
ఆయుధాల కంటే సమాచారమే అత్యంత శక్తివంతంగా మారుతున్న ప్రస్తుత రోజుల్లో ప్రపంచ దేశాల ఇంటెలిజెన్స్ సంస్థల పాత్ర కీలకంగా మారుతోంది.
ప్రపంచంలోని అగ్రరాజ్యాల వెనుక ఒక అదృశ్య శక్తి నిరంతరం పనిచేస్తుంటుంది. సామాన్య ప్రజలకు ఏమాత్రం తెలియకుండానే ప్రపంచ వ్యాప్తంగా సమాచారాన్ని సేకరిస్తూ, ముప్పులను ట్రాక్ చేస్తూ, తమ దేశ ప్రయోజనాలను కాపాడటంలో గూఢచారి సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకునేలా చేయడంలో వీటిదే ప్రధాన పాత్ర. అమెరికాకు చెందిన సీఐఏ (CIA), బ్రిటన్ కు చెందిన ఎంఐ6 (MI6), ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ (Mossad) లాంటివి ప్రపంచవ్యాప్తంగా అత్యంత రహస్య కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటితో పాటు రష్యాకు చెందిన ఎఫ్ఎస్బీ (FSB), భారత్ కు చెందిన ‘రా’ (RAW), చైనా ఎంఎస్ఎస్ (MSS), పాకిస్థాన్ ఐఎస్ఐ (ISI), ఫ్రాన్స్ కు చెందిన డీజీఎస్ఈ (DGSE) లాంటి సంస్థలు తెరవెనుక సైలెంట్ గా వ్యూహాలను రచిస్తున్నాయి.
వీటిలో ఇజ్రాయిల్ ముసాద్ మోస్ట్ పవర్ ఫుల్ స్పై. 20-30 ఏళ్లు ఒకే ప్రాంతంలో ఉంది నిఘా నిర్వహిస్తారు. వీరిపై అనుమానం రావడం దాదాపు అసాధ్యం. ఇక అమెరికన్ CIA పనితీరు మరోరకంగా ఉంటుంది. టెక్నాలజీ ఎక్కువగా వినియోగిస్తారు. ఆయా దేశాలకు చెందిన పౌరులను గూఢచారిలుగా నియమించుకోవడంలో CIA టాప్. వారి వేలితో వారి కన్నునే పొడిచేస్తారు. రష్యాకు చెందిన FSB పనితీరు పూర్తి భిన్నం. FSB అధికారులు ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించడంలో దిట్ట.. వారికి కావాల్సిన సమాచారం కావలిసిన దేశం నుంచి అధికారుల నుంచే రహస్యంగా తెలుసుకుంటారు..
కేవలం సరిహద్దుల భద్రతే కాకుండా ఉగ్రవాద నిర్మూలన, సైబర్ దాడుల నివారణ, భౌగోళిక రాజకీయాల్లో తమ దేశాల ప్రాబల్యాన్ని పెంచడం వంటి ఎన్నో క్లిష్టమైన బాధ్యతలను ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తీసుకున్నాయి. విదేశీ ప్రభుత్వాల కదలికలను విశ్లేషించడం, సెక్యూరిటీ రిస్క్ లను అంచనా వేయడం నుంచి మిలిటరీ ఆపరేషన్లకు సపోర్ట్ చేయడం వరకు అన్నీ అత్యంత రహస్యంగా, ప్రజల కంటికి కనిపించకుండా సాగుతాయి.
నేటి ఆధునిక ప్రపంచంలో గూఢచర్యం అంటే కేవలం చీకట్లో తిరిగి సమాచారం సేకరించడం మాత్రమే కాదు. ఎవరి దగ్గర ముందస్తు సమాచారం ఉంటే వారే ఈ యుద్ధంలో విజేతలు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. సమాచారాన్ని వేగంగా సేకరించడం, దాన్ని ఎంత త్వరగా ధృవీకరించుకోవడం, ఇతరుల కంటే ముందుగా దానిని సరైన సమయంలో ఉపయోగించడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం..
ఆధునిక భౌగోళిక రాజకీయాల్లో ప్రభుత్వాలు యుద్ధాలను అర్థం చేసుకోవాలన్నా, వాటిని ఎదుర్కోవాలన్నా ఇంటెలిజెన్స్ రిపోర్టులే అసలు ఆధారం. రాబోయే ప్రమాదాలను ముందే పసిగట్టి ప్రభుత్వాలను అప్రమత్తం చేయడంలో ఇవి ఎల్లప్పుడూ ముందుంటాయి. కొన్ని సంస్థలు కేవలం విదేశీ ఇంటెలిజెన్స్ పైనే దృష్టి పెడితే, మరికొన్ని సంస్థలు అంతర్గత భద్రత, కౌంటర్ ఇంటెలిజెన్స్ పై కన్నేసి ఉంచుతాయి.
సైబర్ వార్ ఫేర్ ద్వారా నెట్ వర్క్ లను గుప్పిట్లో పెట్టుకోవడం, ఎన్క్రిప్టెడ్ సిస్టమ్స్ ద్వారా రహస్య గదుల్లో జరిగే ఈ ఆపరేషన్ల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశమే ఉండదు. ఆయుధాల కన్నా సమాచారమే అత్యంత విలువైన ఆయుధంగా మారుతున్న నేటి హైటెక్ ప్రపంచంలో ఈ రహస్య సంస్థలే దేశాలకు రక్షణ కవచాలు. మరి ఈ సమాచార యుద్ధంలో ముందు ముందు ఇంకెన్ని సంచలనాలు నమోదు కానున్నాయో చూడాలి.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..