామాకు సిధ్ధపడ్డారని, సోమవారం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తన నిర్ణయాన్ని ప్రకటిస్తారని తెలుస్తోంది. అయితే ఇదే సమయంలో అసలు సోనియా ఆ లేఖ చూడలేదని ఆమె విధేయవర్గం చెబుతోంది. ఏమైనా..తాత్కాలిక అధ్యక్షురాలిగా తన ఏడాది కాలం పూర్తయిందని, పైగా తన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇక పదవిలో కొనసాగలేనని సోనియా వ్యాఖ్యానించినట్టు కూడా తెలియవచ్చింది. కాగా- సీనియర్ నేతలు తమ లేఖలో ‘ఆత్మపరిశీలన’, ‘సమిష్టి నాయకత్వం’, ‘యువతకు ప్రాధాన్యం’ వంటి పదాలను ఎక్కువగా వాడినట్టు సమాచారం, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి కొత్త సభ్యులను ఎన్నుకోవాలని కూడా వారు కోరినట్టు తెలుస్తోంది.

రాహుల్ గాంధీకి తిరిగి పార్టీ పగ్గాలు అప్పగించాలని కొందరు సూచిస్తున్నా..అయన ఇదివరకే ఇందుకు తన విముఖతను ప్రకటించిన విషయం గమనార్హం. పార్టీ నాయకత్వంలో మార్పును కోరుతూ 100 మంది పార్టీ నేతలు సోనియాకు లేఖ రాశారన్న మాజీ నేత సంజయ్ ఝా వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ కొట్టిపారేసింది. పార్టీ అధికార ప్రతినిధి పదవి నుంచి ఆయనను గత  నెలలో తొలగించిన సంగతి విదితమే. ఏమైనా ఆన్ లైన్ ద్వారా రేపు జరిగే సిడబ్ల్యుసీ సమావేశం..హాట్ హాట్ గా జరిగే సూచనలున్నాయి. ప్రధానంగా పార్టీ నాయకత్వ మార్పుపై కొంతమంది నేతలు రాసిన లేఖే మెయిన్ అజెండాగా ఉండవచ్చు.