KCR to test MLAs: ఎమ్మెల్యేలకు కేసీఆర్ లిట్మస్ టెస్ట్

|

Feb 22, 2020 | 12:37 PM

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కేసీఆర్ పరీక్ష పెట్టబోతున్నారు. ఇది అలాంటిలాంటి పరీక్ష కాదని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ దక్కుతుందా లేదా తేల్చేసే పరీక్ష పెట్టేందుకు గులాబీ బాస్ రెడీ అవుతున్నారని తెలంగాణ భవన్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

KCR to test MLAs: ఎమ్మెల్యేలకు కేసీఆర్ లిట్మస్ టెస్ట్
Follow us on

KCR litmus test for TRS MLAs soon: తెలంగాణ ఎమ్మెల్యేలకు పరీక్ష పెట్టబోతున్నారు గులాబీ బాస్ కేసీఆర్. ఏడాదిన్నరగా వరుస ఎన్నికలతో బిజీగా వున్న ఎమ్మెల్యేలు ఇక మిగిలిన మూడున్నర సంవత్సరాల పాటు ప్రజా సేవలోనే తరించాలని కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యేలకు ఉద్బోధించారు. అయితే, తన ఆదేశాలకు అనుగుణంగా ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో పని చేస్తున్నారా లేదా తెలుసుకునేందుకు ఆయన పరీక్ష నిర్వహించేందుకు సిద్దమవుతున్నారు.

2018 డిసెంబర్‌లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత స్థానిక సంస్థలు, లోక్‌సభ, మునిసిపాలిటీలు, సహకార ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పనిచేస్తూ వచ్చారు. మరీ ముఖ్యంగా మునిసిపల్ ఎన్నికల బాధత్యలను పూర్తిగా ఎమ్మెల్యేలపై మోపారు గులాబీ అధినేత కేసీఆర్. ఈ నేపథ్యంలో ఎన్నికలు అన్ని ముగిసి పోయినందున ఇక వచ్చే మూడున్నర సంవత్సరాలు ప్రజా సేవపైనే దృష్టి పెట్టడం ద్వారా వచ్చే ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ పార్టీ మూడోసారి కూడా విజయం సాధించే దిశగా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు కేసీఆర్.

ఇందులో భాగంగా ఎమ్మెల్యేల పనితీరును అంఛనా వేసేందుకు లిట్మస్ టెస్ట్ నిర్వహించేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని ప్రధాన అంశాలను ఎంపిక చేసుకున్న కేసీఆర్.. వాటి ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరుపై ప్రొగ్రెస్ రిపోర్టు ప్రిపేర్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రొగ్రెస్ రిపోర్టు ఆధారంగానే కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వాలా లేక కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలా అన్నది నిర్ణయిస్తారని చెప్పుకుంటున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా కేసీఆర్ సొంతంగా చేయించుకున్న సర్వే ఆధారంగానే ఒకేసారి 105 సెగ్మెంటలకు ఒకేసారి టిక్కెట్లను ప్రకటించేశారు. వచ్చే ఎన్నికల్లో మరింత పకడ్బందీగా టిక్కెట్ల కేటాయింపు జరపాలని భావిస్తున్న కేసీఆర్.. అందుకు లిట్మస్ టెస్టుకు రెడీ అవుతున్నారని అంటున్నారు. వచ్చేసారి కేటీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న కేసీఆర్.. అందుకు అనుగుణంగా వ్యూహరచన చేస్తున్నారని, అందులో భాగమే లిట్మస్ టెస్టు అని తెలుస్తోంది.

Read this: Huge competition for Rajyasabha tickets in TRS