తవ్వేకొద్దీ కిడ్నీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. విశాఖ కిడ్నీ రాకెట్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. విచారించే కొద్దీ శ్రద్ధ ఆసుపత్రి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. విశాఖకు చెందిన ఓ మహిళను పేషంట్ భార్యగా చూపించి కిడ్నీ మార్పిడి చేస్తున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ కిడ్నీని బెంగళూరుకు చెందిన మరో వ్యక్తికి కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. అయితే ఇదంతా నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి కిడ్నీ మార్పిడి చేసినట్లుగా విచారణలో తేలింది.
కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటికే శ్రద్ధ హాస్పిటల్ ఎండీ సహా నలుగురిని సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఈ కిడ్నీ రాకెట్ ముఠా దాదాపు 20కి పైగా కేసుల్లో అక్రమాలకు పాల్పడినట్లు సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో ఇంకేంత మంది పాత్ర ఉందనే దానిపై కూపీ లాగుతున్నారు. దీనికి సంబంధించి నిందితులెవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదంటున్నారు సిట్ అధికారులు.
కిడ్నీ రాకెట్‌లో సెంటర్ పాయింట్‌గా ఉన్న శ్రద్ధ ఆస్పత్రిలో 2012 నుంచే కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నట్లు తేలింది. కాగా, ఇప్పటివరకు 66 ఆపరేషన్లు చేసినట్లు సోదాల్లో వెల్లడైంది. వీటిలో 16 ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేయగా.. మిగిలినవి డబ్బులు తీసుకుని చేసినట్లు విచారణ టీమ్ గుర్తించింది. ఈ వ్యవహారం పై కొద్ది రోజులుగా విచారణ చేపట్టిన కమిటీ అక్కడ జరిగిన వ్యవహారాలపై 30 ప్రశ్నలతో కూడిన ప్రశ్నావళిని ముందే సిబ్బందికి అందించింది. వాటికి సమాధానాలతో పాటు, రికార్డులను అందించాలని ఆదేశించింది.