Prakasham Politics: హీటెక్కుతున్న ప్రకాశం పాలిటిక్స్

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 5:46 PM

అధినేతలిద్దరు ప్రకాశం జిల్లాపై ఫోకస్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు ఆ జిల్లా పర్యటనకు వెళుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ వెలిగొండ ప్రాజెక్టును సందర్శిస్తే.. చంద్రబాబు ప్రజా చైతన్య బస్ యాత్రతో పర్యటనకొచ్చారు. ఇద్దరి దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపైనే అని తెలుస్తోంది.

Prakasham Politics:  హీటెక్కుతున్న ప్రకాశం పాలిటిక్స్
Follow us on

Jagan and Chandrababu focused on Prakasham district: ప్రకాశం జిల్లాలో అధినేతల వరుస పర్యటనలు కాక రేపుతున్నాయి.. స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా టీడీపీ ప్రజా చైతన్య బస్సుయాత్రల పేరుతో ప్రచారానికి తెరలేపితే… అభివృద్ధే లక్ష్యంగా ప్రజలను ప్రభావితం చేసే దిశగా వైసీపీ పావులు కదుపుతుండటంతో జిల్లాలో పొలిటికల్ హీట్ రాజుకుంది. ఎన్నికలకు ముందే ప్రధాన పార్టీల వ్యూహాలు ఎత్తుగడలతో దూసుకు పోయేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఒక రోజు తేడాతో ప్రకాశం జిల్లాలో రెండు ప్రధాన పార్టీల నేతలు పర్యటించడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రజా చైతన్య యాత్ర పేరిట టీడీపీ అధినేత చంద్రబాబు జిల్లాలోని పర్చూరు, అద్దంకి, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించారు. కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దం చేసేవిధంగా చంద్రబాబు బస్సుయాత్ర సాగింది. తొమ్మిది నెలల్లో ప్రభుత్వం చేసిన పనులను విమర్శిస్తూ చంద్రబాబు ముందుకుసాగారు. జగన్‌ సర్కార్‌పై ఆరోపణలు గుప్పించారు.

చంద్రబాబు బస్సుయాత్ర చేపట్టిన మరుసటిరోజే ప్రకాశం జిల్లాలోనే సీఎం జగన్‌ పర్యటించారు. దోర్నాల మండలం కొత్తూరు దగ్గర అప్పటి వైఎస్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెలుగొండ ప్రాజెక్టు పనులను సీఎం పరిశీలించారు. పనులను వేగవంతం చేసి మొదటి దశ పనులను ఈ ఏడాది ఆగస్టు కల్లా పూర్తి చేసి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించాలని అధికారులను ఆదేశించారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి, రెండవ టన్నెల్‌ పనులు, ప్యాకేజీలు, పునరావాస కాలనీల్లో చేపట్టాల్సిన పనుల విషయంలో అధికారులకు దశా, దిశ నిర్దేశం చేశారట… అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయకుంటే సంబంధిత అధికారులను బాధ్యులను చేస్తామని సమీక్షా సమావేశంలో అధికారులకు గట్టిగా చేప్పేశారట.

దీంతో అధికారులు వెలుగొండ ప్రాజెక్టు విషయంలో ఉరుకులు , పరుగులు పెడుతున్నారు. వైసిపి ప్రభుత్వంపై టిడిపి చేస్తున్న అసత్య ప్రచారాలను అభివృద్ది, సంక్షేమ పధకాలు అమలుతీరుతో గట్టిగా సమాధానం ఇవ్వాలని వైసిపి నేతలకు సిఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారట. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగనున్న వేళ అటు టీడీపీ, ఇటు వైసీపీ అధినాయకులు తమ ప్రచారాన్ని ప్రకాశం జిల్లా వేదికగా మొదలుపెట్టడం జిల్లాలో చర్చకు దారి తీసింది.

Read this: TDP is unable to find an alternative to Vallabhaneni Vamsi in Gannavaram