
వంట గదిలో గృహిణులు ఎదుర్కొనే అతిపెద్ద సమస్యల్లో ఒకటి.. వంట చేస్తున్నప్పుడు మధ్యలో గ్యాస్ అయిపోవడం. సిలిండర్ బరువును బట్టి కొంతవరకు అంచనా వేయగలిగినా, కచ్చితంగా ఎంత గ్యాస్ ఉందో తెలుసుకోవడం కష్టమవుతుంది. చాలా మంది గ్యాస్ అయిపోయిన తర్వాతే కొత్తది బుక్ చేసుకుంటారు, దీనివల్ల సమయం వృథా అవడమే కాకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. అలా మనం వంట చేసేటప్పుడు అకస్మాత్తుగా సిలిండర్‌లోని గ్యాస్ అయిపోతే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు. సిలిండర్ ఇనుముతో తయారై ఉండటం వల్ల లోపల ఎంత గ్యాస్ ఉందో చూడటం సాధ్యం కాదు. అయితే, ఒక చిన్న చిట్కాతో ఇంట్లోనే సులభంగా గ్యాస్ స్థాయిని తెలుసుకోవచ్చు.
1. తడి గుడ్డ చిట్కా (Wet Cloth Hack):
సిలిండర్ స్థాయిని పరీక్షించడానికి శాస్త్రీయంగా నిరూపితమైన ఒక సులభమైన పద్ధతి ఉంది. ముందుగా ఒక గుడ్డను నీళ్లలో తడిపి, సిలిండర్ చుట్టూ పూర్తిగా తుడవండి. సిలిండర్ మొత్తం తడిగా ఉన్నప్పుడు, కాసేపు వేచి చూడండి.
ఇది ఎలా పనిచేస్తుంది?: మీరు గమనిస్తే, సిలిండర్ పైభాగం త్వరగా ఆరిపోతుంది, కానీ కింది భాగం కొంత సమయం వరకు తడిగానే ఉంటుంది. దీనికి కారణం థర్మోడైనమిక్స్. సిలిండర్ లోపల ఎల్పీజీ ద్రవ రూపంలో ఉంటుంది. ఈ ద్రవం బయటి వాతావరణం కంటే చాలా చల్లగా ఉంటుంది. సిలిండర్‌లో గ్యాస్ (ద్రవం) ఎంతవరకు అయితే ఉంటుందో, ఆ భాగం చల్లగా ఉండటం వల్ల నీరు త్వరగా ఆవిరి కాదు. గ్యాస్ లేని ఖాళీ భాగం వేడిగా ఉండటం వల్ల అక్కడ నీరు వెంటనే ఆరిపోతుంది.
2. మంట రంగును గమనించండి:
స్టౌ వెలిగించినప్పుడు మంట నీలి రంగులో (Blue Flame) ఉంటే గ్యాస్ నిండుగా ఉందని అర్థం. ఒకవేళ మంట పసుపు లేదా నారింజ రంగులోకి మారుతుంటే, గ్యాస్ అయిపోవడానికి సిద్ధంగా ఉందని, వెంటనే కొత్త ఆర్డర్ ఇవ్వాలని సంకేతం.
3. గ్యాస్ లెవల్ ఇండికేటర్లు:
మార్కెట్లో ప్రస్తుతం గ్యాస్ లెవల్ ఇండికేటర్లు లేదా మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిని సిలిండర్‌కు అతికిస్తే, లోపల ఉన్న గ్యాస్ స్థాయిని అవి రంగుల ద్వారా చూపిస్తాయి.
4. స్మార్ట్ రెగ్యులేటర్లు:
ఇప్పుడు గేజ్ (Gauge) ఉన్న రెగ్యులేటర్లు వస్తున్నాయి. ఇవి గ్యాస్ ఒత్తిడిని కొలిచి, సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో సూచీ ద్వారా చూపిస్తాయి. ఇది సాంకేతికంగా మరింత నమ్మదగిన మార్గం.
5. బరువును సరిచూసుకోవడం:
ప్రతి సిలిండర్‌పై ‘టేర్ వెయిట్’ (Tare Weight) ఉంటుంది. ఖాళీ సిలిండర్ బరువును, నిండు సిలిండర్ బరువును (సుమారు 14.2 కేజీల గ్యాస్) కలిపి చూస్తే ఎంత వాడారో లెక్క కట్టవచ్చు.
6. నీటి పరీక్ష:
సిలిండర్‌పై నుండి క్రిందికి కొద్దిగా గోరు వెచ్చని నీరు పోయాలి. నీరు పోసిన తర్వాత గ్యాస్ ఉన్న భాగం చల్లగా ఉంటుంది. ఖాళీ భాగం మాత్రం వేడిగా ఉంటుంది. దీనితో సిలిండర్ లో గ్యాస్ ఎంత వరకు ఉందో అంచనా వేయవచ్చు.
7. సౌండ్ టెస్ట్ :
సిలిండర్‌ను మెల్లగా ట్యాప్ చేసి చెక్ చేయాలి . గ్యాస్ ఉన్న భాగం లైట్ గా శబ్దం వస్తుంది . గ్యాస్ లేని భాగం మాత్రం టంగ్ , టంగ్ అని శబ్దం వస్తుంది . ఈ విధంగా గ్యాస్ లెవెల్స్ అంచనా వేయవచ్చు.
8. చాక్ పీస్ టెస్ట్ :
మనం ఒక చాక్ పీస్ తీసుకోని దానిని నీళ్ళల్లో ముంచి సిలిండర్ పై పైనుండి క్రిందికి గట్టిగ ఒక లైన్ గీయాలి .ఎక్కడివరకు అయితే చాక్ పీస్ లైన్ తడిగా ఉంటుందో అక్కడ వరకు గ్యాస్ ఉన్నట్లు . ఈ చిట్కాలను పాటించడం వల్ల గ్యాస్ ఎప్పుడు అయిపోతుందో ముందే ఊహించి, చివరి నిమిషంలో కలిగే ఇబ్బందులను నివారించవచ్చు.
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం క్లిక్ చేయండి..