నేపాల్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సింధూపాల్ చౌక్ ప్రాంతంలో జరిగిన బస్సు ప్రమాదంలో 14 మంది మృతి చెందగా.. మరో 98 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 120 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు.. ప్రమాదవశాత్తు లోయలో పడింది. అతి వేగంగా వెళ్తుండగా.. అకస్మాత్తుగా టైర్ పంక్చర్ అవ్వడంతో.. అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలో పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను స్థానిక ధూలీఖేల్, షీర్ మెమోరియల్, ఖాట్మాండ్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనలో 14మంది అక్కడికక్కడే మరణించగా, 98 మంది గాయపడ్డారని పోలీస్ అధికారి తెలిపారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడం.. బస్సు డ్రైవర్ అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు.