
నీలం రత్నం శని గ్రహానికి ప్రతీక. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఈ రత్నం ఒక వ్యక్తిని రాత్రికి రాత్రే అదృష్టవంతుడిని చేయగలదు లేదా తీవ్రమైన నష్టాలను కలిగించగలదు. అందుకే దీనిని ధరించే ముందు సరైన పరీక్ష, నిపుణుల సలహా తప్పనిసరి. నీలం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, కెరీర్‌లో ఆకస్మిక పురోగతి లభిస్తుందని, మానసిక ప్రశాంతత చేకూరుతుందని నమ్ముతారు. ముఖ్యంగా మకర, కుంభ రాశుల వారు దీనిని ధరించడానికి అర్హులు. అయితే, విరిగిన లేదా రంగు మారిన నీలాన్ని ఎప్పుడూ ధరించకూడదు. ఈ రత్నాన్ని ధరించే ముందు పాటించాల్సిన నియమాలు, ఏ రాశివారికి అనుకూలంగా ఉంటుందో ఇక్కడ చూద్దాం.
ఆర్థిక పురోగతి వృద్ధి చెందుతుంది. వ్యాపారంలో నష్టాలు తగ్గుతాయి. ఆదాయ మార్గాలు మెరుగుపడతాయి. వృత్తి పరంగా ఎదుగుదల ఉంటుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్లు లేదా ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల ఆందోళనలు దూరం చేస్తుంది. నాడీ సంబంధిత సమస్యలు, కంటి వ్యాధులు, ఎముకలకు సంబంధించిన రోగాల నుండి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఏకాగ్రత పెరుగుతుంది. దీంతో ఆలోచనా శక్తిని పెంచి, నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టతను ఇస్తుంది.
అయితే, ఈ రత్నాన్ని ధరించే ముందు తప్పనిసరిగా చేయాల్సిన పరీక్ష కూడా ఉంటుంది. ఎందుకంటే.. ఈ నీలం అందరికీ సరిపడదు. దీనిని ధరించడానికి ముందు ఒక పరీక్ష చేయాలి. శనివారం నాడు నీలం రత్నాన్ని ఒక నీలిరంగు వస్త్రంలో కట్టి, రాత్రి నిద్రపోయేటప్పుడు తల కింద పెట్టుకోవాలి. ఆ రాత్రి మీకు ప్రశాంతమైన నిద్ర పట్టి, ఎలాంటి భయంకరమైన కలలు రాకపోతే ఆ రత్నం మీకు శుభ ఫలితాలను ఇస్తుందని అర్థం. అలాగే, ధరించే విధానం, నియమాలు కూడా తప్పనిసరిగా తెలుసుకోవాలి.
ఇకపోతే నీలం ధరించాల్సిన రాశులు ప్రత్యేకించి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. వారిలో మకర, కుంభ రాశుల వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. వృషభ, తులా రాశుల వారు కూడా నిపుణుల సలహాతో ధరించవచ్చు. దీనిని వెండి లేదా పంచలోహాలతో చేసిన ఉంగరంలో ధరించాలి. శనివారం ఉదయం లేదా సాయంత్రం వేళలో, శని మంత్రాన్ని పఠిస్తూ మధ్యవేలికి (Middle Finger) ధరించాలి.
అలాగే, ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. నీలం రత్నంతో పాటు పగడం (Coral) లేదా మాణిక్యం (Ruby) ధరించడం నిషేధం అంటున్నారు పండితులు, జ్యోతిశాస్త్ర నిపుణులు. వాస్తవానికి రత్నాలు గ్రహ దోషాలను పోగొట్టి అదృష్టాన్ని ఇస్తాయన్నది నమ్మకం. అయితే, నీలం లాంటి శక్తివంతమైన రత్నాలను ధరించే ముందు అనుభవజ్ఞుడైన జ్యోతిష్యుని సంప్రదించడం ఎంతో ముఖ్యం.
Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..