AP Volunteers: వాలంటీర్లకు ఏపీ సర్కార్ వార్నింగ్.. అలా అయితే పోస్ట్ అవుట్

| Edited By: Janardhan Veluru

Oct 21, 2021 | 3:00 PM

స్పందనపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయని సీఎం చెప్పారు.

AP Volunteers: వాలంటీర్లకు ఏపీ సర్కార్ వార్నింగ్.. అలా అయితే పోస్ట్ అవుట్
Ap Volunteers
Follow us on

స్పందనపై  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు బాగా మెరుగుపడ్డాయని సీఎం చెప్పారు.  తనిఖీలకు వెళ్లినప్పుడు రిజిస్టర్‌ పరిశీలన తప్పనిసరి అని సూచించారు. తనిఖీలకు వెళ్లినప్పుడు గతంలో దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించామా?  లేదా? చూడాలన్నారు. రిజిస్టర్‌లో పేర్కొన్న అంశాలను సచివాలయాల విభాగాధిపతికి పంపించాలన్నారు.  అలాగే ఏదైనా పరిష్కరించాల్సిన కొత్త అంశాన్ని గుర్తిస్తే.. వాటిని కూడా రిజస్టర్‌లో నమోదు చేయాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాలను తనిఖీ చేసినప్పుడు గుర్తించిన అంశాలు, సమస్యలను పరిష్కరిస్తున్నారా? లేదా ?వాటిపై దృష్టిపెడుతున్నారా? లేదా? అన్నదానిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. దీనికి సంబంధించిన ప్రోటోకాల్‌ను తయారు చేయాలన్నారు. ఆ ప్రోటోకాల్‌ను పాటిస్తున్నారా? లేదా?కచ్చితంగా చూడాలన్నారు.  దాదాపు 80శాతం సచివాలయాల ఉద్యోగులు మంచి పనితీరు కనపరుస్తున్నారని తనిఖీల ద్వారా వెల్లడైందన్నారు. మిగిలిన 20 శాతం మంది సచివాలయాల సిబ్బంది కూడా వారి పనితీరును మెరుగుపరుచుకునేలా మనం వారికి తోడ్పాటును అందించాలని సూచించారు. నూటికి నూరు శాతం గ్రామ, వార్డు సచివాలయాలు మంచి పనితీరును చూపించేలా సిబ్బందికి తగిన చేయూతను, తోడ్పాటును అందించాలని సీఎం ఆదేశించారు.

వాలంటీర్ల సేవలపైనా కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వారు మెరుగైన సేవలు అందించేలా వారికి కౌన్సెలింగ్‌ చేయాలన్నారు.  వారు అప్‌గ్రేడ్‌ అయ్యేలా చూడాలని.. అందుకు వారికి చేయూతనిచ్చి.. తీర్చిదిద్దాలని సూచించారు.  అప్పటికీ కూడా సేవలను అందించడంలో వారు ప్రమాణాలను అందుకునే రీతిలో లేకపోతే వారిని తొలగించి కొత్తవారిని పెట్టాలన్నారు.  ఖాళీగా ఉన్న వాలంటీర్‌ పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు.

అలాగే సచివాలయాలకు అందుతున్న విజ్ఞాపనలు, వినతుల పరిష్కారంపై కూడా దృష్టిపెట్టాలని సీఎం జగన్ సూచించారు. సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమం అక్టోబరు 29, 30 తేదీల్లో చేపట్టాలని సూచించారు. సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు.. బృందాలుగా ఏర్పడి వారి పరిధిలోని ప్రతి కుటుంబాన్ని కలవాలన్నారు.  గతంలో జరిగిన అవుట్‌రీచ్‌ కార్యక్రమంలో కొన్నిచోట్ల కేవలం వాలంటీర్లు మాత్రమే కలిసినట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. కచ్చితంగా సచివాలయాల ఉద్యోగులు, వాలంటీర్ల బృందాలుగా ఏర్పడి… కుటుంబాలను కచ్చితంగా కలవాలని సూచించారు. నెలలో ప్రతి బుధవారం గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో కచ్చితంగా సమావేశాలు జరగాలన్నారు. ఇందులో సిబ్బంది, వాలంటీర్లు ఈ సమావేశాల్లో పాల్గొనాలని సూచించారు. సచివాలయాల్లోని మౌలిక సదుపాయాలు, పరికరాలు కచ్చితంగా పనిచేస్తున్నాయా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని ఆదేశించారు. మొబైల్స్, గౌరవవేతనం, సీఎఫ్‌ఎంస్‌ ఐడీలు, సిమ్‌కార్డులు, ఫింగర్‌ప్రింట్‌ స్కానర్లు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలన్నారు. నెలలో రెండో బుధవారం మండలం లేదా యూఎల్‌బీ స్థాయిలో సమావేశం జరగాలన్నారు. నెలలో మూడో బుధవారం జిల్లా స్థాయిలో సమావేశం కావాలన్నారు.  నాలుగో బుధవారం రాష్ట్ర స్థాయిలో సచివాలయాల విభాగానికి చెందిన కార్యదర్శి సమావేశం కావాలని సూచించారు. ప్రతి ఏటా రెండు సార్లు జూన్, డిసెంబరుల్లో పెన్షన్లు, రేషన్‌కార్డులు, పట్టాలు తదితర పథకాలకు సంబంధించి మంజూరు ఉంటుందన్నారు.

Also Read: రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఈ నెలలోనే రెండో విడుత రైతు భరోసా నిధులు విడుదల

 కూకట్‌పల్లి కోర్టులో సమంత పిటిషన్.. ‘బాధలో ఉంటే గద్దల్లా పొడుస్తున్నారు’.. మనసున ఎంతో ఆవేదన